Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భర్త రాక కోసం..భార్య పడే విరహ వేదన నేపథ్యంలో ఒకే ఒక పాత్రతో రూపొందిన చిత్రం 'రారా పెనిమిటి'. శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో సింగిల్ క్యారెక్టర్లో నందిత శ్వేత నటించగా, సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. ప్రమీల గెద్దాడ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రీ -రిలీజ్ వేడుకలో సంగీత దర్శకుడు మణిశర్మ మాట్లాడుతూ,'దర్శకుడు ఒక మంచి కథతో వచ్చి కలిశారు. మంచి పాటలు చేసే అవకాశం కల్పించిన దర్శకుడికి థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంత వరకు చేసిన కంపోజిషన్‌లో నాకు ఇష్టమైన పాటలు ఇందులో ఉన్నాయి. నీలకంఠ చక్కటి సాహిత్యాన్ని అందించారు. నందిత అద్భుతంగా నటించింది' అని అన్నారు. 'దర్శకుడు కథ చెప్పి, ఒకే ఒక పాత్ర అనగానే ... ఈ పాత్ర చేయగలనా అని మొదట భయపడ్డాను. సాహసమే అయినా ఓకే చెప్పాను. కొత్తగా పెళ్లైన అమ్మాయి..తన భర్త రాక కోసం పడే విరహ వేదనే ఈ చిత్రం. అన్ని ఎమోషన్స్ ఈ పాత్రలో ఉన్నాయి. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రాణం' అని హీరోయిన్ నందిత శ్వేత తెలిపారు.
దర్శకుడు సత్య వెంకట గెద్దాడ మాట్లాడుతూ, 'గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ కావడంతో ఆ గడుసుతనం ఉన్న అమ్మాయి కావాలని... చాలా మందిని సెర్చ్ చేశాక, నందిత పర్ఫెక్ట్ అని తీసుకున్నాం. తను నేను అనుకున్న దానికన్నా అద్భుతంగా చేసింది. మణిశర్మ సినిమా చేయడమే పెద్ద ఎస్సెట్‌గా భావిస్తున్నాం. నీలకంఠ చక్కటి సాహిత్యాన్ని సమకూర్చారు. ఒకే ఒక పాత్ర అయినప్పటికీ హీరోయిన్‌తో పలు పాత్రలు ఫోన్లో సంభాషిస్తుంటాయి. ఆ పాత్రలకు బ్రహ్మానందం, తణికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ ఇలా పలువురు నటీనటులు డబ్బింగ్ చెప్పారు. సినిమా అంతా పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం' అని అన్నారు.