Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ సమ్మర్ సీజన్ చిత్ర పరిశ్రమకు చాలా ముఖ్యమైనది. స్కూళ్ళకు, కాలేజీలకు సెలవులు కావడంతో ఈ సీజన్లో ఎలాగైనా తమ సినిమలను రిలీజ్ చేసి, భారీ కలెక్షన్లు రాబట్టుకోవాలని మేకర్స్ ప్రయత్నిస్తుంటారు. దీనికి తగ్గట్టుగా పక్కా ప్లానింగ్‌తో సినిమాలను విడుదల చేస్తుంటారు. అయితే ఈ సమ్మర్ సీజన్లో కూడా బోల్డెన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయ్. ఇందులో భాగంగా ఈనెలలో ఇప్పటివరకు విడుదలైన చిత్రాలు మేకర్స్ ఆశలను తలకిందులు చేశాయి. ప్రేక్షకులను సైతం బాగా నిరాశపర్చి, మేకర్స్‌కి భారీ గుణపాఠాలు నేర్పాయి.
మార్చి 30వ తేదీన విడుదలైన నాని 'దసరా' సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసి ఈ సమ్మర్ సీజన్‌కి మరింత ఉత్సాహాన్నిచ్చింది.
అయితే ఈ విజయపరంపరను కొనసాగిం చేందుకు బరిలోకి దిగిన 'రావణాసుర', 'మీటర్' చిత్రాలు ప్రేక్షకుల నిరాదరణకు గురయ్యాయి. ఈనెల 7వ తేదీన ఈ రెండు చిత్రాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'రావణాసుర' అటు యాక్షన్ ఎంటర్టైనరా? లేక ఇటు థ్రిల్లరా అని ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేసింది. రవితేజ, సుధీర్‌వర్మ కాంబినేషన్లో నలుగురు కథానాయకలతో భారీ బడ్జెట్‌తో రూపొంది, అదే స్థాయి పరాజయాన్ని చవిచూసింది. ఇక, ఈనెల 7న మాస్ 'మీటర్' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం. 'రాజావారు రాణివారు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం', 'నేను మీకు బాగా కావాల్సినవాడినే', 'సమ్మతమే' 'వినరో భాగ్యము విష్ణుకథ' వంటి భిన్న చిత్రాల్లో నటించి జయాపజయాలతో నిమిత్తం లేకుండా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నాడు. అయితే సాధ్యమైనంత త్వరగా మాస్ హీరో అయిపోదామనుకుని పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న 'మీటర్' కథని ఎంపిక చేసుకున్నాడు. ఇదే ఆయనకి పెద్ద మైనస్ అయ్యింది. ఎంచుకున్న కథకి ఆయన హీరోగా సూట్ అవ్వలేదు కదా, మాస్ హీరోకి కావాల్సిన క్వాలిటీలు ఏమాత్రం లేవని కూడా తెలిసేలా చేసుకున్నాడు. పైగా ఎంచుకున్న కథేమన్నా కొత్తదా అంటే అది కూడా రొటీన్ రొడ్డకొట్టుడు కధే. తండ్రి కోసమని తనకు ఇష్టంలేని పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యే ఓ కుర్రాడి కథ. రొటీన్ వీక్ లైన్‌తో మాస్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలబడింది.
దర్శకుడు గుణశేఖర్ సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కథ డిమాండ్ చేస్తే ఖర్చుకి వెనుకాడకుండా భారీ సెట్లు వేయిస్తారు. తాజాగా ఇలాంటి ప్రయత్నమే ఆయన 'శాకుంతలం' సినిమాకి చేశారు. సమంత ప్రధాన పాత్రధారిణిగా రూపొందిన ఈ చిత్రం ఈనెల 14న విడుదలైంది. అందరికీ బాగా దుష్యంతుడు, శకుంతల మధ్య సాగిన ప్రేమగాథను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో గుణశేఖర్ ఘోరంగా విఫలమయ్యారు. పేలవమైన కథతో, లోపాల గ్రాఫిక్స్‌తో, చిరాకు పెట్టే త్రీడీ ఎఫెక్ట్‌లతో పరమ బోర్ కొట్టించి, ప్రేక్షకుల సహనానికి పరీక్షపెట్టారు. ఇక 14న, రాఘవ లారెన్స్ నటించిన 'రుద్రుడు' అనువాద చిత్రం విడుదలైంది. ఈ సినిమా కూడా రొటీన్ కథతో ప్రేక్షకుల్ని మెప్పించలేక బోల్తాపడింది.
రవితేజ, సమంత, లారెన్స్, కిరణ్ అబ్బవరం ఎవరి స్థాయిలో వారికి వారి సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకునే స్థాయిలో కథలు లేకపోవడం, మేకింగ్‌లో లోపాలు, మనం ఏం చేసినా చెల్లుతుందునే ఓవర్ కాన్ఫిడెన్స్‌కి ప్రేక్షకుల తిరస్కరణ భారీ గుణపాఠం చెప్పింది. యావత్ సినీ ప్రపంచానికి తెలుగు సినిమా కేంద్రబిందువుగా నిలిచిన ఇటువంటి తరుణంలో ఇలాంటి రొడ్డకొట్టుడు కథలతో, అవగాహన లేని గ్రాఫిక్స్ పనితీరుతో, నిర్లక్ష్య వైఖరితో సినిమాలు చేస్తే మన తెలుగు సినిమా గౌరవాన్ని మనమే తగ్గించిన వాళ్ళమవుతామని మేకర్స్ గుర్తించాలి.