Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితంలో ఏదో సాధించాలని మనకు చెప్పే పాత్రలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. అలాంటి పాత్రలతో రూపొందిన చిత్రమే 'విమానం'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవిధ్యమైన పరిస్థితులు, వాటికి సరిపోయేటువంటి సున్నితమైన పాత్రలను చూడొచ్చు. సముద్ర ఖని అంగ వైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునే వీరయ్య అనే తండ్రి పాత్రలో నటించారు.
జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ సినిమా రూపొందుతోంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రోమోను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ప్రోమోలో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం కనిపిస్తుంది. రాజు అనే అనే అబ్బాయి తన తండ్రితో మాట్లాడుతూ.. ఓసారైనా తనని విమానం ఎక్కించమని అడుగు తుంటాడు. విమానం ఎక్కటానికి ఎందుకంత ఇష్టం నీకు అని అడిగితే పై నుంచి చూస్తే అన్నీ చిన్నగా కనిపిస్తాయని అంటాడు. అయితే బాగా చదువుకుంటే పెద్దయ్యాక నువ్వే విమానం ఎక్కొచ్చని తండ్రి అంటాడు. ఇందులో సున్నితంగా, తండ్రీ కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను చక్కగా ఎలివేట్ చేశారు రైటర్, డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల.
ఈ సందర్భంగా జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షరు క్రేజీవాల్ మాట్లాడుతూ, 'భావోద్వేగాల కలబోతగా, బలమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాని కిరణ్ కొర్రపాటితో కలిసి చేయటం హ్యాపీగా ఉంది' అని తెలిపారు. సముద్ర ఖని, మాస్టర్ ధ్రువన్తో పాటు మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, రాహుల్ రామకృష్ణ, ధన్రాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమా జూన్ 9న గ్రాండ్గా రిలీజ్ కానుంది.