Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు (శుక్రవారం) ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో గోపీచంద్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.
'ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. నేను కొన్నేళ్లుగా ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తున్నాను. ఫ్యామిలీ సినిమా చేసి చాలా రోజులైంది. శ్రీవాస్ ముందు యాక్షన్ ఫిల్మ్ చేద్దామన్నారు. వద్దు మనం చేసిన 'లక్ష్యం, లౌక్యం' సినిమాలలో యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి సినిమా చేద్దామని చెప్పాను. ఆ సమయంలో భూపతిరాజా ఈ కథ చెప్పడం, అది మాకు నచ్చడం.. అలా ఈ రామబాణం సినిమా మొదలైంది. అయితే 'లక్ష్యం' సినిమాకి దీనికి సంబంధం ఉండదు. రెండు వేరు వేరు కథలు. 'లక్ష్యం, లౌక్యం' సెంటి మెంట్ని కొనసాగిస్తూ అలాంటి టైటిల్ పెడితే బాగుంటుందని శ్రీవాస్ భావించారు. అయితే అనుకోకుండా అన్‌స్టాపబుల్ షోకి వెళ్ళడం, అక్కడ బాలకృష్ణ 'రామబాణం'అనే అద్భుతమైన టైటిల్ పెట్టడం జరిగింది. జగపతిబాబుతో నాకిది రెండో సినిమా. ఆయనను కలిస్తే సొంత అన్నయ్యను కలిసినట్టే ఉంటుంది. అందుకే మా మధ్య సన్నివేశాలు అంతలా పండాయి. ఈ సినిమా అన్నదమ్ముల కథ. ఇద్దరి స్వభావం ఒకటే. కానీ ఎంచుకున్న దారులు వేరు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. భూపతి రాజా ఈ కథ చెప్పినప్పుడు ఒక ప్రేక్షకుడిగా నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఓ కమర్షియల్ సినిమాలో మెసేజ్ ఇవ్వడం కష్టం. ఈ సినిమా కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తూనే.. ఒక మంచి సందేశం ఉంటుంది. ఇదేం కొత్త మెసేజ్ కాదు.
మన చుట్టూ జరుగుతున్నదే. కానీ మనం దానిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాం. అయితే కొన్నేళ్ల తర్వాత దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలీదు.. కానీ తర్వాత బాధ పడతాం. అదే విషయాన్ని ఇందులో చెప్పబోతున్నాం. 'లక్ష్యం, లౌక్యం' హిట్ అయ్యాయి కాబట్టి.. శ్రీవాస్‌తో ఈ సినిమా చేయలేదు. మూడో సినిమా వాటిని మించే సినిమా కావాలనే ఉద్దేశ్యంతో చేశా. అలాంటి సినిమానే ఇది. ప్రస్తుతం శ్రీను వైట్లతో, హర్షతో సినిమాలు చేస్తున్నాను. అలాగే ప్రభాస్ సినిమాలో విలన్ రోల్ చేసే ఛాన్స్ వస్తే కచ్చితంగా చేస్తా' అని అన్నారు.