Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తరువాత గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మే 5న ఈ చిత్రం భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నటి ఖుష్బూ మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమా ప్రధానంగా కుటుంబ బంధాల గురించి ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా, కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యం. అలాంటి కథతో ఈ చిత్రం రూపొందింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబమంతా కలిసి ఉండాలని, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఈ సినిమా చెబుతుంది. అందుకే ఈ సినిమా నాకు అంత దగ్గరైంది. ఇందులో నా పాత్ర మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుంది. సంప్రదాయ ఆహారం విలువని తెలిపేలా నా పాత్ర ఉంటుంది. నా పాత్ర పేరు భువనేశ్వరి. గోపీచంద్‌తో కలిసి మొదటిసారి నటించాను. ఇక జగపతిబాబు నటుడు కాకముందు నుంచే నాకు తెలుసు. బాల నటిగా వారి జగపతి ఆర్ట్స్‌లో రెండు సినిమాలు చేశాను. నేను చౌ మామ అని పిలుస్తాను. ప్రస్తుత కాలంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాంటి గొప్ప నిర్మాణ సంస్థను చూడటం చాలా కష్టం. నేను శ్రీవాస్‌తో మొదటిసారి పని చేస్తున్నట్లు అనిపించలేదు. టీవీ షోలు చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సినిమాలో దర్శకుడు రూపొందించిన పాత్రకి తగ్గట్లుగా నటించాల్సి ఉంటుంది. కానీ టీవీ షోలు అలా కాదు. నేను నాలాగా ఉండొచ్చు. తెలుగులో ఇప్పటిదాకా బాలకృష్ణతో సినిమా చేయలేదు. ఆయనతో చేయాలని ఉంది. అలాగే బిగ్‌బి అమితాబ్‌తో జోడీగా నటించలేదనే బాధ ఉంది. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్‌ని. నా బెడ్రూమ్లో ఆయన ఫొటోలు ఉంటాయి' అని చెప్పారు.