Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' తర్వాత సప్తగిరి హీరోగా నటిస్తున్న చిత్రం 'సప్తగిరి ఎల్ఎల్బి'. సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ అధినేత డా.రవికిరణ్ నిర్మిస్తున్నారు. కశిష్ వోరా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి చరణ్ లక్కాకుల దర్శకుడు. ఈ చిత్రంలోని 'చిత్తూరికే చందురూడే చిందే వేస్తే.. ' అంటూ సాగే మొదటి పాటను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నిర్మాత రవికిరణ్ డబ్బు కోసం కాకుండా పేదలకు ఉచితంగా వైద్యం చేస్తున్న డాక్టర్. అలాంటి మంచి మనిషి సినిమాలు నిర్మించడం గొప్ప విషయం. ఈ చిత్రం పెద్ద హిట్టై ఆయనకి మంచి లాభాలు రావాలి. సప్తగిరి నాకు ఇష్టమైన హాస్యనటుడు. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. సప్తగిరి డాన్సులు ఇరగదీశాడు. హిందీలో 'జాలీ ఎల్ఎల్బి' చూశాను. మంచి కథ ఉన్న ఆ చిత్రం నాకు బాగా నచ్చింది. ఈ సినిమా ఎవరితో తియ్యాలో అర్థం కాక వదిలేశాను. 'ఠాగూర్'లో ఎంత నిజాయితీగా, ఎంత స్ట్రాంగ్‌గా కంటెంట్ ఉంటుందో ఈ చిత్రంలో కూడా అంతే స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుంది. ఇంత మంచి కథ సప్తగిరికి దొరకడం అతని అదృష్టం. డైరెక్టర్ చరణ్ చాలా తెలివైన వాడు. ఎప్పట్నుంచో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. సరైన టైమ్‌లో చరణ్‌కి ఈ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా చరణ్‌కి మంచి బ్రేక్ వస్తుంది. బుల్గానిన్ మ్యూజిక్ చాలా బాగుంది. ట్రైలర్ ఆకట్టుకుంటుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు.
'ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన వినాయక్ మంచి మనసుతో మా టీమ్‌ని ఆశీర్వదించి, మా చిత్రంలోని ఫస్ట్ సాంగ్‌ని లాంచ్ చేయడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు' అని సప్తగిరి తెలిపారు. దర్శకుడు చరణ్ లక్కాకుల మాట్లాడుతూ, 'ఎప్పటి నుంచో వినాయక్‌గారితో పరిచయం ఉంది. ఆయన్ని ఎప్పుడు కలిసినా 'నువ్వు ఇంకెన్నాళ్లు కోడైరెక్టర్‌గా చేస్తావు త్వరగా డైరెక్షన్ చెయ్యి' అని ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసేవారు. మా నిర్మాత రవికిరణ్ ఎక్కడా రాజీపడకుండా సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు. అలాగే సప్తగిరి ఫస్ట్ నుండి ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకు నా థాంక్స్'అని చెప్పారు.
'మా బ్యానర్లో నిర్మిస్తున్న రెండవ చిత్రమిది. బాలీవుడ్లో వచ్చిన 'జాలీ ఎల్ఎల్బి'కిది రీమేక్. ఇక నుంచి మా బ్యానర్లో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తాయి. బుల్గానిన్ మంచి సాంగ్స్ ఇచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాత అన్నారు. సంగీత దర్శకుడు బుల్గానిన్ మాట్లాడుతూ, 'వినాయక్‌లాంటి పెద్ద డైరెక్టర్ మా సినిమా తొలి పాటని లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. నిర్మాత ఎంతో సపోర్ట్ ఇచ్చి మంచి సాంగ్స్ రాబట్టుకున్నారు. పాటలన్నీ ఎక్స్‌లెంట్‌గా వచ్చాయి. విన్నవారంతా సాంగ్స్ చాలా బాగున్నాయని మెచ్చుకుంటున్నారు' అని చెప్పారు.