Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒకప్పుడు పెళ్ళి గురించి అడిగితే ప్రభాస్ కోపగించుకునేవాడు. ఇప్పుడు నా మాట వింటున్నాడు. గతంతో పోల్చితే కాస్త మెత్తబడ్డాడు. అయితే పెళ్ళి ఎప్పుడనేది మాత్రం నా చేతుల్లో లేదు' అని అంటున్నారు కృష్ణంరాజు. 'కృష్ణవేణి', 'భక్త కన్నప్ప', 'కటకటాల రుద్రయ్య', 'బొబ్బిలి బ్రహ్మన్న', 'తాండ్ర పాపారాయుడు' వంటి తదితర చిత్రాలు కృష్ణంరాజు నట విశ్వరూపానికి మచ్చుతునకలు.
ఐదు దశబ్దాల సినీ ప్రస్థానంలో 300లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షుకుల మనసులపై చెరగని ముద్ర వేశారు. అభిమాన గణంతోపాటు ప్రేక్షకలోకం కూడా రెబల్‌స్టార్ అని ముద్దుగా పిలుచుకునే కృష్ణంరాజు పుట్టిన రోజు నేడు (శనివారం). ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో కృష్ణంరాజు ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం రెబల్‌స్టార్ మాటల్లోనే..
అభిమానులకు సత్కారం..
1966లో 'చిలకా గోరింక' చిత్రంతో నటుడిగా నా జీవితం ప్రారంభమైంది. దాదాపు 35, 40 ఏండ్ల నుంచి నన్ను అభిమానిస్తున్న అభిమానులున్నారు. నటుడిగా యాభై ఏండ్లు పూర్తయిన సందర్భంగా అభిమానులను సన్మానించాలని నిర్ణయించాం. 'బిగ్ ఫ్యాన్ ఫంక్షన్' పేరుతో జరిపే స్వర్ణోత్సవంలో గ్రాండ్‌గా నా అభిమానుల కుటుంబ సభ్యులందరినీ సత్కరించాలని ప్లాన్ చేస్తున్నాం. ఇది మరో రెండు మూడు నెలల్లో ఉంటుంది. అలాగే ఈ యాభై ఏండ్ల కెరీర్లో నాకు సపోర్ట్‌గా నిలిచిన సినిమా ప్రముఖులు, నాతో పనిచేసిన దర్శక, నిర్మాతలను సైతం 'సెలబ్రిటీస్ ఫంక్షన్' పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించి సన్మానించాలను కుంటున్నా.
విమర్శించడం తప్పు..
తెలుగు చిత్ర పరిశ్రమను 'బాహుబలి' అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. హాలీవుడ్ మేకర్స్ సైతం తెలుగు చిత్ర పరిశ్రమ గురించి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది 'బాహుబలి'లాంటి భారీ సినిమాలు తీయాలనుకుంటున్నారు. అలాంటి వారిని విమర్శించడం తప్పు. తక్కువ బడ్జెట్లో కన్‌స్ట్రక్టివ్‌గా అలాంటి సినిమాలు తీయాలంటే ఏం చేయాలని ఆలోచించి ఓ టీమ్‌ను తయారు చేస్తున్నాం. 'గ్లోబలైజేషన్ ఇండియన్ ఫిల్మ్ ఇండిస్టీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండ్రస్టీ' పేరుతో ఓ ఆర్గనైజేషన్‌ను స్థాపిస్తున్నాం. దీని ద్వారా సినిమా నిడివి తగ్గించి తక్కువ బడ్జెట్లో సినిమా తీయడమనే టెక్నీక్స్ను దర్శక, నిర్మాతలకు ఇవ్వాలనుకుంటున్నాం. 'బాహబలి' లాంటి సినిమాలు తీయాలనుకునే వారికి మా సంస్థ సపోర్ట్‌గా నిలవడమే మా ధ్యేయం. ఇది చేస్తే ఈ యాభై ఏండ్ల సినీ కెరీర్లో ఇండిస్టీకి ఏదైనా చేసిన వాడినవుతాను. అది నాకు హ్యాపీనిస్తుంది.
సక్సెస్ రేటు పెరిగింది..
మా కాలంలో సినిమాల్లో నటన సహజత్వంగా ఉండేది. రాను రాను సహజత్వం తగ్గిపోయింది. ఫైట్స్ ఎక్కువయ్యాయి. కొంత కాలానికి ఫైట్స్ బోర్ కొట్టాయి. ఐదారేండ్లుగా కాస్త మార్పు కనిపిస్తుంది. వైవిధ్యంతో కూడిన కొత్త కథలు వస్తున్నాయి. యంగ్‌స్టర్స్ మంచి సినిమాలు చేస్తున్నారు. ఎప్పుడైనా సినిమా సక్సెస్ రేట్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యేది. ఇటీవల అది పెరగడం ఆహ్వానించదగ్గ విషయం. అయితే సెన్సార్ పరమైన ఇబ్బందులు, క్రియేవిటీ ఫ్రీడమ్ తగ్గిపోతుందని అంటున్నారు. అందులో వాస్తవం లేదు. 'పద్మావత్' వివాదం చరిత్రను వక్రీకరిస్తూ తీస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. చరిత్రను తెరకెక్కించేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని తీయాల్సిన అవసరం ఉంది. చరిత్ర నేపథ్యంలో నేను సినిమాలు తీసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాను.
ప్రభాస్‌తో సినిమా గ్యారంటీ..
నటించేందుకు నేను సిద్ధంగానే ఉన్నా. క్యారెక్టర్‌కు గుర్తింపు, ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తాను. ప్రస్తుతం కర్నాటక ఎలక్షన్స్ వల్ల అక్కడ క్యాంపెయిన్ నిర్వహించే బాధ్యత పడింది. ఎక్కువ శాతం రాజకీయాలకు టైమ్ కేటాయించాలి వస్తోంది. వీలును బట్టి సినిమాల్లో నటిస్తాను. ఇక మా గోపీకృష్ణ బ్యానర్లో ప్రభాస్ కోసం ఓ స్క్రిప్టు రెడీ చేయిస్తున్నాం. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ ఈ కథ సిద్ధం చేస్తున్నారు. ఇది ఈఏడాదిగాని లేదా వచ్చే ఏడాదిగాని ఉంటుంది. నేనిప్పట్లో దర్శకత్వం వహించే అవకాశం లేదు. పవన్, రజనీకాంత్, కమల్ హాసన్ పార్టీలు పెడుతున్నారనే విషయంలో నేనేమి కామెంట్ చేయలేను. గతంలో కృష్ణను, నన్ను పార్టీ పెట్టమని చాలా మంది ఒత్తిడి తెచ్చారు. ఆ ఇబ్బందులు మనకొద్దని రాజకీయాల్లోకి రాలేదు.