Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించిన సినిమా 'ఆదిపురుష్'. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు 70 దేశాల్లో ఈ ట్రైలర్‌ని ఒకేసారి విడుదల చేయటం ఓ విశేషమైతే, అంచనాలకు భిన్నంగా ట్రైలర్ ఈసారి అద్భుతం అనే టాక్ తెచ్చుకోవడం మరో విశేషం. హైదరాబాద్‌లోని ఏ.ఎమ్‌బి మాల్లో జరిగిన ట్రైలర్ ప్రివ్యూకు ప్రభాస్‌తో పాటు మూవీ టీమ్ మొత్తం హాజరైంది. హనుమంతుడి కోణంలో సాగే కథలా ఈ ట్రైలర్ ఆరంభంలోనే కనిపిస్తుంది. 'ఇది నా రాముడి కథ. ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. అధర్మానికి ఉన్న అహంకారాన్ని ఆయన ధర్మం అంతం చేసింది. ఇది ఆ రఘునందుడి గాథ. యుగయుగాల్లోనూ సజీవం.. జాగ్రుతం. నా రాఘవుడి కథే రామాయణం' అంటూ హనుమంతుడు చెబుతుండగా సాగిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
అలాగే సీతాపహరణం ఎపిసోడ్‌తోపాటు చివర్లో వచ్చిన రామ, రావణ యుద్ధానికి నేటి ఆధునిక టెక్నాలజీని జోడించినట్టు కనిపిస్తోంది. విజువల్స్ ఫీస్ట్‌గా మొదట్లో వచ్చిన విమర్శలకు దీటైన జవాబులా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కనిపిస్తున్నాయి. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.