Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై 'జన సూర్యుడు నువ్వేలే..' అనే పాటను బుధవారం ఫిల్మ్ ఛాంబర్లో ఆవిష్కరించారు. సంగకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు చిన్ని చరణ్ సంగీతం సమకూర్చారు. ఈ సందర్భంగా అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ, 'తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ రాష్ట్రానికి జాతి పితగా నిలిచారు. తెలంగాణలోని సంస్కృతి, కళలకు ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తోంది. సీఎం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కాని తెలంగాణ సినిమాలో మాత్రం ఏ మార్పు లేదు. ఇప్పటికీ అలానే ఉంది. దీనిపై సీఎం కేసీఆర్‌తోపాటు, కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లను కలిశాం. మినిథియేటర్ల నిర్మాణంపై పలు సూచనలు కూడా చేశాం. తెలంగాణ సినిమాను ఎలా అభివృద్ధి చేయాలో తమకు తెలుసని, కచ్చితంగా అందరూ గర్వపడేలా ఇక్కడ సినీ ఇండిస్టీని డెవలప్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలుగు సినిమాతోపాటు తెలంగాణ సినిమాను సమాంతరంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది' అని అన్నారు. 'తెలంగాణ జాతి పిత సీఎం కేసీఆర్‌పై సంగ కుమార్ దర్శకత్వంలో అల్లాణి శ్రీధర్ రూపొందించిన పాట చాలా అద్భుతంగా ఉంది. కేసీఆర్ తెలంగాణ సాధించుకున్నాక ఎన్నో మంచి పనులు చేపట్టి అందరి చేత ప్రశంసలందుకుంటున్నారు. రాష్ట్ర విడిపోయాక అన్ని రంగాలు విడిపోయాయి. సినిమా రంగం మాత్రం కలిసే ఉంది. తెలంగాణ సినిమా అభివృద్ధి చెందాలంటే ఎఫ్‌డిసిని విభజించాలి' అని దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డి తెలిపారు. సంగ కుమార్ మాట్లాడుతూ, 'కేసీర్ పుట్టిన రోజు కానుకగా మా వంతు చిరు కానుకని అందివ్వాలని ఈ పాటను రూపొందించాం' అని చెప్పారు.