Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్కడా, ఇక్కడా వివక్షే
- క్రీడాకారులకే నయం..
- అవార్డులు ఎలాగూ ఇవ్వరు
- మనోళ్ళకి ప్రోత్సాహం కరవు
- తెలుగు చిత్ర పరిశ్రమ కూడా అంతే..
- సినిమా ఫంక్షన్లలో మెరుస్తారు..
- ఇకనైనా పరిశ్రమ స్పందించాలి
- చంద్రబోస్ ఏం చేస్తున్నారంటే...
ఆస్కార్.. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఆస్కార్‌ని దక్కించుకోవాలని ఆరాటపడుతుంటారు. తొమ్మిదిన్నర దశాబ్దాల ఆస్కార్ చరిత్రలో ఇంత వరకు మన దేశానికి ఒక్క ఆస్కార్ కూడా రాలేదు. అయితే ఆ చరిత్రను తిరగరాస్తూ 95వ ఆస్కార్ వేడుకల్లో రెండు ఆస్కార్లతో మన దేశం విజయకేతనం ఎగురవేసింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు..' పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' డాక్యు మెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ప్రస్టేజియస్ ఆస్కార్లను కైవసం చేసుకుని మనందర్ని గర్వపడేలా చేశాయి. అయితే 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'తో పోలిస్తే విశ్వవ్యాప్తంగా ఎలుగెత్తి చాటిన తెలుగు సినిమా పాట మన దేశంలోనే వివక్ష ఎదుర్కోవటం గమనార్హం.
ఆస్కార్‌ని అందుకున్న 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' దర్శక, నిర్మాతలను, నటీనటులను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. అంతేకాదు దర్శకురాలు కార్తికి గోన్స్లేవ్కి ఏకంగా కోటి రూపాయల నగదుని ముఖ్యమంత్రి స్టాలిన్ అందజేశారు. అలాగే నటీనటులుకు సైతం చెరొక లక్ష రూపాయలు ఇచ్చారు. ప్రకృతితో మమేకమై మనుషులు ఎలా జీవించాలి?, జంతువులను ఎలా సంరక్షించాలి అనేదానికి ప్రతిబింబంగా ఈ షార్ట్ ఫిల్మ్ నిలిచిందని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర సమాచారశాఖా మంత్రి వంటి తదితరులు ప్రశంసల వర్షం కురిపించి, షార్ట్ ఫిల్మ్ దర్శక, నిర్మాతల కష్టాన్ని, ప్రతిభను సముచితంగా గౌరవించారు.
సరిగ్గా ఒక్క రోజు క్రితం మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఘనస్వాగతం లభించింది. క్రీడాశాఖామంత్రి శ్రీనివాస్‌గౌడ్, తర్వాత క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను ఘనంగా సత్కరించారు. ఇది మచ్చుకి ఒక ఉదాహరణ మాత్రమే..
మరి ఆస్కార్‌లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకుని వస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేశాయి?, చిన్న చిన్న సినిమా ఫంక్షన్లలోనూ మెరిసే సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పరిశ్రమకి ప్రభుత్వం అండగా ఉంటుందని పలుమార్లు సినిమా వేదికలపై చెప్పిన కేటీఆర్, ఏపీ ముఖ్యమంత్రి సైతం ఇదే కోవలో ఉన్నారు. కేవలం అభినందనల ట్వీట్లకే పరిమితం అయ్యారు. కేంద్రప్రభుత్వం దీనికి భిన్నంగా షార్ట్ ఫిల్మ్ దర్శక, నిర్మాతల ప్రతిభని ఆకాశానికి ఎత్తేస్తోంది. మంచిదే. గర్వకారణం కూడా. మరి ఆస్కార్‌తోపాటు అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏమిటో చాటినోళ్ళ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం విడ్డూరం కాదా.
తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత సినిమా వాళ్ళకి అవార్డులు ఇవ్వడం మానేశారు. అలాంటిది ప్రతిష్టాత్మక అవార్డు తీసుకొస్తే పట్టించుకోకపోవడం బాధాకరం. ఇక తెలుగు సినిమా పరిశ్రమ మాత్రం తక్కువేం తినలేదు. తమ సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలపై పెట్టే శ్రద్ధలో హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఒక్కశాతం కూడా వీళ్ళ మీద పెట్టలేదు. ఓ పెద్ద వేదికపై మనోళ్ళని మనమన్నా గౌరవించి, ప్రోత్సహిద్దామనే ఆలోచనే చేయలేదు. అయితే వ్యక్తిగతంగా పలువురు విజేతలకు శాలువాలు కప్పి ఆస్కార్ తమకే వచ్చినంత చందానా ముద్దాడి మురిసిపోయారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల తరఫున వివక్షతకు గురైన తెలుగు పాటకి సముచిత గౌరవం అందించాల్సిన తెలుగు చిత్రసీమ కూడా స్పందించకపోవడం అత్యంత విచారకరం. ఇప్పటికైనా కనీసం తెలుగు చిత్రసీమ స్పందించి ఆస్కార్ విజేతలను గౌరవించి, తద్వారా అందరిలోనూ స్ఫూర్తిని, ఉత్సాహాన్ని నింపి యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలకు మార్గదర్శిగా నిలుస్తుందని ఆశిద్దాం.