Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పుడు తెలుగు సినిమా వైపు యావత్ ప్రపంచం చూస్తోంది. తెలుగు సినిమాలు సాధిస్తున్న విజయాలు, కథల ఎంపిక తీరు, నటీనటుల నటనా ప్రతిభ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న వైనాన్ని అన్ని చిత్రపరిశ్రమలు సునిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇటువంటి వంటి తరుణంలో దక్కిన ఆస్కార్ అవార్డ్ యావత్ భారతదేశంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా, తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచేలా చేసింది. అయితే అంతటి ప్రతిష్టాత్మక అవార్డుని సగర్వంగా తీసుకొచ్చిన విజేతలను మాత్రం అటు పరిశ్రమ, ఇటు రెండు రాష్ట్రప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక కేంద్రప్రభుత్వం సరేసరి. కనీసం వారిని సముచితంగా గౌరవిద్దాం అని ఆలోచన కూడా చేయలేదు.
అయితే ఆలస్యంగా మేల్కొన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆస్కార్ విజేతలు కీరవాణి, చంద్రబోస్‌లను ఈనెల 9న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా సత్కరించ బోతున్నట్టు ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో నిర్మాత కె.ఎస్.రామరావు తన ఆలోచనలను మీడియాతో షేర్ చేశారు.
హీట్ పెంచిన నవతెలంగాణ ఎఫెక్ట్..
ఆస్కార్ విజేతలకు సంబంధించి నవచిత్రంలో ఈనెల 3వ తేదీ ప్రచురితమైన 'మనోళ్ళను పట్టించుకోవట్లే..' ఆర్టికల్ ఎఫెక్ట్ పరిశ్రమలో హీట్ పెంచింది. ఈ ఆర్టికల్ ప్రచురితమైన తర్వాతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించి ప్రకటన చేయటం విశేషం. అలాగే ప్రభుత్వాలు కూడా కలిసి రావాలని పలువురు నిర్మాతలూ ఘాటుగా స్పందించడం మరో విశేషం.
పరిశ్రమే కాదు.. ప్రభుత్వాలూ చేయాలి
''ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు.. పాట అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ పురస్కారం అందుకోవడం దేశానికే గర్వకారణం. అందులోనూ తెలుగు సినిమాకు దక్కిన తొలి ఆస్కార్ కావడం తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ప్రత్యేకం. తెలుగు సినిమాను ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లిన కీరవాణి, చంద్రబోస్‌లతోపాటు రాజమౌళి టీమ్‌ని ఘనంగా సత్కరించాలి. ఇది చిత్ర పరిశ్రమ ఒకటే చేయాల్సిన పని కాదు.. తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా భావించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేయాల్సిన పని' అని సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు అన్నారు. తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకొచ్చిన 'ఆర్ఆర్ఆర్' టీమ్‌ను ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, సినిమా పరిశ్రమకు చెందిన పలు శాఖల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించనున్నారు. ఆదివారం జరగనున్న ఈ వేడుకకు శిల్పకళావేదిక వేదిక కానుంది. ఈ సందర్భంగా కె.ఎస్.రామారావు శనివారం ఫిల్మ్ ఛాంబర్లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు.
'చిత్ర పరిశ్రమకు చెందిన అన్నీ అసోసియేషన్లు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి కట్టుగా ఈ వేడుక చేస్తే బాగుంటుంది. ఈ వేడుకను గొప్పగా చేయడానికి పరిశ్రమలో కొన్ని సంస్థలకు ఆర్థిక వనరులు లేవు. ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో ఆర్థిక వనరులు బాగా ఉన్నాయి. దానితో కలిసి ఈ వేడుక నిర్వహిస్తే విజేతలను సముచితంగా గౌరవించగలం. వివిధ రంగాల్లో చిన్న అవార్డు, గుర్తింపు సాధిస్తేనే ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు వంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం చేేస్తుంటాయి. అలా 'ఆర్ఆర్ఆర్' కళాకారులకు ప్రభుత్వాలు ఏమన్నా చేయాలి. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలను పక్కనపెట్టి ఆస్కార్ విజేతలను ఘనంగా సన్మానించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.