Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి, పుష్ప, ఆర్ ఆర్ ఆర్' వంటి చిత్రాలతో యావత్ ప్రపంచం తెలుగు సినిమా వైపు చూసేలా చేశాయి. ఇప్పుడు దేశం, భాషలకు అతీతంగా దక్షిణ భారత చిత్రాల పట్ల ముఖ్యంగా తెలుగు సినిమా అంటే అబ్బురపడేలా చేశాయనటంలో అతిశయోక్తి లేదు. ఈ ఎదుగుదల క్రమం చూసి ప్రాంతీయ, చిన్న దేశాల చలన చిత్ర నిర్మాణ సంస్థలు సాంకేతిక నిపుణులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నేపాల్ సూపర్ స్టార్ భువన్ కె సి, యువ నటుడు ఆయుష్మాన్తో పాటు పలువురు నేపాల్ చలన చిత్ర ప్రముఖులు పేర్కొన్నారు. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని నేపాల్ ఫిలిం బోర్డ్ ఆడిటోరియంలో ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా, నేపాల్ ఫిల్మ్ ప్రమోషన్ సర్క్యూట్ సంయుక్తంగా నిర్వహించిన ఇండో నేపాల్ ఫిలిం ఎక్స్చేంజి - 2023 సదస్సుకి మన దేశం నుండి ఎఫ్టిఫైసి అధ్యక్షులు చైతన్య జంగా, కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి హాజరయ్యారు.
ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు భాషా సరిహద్దుల్ని చెరిపి అంతర్జాతీయంగా ప్రేక్షకులను మమేకం అయ్యేలా చేస్తాయని, ఇటువంటి కార్యక్రమాలు అనేక దేశాలలో జరిపేలా ప్రణాళికలు చేస్తున్నామని ఎఫ్ టి పి సి ఇండియా అధ్యక్షులు చైతన్య జంగా, వీస్ వర్మ పాకలపాటి తెలిపారు. నేపాల్ చిత్రాలకు భారత్ దేశంలో వ్యాపార అవకాశాలు కల్పించడంతో పాటు నేపాలీ చిత్రాలు ఇండియాలోని పలు లొకేషన్లలో... అలాగే ఇండియన్ మూవీస్ నేపాల్లో చిత్రీకరణ జరుపుకొనేలా కృషి చేస్తున్న ఎఫ్ టి పి సి ఇండియా సంస్థ సేవలు అమోఘమని నేపాల్ ఫిలిం ప్రమోషన్ సర్క్యూట్ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు నూతన్ నిపాడే, హిమాల్ కొనియాడారు.