Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యావత్ ప్రపంచ సినీ పరిశ్రమ ఇప్పుడు తెలుగు సినిమా వైపు చూస్తోంది. కథల ఎంపిక, నటీనటుల నటనాతీరు, అత్యాధునిక సాంకేతికత.. ఇలా ప్రతీ విషయాన్ని సునిశితంగా గమనిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతున్న తరుణంలో తెలుగు సినిమా దర్శక, నిర్మాతలు, కథానాయకులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మన తెలుగు సినిమా గౌరవాన్ని మనమే తగ్గించుకోవడంతోపాటు ఖరీదైన తప్పిదాలతో ఆర్థికంగా భారీ మూల్యమూ చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి పరిస్థితిలోనే టాలీవుడ్ ఉంది. సమంత ప్రధాన పాత్రధారిణిగా భారీ బడ్జెట్‌తో రూపొందిన 'శాకుంతలం', అదే స్థాయి బడ్జెట్‌తో తెరకెక్కిన రవితేజ 'రావణాసుర' ఈ నెలలోనే విడుదలై భారీ పరాజయాల్ని చవిచూశాయి.
ఇక తాజాగా ఈ వారం విడుదలైన రెండు భారీ సినిమాలు 'ఏజెంట్', 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమాలు సైతం ప్రేక్షకుల నిరాదరణకు గురయ్యాయి. యువ హీరో అఖిల్ స్థాయిని మించి మితిమీరిన బడ్జెట్‌తో తీసిన 'ఏజెంట్' ప్రేక్షకులనే కాదు అక్కినేని ఫ్యాన్స్‌ని సైతం ప్చ్.. అని పెదవి విరిచేలా చేసింది. బాలీవుడ్ 'పఠాన్'ని పోలిన కథలా ఉండటంతోపాటు 'రా' ఏజెంట్ పని తీరుపై ఏ మాత్రం అవగాహన లేకుండా తీయడంతో డిజాస్టర్‌గా
నిలిచింది.
పొన్నియన్ సెల్వన్ 2 అంతే..
ఐశ్వర్యారాయ్, విక్రమ్, త్రిష, కార్తి, జయం రవి, ప్రకాష్‌రాజ్, ప్రభు, శరత్‌కుమార్, పార్తిబన్, శోభిత ధూళిపాళ్ళ వంటి హేమాహేమీలతో అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన 'పొన్నియన్ సెల్వన్ 2' సినిమా పరిస్థితి కూడా ఇంతే. దీని మొదటి పార్టే చాలా మందికి అర్థంకాలేదు. రెండవ పార్టు కూడా అదే పంథాలో నడిచి, ప్రేక్షకుల నిరాదరణకు గురైంది. మొత్తమ్మీద భారీ అంచనాలతో, భారీ బడ్జెట్లతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాల్లో కథ పరంగా దర్శక, నిర్మాతల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.
'నా 25 ఏండ్ల కెరీర్లో 'శాకుంతలం' పెద్ద జర్క్ ఇచ్చింది. ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తా. ఈ సినిమా విషయంలో నా జడ్జ్మెంట్ తప్పయ్యింది. రిలీజ్‌కి ముందే వేసిన ప్రీమియర్స్‌లో మిక్స్డ్ టాక్ వచ్చింది. తర్వాత విడుదలైన మార్నింగ్ షోనే అర్థమైంది.. సినిమా పోయిందని. అలాగే డిస్ట్రిబ్యూటర్ల నుంచి కూడా ఫోన్లు రాలేదు. అయితే ఈ పరాజయానికి కారణాలేమిటో రివ్యూ చేసుకుని, రాబోయే సినిమాల్లో ఈ తప్పు జరగకుండా చూసుకుంటా' అని 'శాకుంతలం' నిర్మాత దిల్‌రాజు ఓ యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.