Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుట్టినరోజు వేడుకలో సీనియర్ నరేష్
'నరేష్ కెరీర్ అప్పటి కంటే ఇప్పుడే చాలా హైప్లో ఉంది. నరేష్ ఇలాగే మరిన్ని మంచి చిత్రాలు చేస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను' అని నటశేఖర కృష్ణ అన్నారు. సీనియర్ నరేష్ పుట్టినరోజు వేడుక శనివారం నానాక్రామగూడలోని కృష్ణ నివాసంలో అభిమానులు, 'మా' సభ్యుల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ,'నరేష్ కెరీర్ ఇప్పుడెంతో బాగుంది. ఇకపై కూడా ఇలాగే కొనసాగాలి. తన పుట్టినరోజు సందర్భంగా 'శతమానంభవతి' సినిమా దర్శక, నిర్మాతలను సన్మానించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు ఒకే సంవత్సరంలో 4 భాషల్లో 6 చిత్రాలు విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు నిర్మాత దిల్‌రాజు కూడా ఇదే తరహాలో విజయాన్ని అందుకున్నారు. అయితే ఒకే భాషలో ఆరు సినిమాలు కావడం విశేషం' అని చెప్పారు. 'పాత్రలకు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్‌ను మలచుకునే నటుడు నరేష్. నటుడిగా ప్రేక్షకులను అలరిస్తూనే మరోపక్క ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. ఇకపై కూడా నరేష్ జీవితం ఇలాగే కొనసాగాలి' అని విజయనిర్మల అన్నారు. 'అప్పుడే 50 ఏండ్లు పూర్తయ్యాయంటే నమ్మశక్యంగా లేదు. నా కెరీర్ మొత్తం సజావుగా సాగిపోయింది. నా తల్లిదండ్రుల సమక్షంలో ప్రతి ఏటా ఇలా పుట్టినరోజు వేడుక జరుపుకోవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. మా ఘట్టమనేని ఫ్యామిలీ ప్రతి ఒక్కరితో మమేకమైంది. ఇన్ని సంవత్సరాలుగా మంచి పాత్రలు ఇచ్చి నన్ను ప్రోత్సహించిన దర్శక,నిర్మాతలందరికీ నా కృతజ్ఞతలు. ప్రేక్షకులకు వినోదాన్ని, ప్రేమను పంచడం, సేవ చేయటం నా ధ్యేయంగా పెట్టుకున్నాను. నటుడిగా నాకు ఎస్వీఆర్ స్ఫూర్తి. మా నాన్న కృష్ణగారి దగ్గర్నుంచి డైనమిజం నేర్చుకున్నాను. జంధ్యాల నాకు గురువు. ఆపదలో ఉన్న వారికి చేయూత నిచ్చే సదుద్దేశంతో త్వరలోనే విజయకృష్ణ పేరుతో ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయబోతున్నాను' అని నరేష్ చెప్పారు. ఈ వేడుకలో నవీన్ కృష్ణ, మురళీమోహన్, 'మా' అధ్యక్షుడు శివాజీరాజా, సతీష్ వేగేశ్న, దిల్‌రాజు, ప్రదీప్ తదితరులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వందలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఇదే వేడుకలో కొంత మంది కళాకారులను, సీనియర్ అభిమానులను కృష్ణ, విజయ నిర్మల దంపతులు సన్మానించడం విశేషం.