Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సామాజిక ప్రయోజనం, బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని 'మహిషాసురుడు' చిత్రాన్ని నిర్మిస్తున్నామని మేకర్స్ తెలిపారు. అనిరుధ్, అపరాజిత సమర్పణలో శ్రీ శివరామ ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్.గురుప్రసాద్ ప్రధాన పాత్రలో వినోద్, రిచా కర్లా, ధరణి రెడ్డి హీరో హీరోయిన్లుగా ఈ సినిమా రూపొందుతోంది. రవికుమార్ గోనుగుంట దర్శకత్వం వహించిన ఈ చిత్ర ఆడియో బుధవారం ఫిలిం ఛాంబర్లో జరిగిన వేడుకలో విడుదలైంది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ళ భరణి, రేలంగి నరసింహారావు, గౌతం రాజు సంయుక్తంగా ఆడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రధాన పాత్రధారి, నిర్మాత డాక్టర్ ఎస్.గురుప్రసాద్ మాట్లాడుతూ, 'ప్రాణాలను కాపాడే కోట్లాది రూపాయలు ఖర్చయ్యే వైద్య పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బదులు వాటిని మన దేశంలోనే తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో వైద్య సహాయం అందివచ్చు అనే పాయింట్‌తో ఈ సినిమాను తీశాం. మన దేశంలో పరిశోధనలు చేసే సైంటిస్ట్లకు తగినంత గుర్తింపు లేదనే వాస్తవ అంశాలను సమాజానికి, ప్రభుత్వాలకు తెలియజేయాలనే సంకల్పంతో, అలాగే ఫైనాన్స్ కంపెనీల ప్రలోభాలకు లొంగి డబ్బులు తీసుకొని, వాళ్ల ఉచ్చులో చిక్కుకొని బయటకు రాలేక ఎన్నో కుంటుబాలు ఆత్మహత్యలు చేసుకొంటున్నాయి అనే మరో అంశాన్ని కూడా ఈ చిత్రంలో చూపించాం' అని చెప్పారు.
'ఎంతో బిజీ కార్డియాలజిస్ట్ అయిన గురుప్రసాద్‌కు ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. సమాజానికి మేలు చేయాలి, తక్కువ ఖర్చుతో వైద్య పరికరాలను మన దేశంలోనే తయారు చేసుకోగలిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడే వీలవుతుందన్న ఆయన తపనే ఈ చిత్ర నిర్మానికి మూలం. సినిమా చాలా బాగా వచ్చింది' అని దర్శకుడు అన్నారు.