Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మనం చనిపోయే ముందు వెనక్కి తిరిగి చూసుకుంటే జ్ఞాపకాలు తప్ప మరేమీ ఉండవు. అవి జీవితంలో చాలా ముఖ్యమని చెప్పేదే 'హుషారు' చిత్రం' అని అంటున్నారు నటుడు రాహుల్ రామకృష్ణ. 'అర్జున్‌రెడ్డి'తో నటుడిగా పాపులర్ అయిన రాహుల్ రామకృష్ణ తాజాగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో 'హుషారు' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'శ్రీ హర్ష కథ చెప్పిన పద్ధతి నాకు బాగా నచ్చింది. ఇందులో నేను ఫ్రస్టేటేడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కనిపిస్తాను. ఆ ఫ్రస్టేషన్లో రకరకాలుగా తిరిగి ఓ నాలుగు జంటలను కలుస్తాను. వారి వల్ల సొంతంగా బీర్ తయారు చేయడం నేర్చుకుని అమ్ముకుంటుంటా. అనంతరం చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాల సమాహారమే సినిమా. నా పాత్ర కామెడీగా, ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. జ్ఞాపకాలు ముఖ్యమని చెప్పే చిత్రమిది. ఇష్టంలేని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న వారందరికీ ఇది నా ట్రిబ్యూట్. 'పిచ్చాక్..' సాంగ్‌కి మంచి స్పందన లభించింది. త్వరలో నా పెళ్ళి కానుంది. ఈ పాటను చూసి మా వాళ్ళు అనుమానిస్తున్నారు. 'ఇది సినిమా. నిజ జీవితంలో నేను పర్ఫెక్ట్' అని చెప్పా(నవ్వుతూ). 'అర్జున్‌రెడ్డి' తర్వాత నా పాత్ర నిడివి ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఆ సినిమాకు వచ్చినంత పేరు వస్తుందనుకుంటున్నా. బేసిక్‌గా నాది హైదరాబాద్. మా ఫ్యామిలీకి సాహిత్యంపై పట్టుండటంతో అది నాకూ అబ్బింది. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలోనే మానేసి జర్నలిస్ట్‌గా పనిచేశాను. కథలు రాస్తాను. 'పెళ్ళిచూపులు'కి కథా సహకారం అందించా. ఆ టైమ్‌లో 'అర్జున్‌రెడ్డి' ఛాన్స్ వచ్చింది. ఒక్క శుక్రవారం నా జీవితాన్నే మార్చేసింది. అంతకు ముందు నేను నటించిన 'సైనిమా' లఘు చిత్రం ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. 'భరత్ అనే నేను'లో నేను బాగా చేశానని చిత్ర యూనిట్ అన్నప్పటికీ నాకు సంతృప్తిగా అనిపించలేదు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్', 'కల్కీ', వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణుతో కలిసి ఓ సినిమా చేస్తున్నా. 'మిఠాయి'లో ప్రధాన పాత్ర పోషిస్తున్నా. తమిళంలో 'నిను వీడను నీడను నేనే' చిత్రంలో నెగటివ్ పాత్రలో కనిపిస్తా. నటుడిగా అన్ని పాత్రలు చేయాలనుకుంటున్నా. ఇతర చిత్రాలకు కథలు కూడా అందిస్తాను. దర్శకత్వ ఆలోచన లేదు. హీరో అవ్వడానికి డాన్స్‌లు, ఫైట్స్ నా వల్ల కాదు' అని చెప్పారు.