Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మిస్టికల్ థ్రిల్లర్ 'విరూపాక్ష'. సంయుక్తా మీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రం ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రేక్షకుల విశేష ఆదరణతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కార్తీక్ దండు మీడియాతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమా విజయపరంపర గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు.
'ఈ సినిమాకి ముందు 'భమ్బోళేనాథ్' సినిమాని డైరెక్ట్ చేశా. దాని తర్వాత చేసిన ఈ 'విరూపాక్ష'కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో హర్రర్ కామెడీలు వస్తున్నాయే తప్ప, స్ట్రిక్ట్ హర్రర్ మూవీస్ రావడం లేదనిపించింది. 2016, 2017లో ఓ పేపర్లో ఆర్టికల్ చదివా.
గుజరాత్లో ఓ మహిళ చేతబడి చేస్తుందన్న అనుమానంతో ఓ చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు ఈ కథ రాద్దామనిపించింది. నిజంగా ఆమెకు చేతబడి వచ్చి ఉంటే, వారందరూ చచ్చిపోయేవారేమో కదా. కథ రాసుకున్న తర్వాత సుకుమార్‌గారి దగ్గరకు వెళ్లడానికి ముందు చాలా చిన్న స్పాన్‌లో అనుకున్నాను. కానీ ఆయన కథ విన్న తర్వాత సాయితేజ్, ప్రసాద్‌గారిని డిసైడ్ చేశారు. ఇక క్లైమాక్స్‌లో ఆడియన్స్ థ్రిల్ అయిన విషయాలు సుకుమార్ చేసిన మార్పులే. హర్రర్ అంటే దెయ్యాలే కాదు. మనకు వెన్నులో చలి పుట్టించే ప్రతిదీ హర్రరే. ఆడియన్స్‌కి కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో మర్డర్లని కూడా కొత్తగా డిజైన్ చేశాం. ఈ సినిమా అరుంధతి, చంద్రముఖి మిక్స్ అని కామెంట్స్ వినిపించాయి. అయితే కథా పరంగా కాదు. సక్సెస్ పరంగా ఆ రెండు సినిమాలకూ మిక్స్ అని నమ్ముతా. వేరే భాషల్లో రిలీజ్ చేయటానికి 'కాంతార' ఫార్మేట్‌ని ఫాలో అవుతాం. ఇక్కడ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యాక, మిగిలిన భాషల్లో రిలీజ్ చేస్తాం' అని కార్తీక్ దండు తెలిపారు.