Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ విజేతలకు ఘన సన్మానం
విశ్వవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్.. ఆస్కార్. ఆస్కార్ చరిత్రలో ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకి ఆస్కార్ దక్కలేదు. కానీ మన తెలుగు సినిమా పాట ఆస్కార్‌ని దక్కించుకుని ఓ సువర్ణాధ్యాయాన్ని క్రియేట్ చేసింది. ఒరిజనల్ సాంగ్ విభాగంలో 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు..'పాటకు ఆస్కార్ పురస్కారం లభించింది. అయితే ఇంతటి సంచలనం క్రియేట్ చేసిన ఈ ఆస్కార్ విజేతలను ఇప్పటి వరకు అటు ఇండిస్టీగాని, ఇటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే కేంద్రప్రభుత్వం సైతం సముచితంగా గౌరవించలేదు. కేవలం అభినందనల ట్వీట్లతో మమా.. అనిపించారు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది మన దేశం నుంచి 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' షార్ట్ ఫిల్మ్‌కి కూడా ఆస్కార్ పురస్కారం దక్కింది. అంతేకాదు ఈ షార్ట్ ఫిల్మ్ దర్శక, నిర్మాతలకు తమ రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం సైతం ఘనంగా సత్కరించింది. అంతేకాదు తమిళనాడు ముఖ్యమంత్రి ఈ షార్ట్ ఫిల్మ్ దర్శకురాలికి కోటి రూపాయల ప్రోత్సాహాక నగదు బహుమతిని అందజేసి విజేతలకు తాము ఇస్తున్న గౌరవాన్ని సర్వత్రా చాటారు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ నవచిత్రంలో 'మనోళ్ళని పట్టించుకోవట్లే' అని ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ఆ ఆర్టికల్ ఎఫెక్ట్ కాబోలు.. ఎట్టకేలకు పరిశ్రమ ఒక్క అడుగు ముందుకేసి మన ఆస్కార్ విజేతలను సత్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈనెల 9వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో తెలుగు సినీ పరిశ్రమ ఘన సన్మానం చేసి గౌరవించనుంది. ఈ వేడుకలో నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు హాజరు కానున్నారు అని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కె. ఎల్. దామోదర్ ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.