Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అక్కయ్య అంజలిని స్ఫూర్తిగా తీసుకుని సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. చిత్ర పరిశ్రమ, ప్రేక్షకుల సహకారంతో నటిగా రాణిస్తాననే నమ్మకం ఉంది' అని అంటోంది ఆరాధ్య. కథానాయిక అంజలి సోదరైన ఆరాధ్య ఇటీవలే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళంలో ఒక సినిమా, తెలుగులో ఓ సినిమాలో ఇప్పటికే నటిస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆరాధ్య మాట్లాడుతూ, 'చిన్నప్పట్నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. 'నీ కళ్లు బాగుంటాయి. సినిమాల్లోకి వెళ్లొచ్చు కదా?' అని స్నేహితులు, సన్నిహితులు అంటుండేవారు. దీంతో చిన్నప్పుడే నృత్యం నేర్చుకున్నా. నటనకి సంబంధించి ప్రతి అంశంపై శిక్షణ పొందాను. అక్కయ్య అంజలి కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. అంతేకాదు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. అదంతా ఆమె అదృష్టం అని చెప్పేదాని కంటే అక్కయ్య పడిన కష్టమే ఆ ఉన్నతికి కారణమని భావిస్తాను. మా అమ్మ కూడా తనకి మంచి సపోర్ట్ అందించింది. అమ్మ సహకారం నాకూ ఉంటుందన్న ధైర్యంతోనే నేనూ సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ప్రస్తుతం తమిళంలో సముద్ర దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాను. తెలుగులో కూడా ఓ సినిమా చేస్తున్నాను. వీటితోపాటు మరో రెండు సినిమాల కోసం కథా చర్చలు జరుగుతున్నాయి. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాను. నటిగా నాకు పేరు, గుర్తింపు తెచ్చే ఎలాంటి పాత్ర అయినా సరే చేస్తాను. పాత్రకు తగ్గట్టుగా ఏ విధంగానైనా కనిపించడానికీ సిద్ధమే. అయితే అది గ్లామరా లేకపోతే నటనా అనేదానికంటే మంచి పాత్రలు, మంచి కథలకే ప్రయారిటీ ఇస్తాను. తెలుగు హీరోల్లో నాకు ప్రభాస్ అంటే ఇష్టం. 'ఈశ్వర్' చిత్రం దగ్గర్నుంచే ఆయనకు నేను పెద్ద అభిమానిని. అలాగే కథానాయకల పరంగా జయసుధగారు నా ఆల్టైమ్ ఫేవరేట్ నటి' అని తెలిపింది.