Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పద్మాలయ సంస్థకు పునాది 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసినప్పటికీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమిది. అభిమానులు కోరిక మేరకు కృష్ణ జయంతి సందర్భంగా ఈనెల 31న ఈ చిత్రాన్ని అన్ని హంగులతో 4కేలో మళ్ళీ విడుదల చేస్తున్నాం' అని నిర్మాత, కృష్ణ సోదరుడు ఆదిశేష గిరి రావు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత అశ్వినిదత్, తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు బి. గోపాల్, రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ, 'మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని ఆ రోజుల్లో తీయడానికి మాకు స్ఫూర్తి రామారావు. ఆయన ఎన్ఏటీ సంస్థలా చిత్రాలు తీయాలనే కోరికతో పద్మాలయ సంస్థను స్థాపించాం. మోసగాళ్లకు మోసగాడు తర్వాత పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడిపంటలు.. చిత్రాలు జూబ్లీలు ఆడాయి. కృష్ణ జయంతికి అభిమానులందరూ ఈ చిత్రాన్ని మళ్ళీ థియేటర్లో విడుదల చేయమని కోరారు. కృష్ణకి ఘనమైన నివాళిగా ఈ చిత్రాన్ని మళ్ళీ విడుదల చేస్తున్నాం. మోసగాళ్లకు మోసగాడు కౌ బారు సినిమాల్లో ట్రెండ్ సెట్టర్. అప్పట్లోనే ఇది పాన్ వరల్డ్ సినిమా. దర్శకుడు కేఎస్ఆర్ దాస్, డీవోపీ వీఎస్ఆర్ స్వామీ, రచయిత ఆరుద్ర, సంగీత దర్శకులు ఆదినారాయణ .. ఇలా అందరూ అద్భుతమైన పనితీరు కనబరిచారు. మేము ఎన్ని సినిమాలు తీసినా అన్నింటికి మూలం మోసగాళ్లకు మోసగాడు. ఈ రోజే ఈ ప్రెస్మీట్ పెట్టడానికి ఒక కారణం ఉంది. మా బ్యానర్లోనే కాదు, కృష్ణ కెరీర్లో కూడా ప్రతిష్టాత్మక చిత్రం అల్లూరి సీతారామరాజు విడుదలై నేటికి 49 ఏళ్ళు అవుతుంది. వచ్చే యేడాది 50 ఏళ్ళు పూర్తి అవుతుంది' అని తెలిపారు.