Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శర్వానంద్ సెల్ఫ్ మేడ్ యాక్టర్. అందుకే తనంటే ఇష్టం. అతని ఫంక్షన్‌కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా' అని అల్లు అర్జున్ అన్నారు. శర్వానంద్, సాయిపల్లవి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం 'పడి పడి లేచే మనసు'. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. నాకు లవ్ స్టోరీలంటే చాలా ఇష్టం. ఇందులో మ్యాజిక్ కనిపిస్తుంది. మంచి సినిమాతో నిర్మాతగా మారిన సుధాకర్‌కి అభినందనలు. ఈ చిత్ర పాటలు విని పిచ్చెక్కిపోయింది. ఈ చిత్రంతో విశాల్ శేఖర్ తెలుగులో పెద్ద సంగీత దర్శకులు అయిపోతారు. 'ప్రేమమ్', 'ఫిదా', 'ఎంసీఏ'లో సాయి పల్లవి బాగా నటించారు. తనతో డాన్స్ ఎప్పుడెప్పుడు చేయాలా అని ఎదురుచూస్తున్నా. హను సినిమాలో ప్రేమ సన్నివేశాలు బాగుంటాయి. ఎప్పటికైనా ఆయనతో ప్రేమ కథ చేయాలనిపించింది. ఈ లోగా శర్వానంద్ ఆ ఛాన్స్ కొట్టేశారు. 'గమ్యం' నుంచి చూస్తున్నా శర్వాని. మాకు బ్యాగ్రౌండ్ ఉంది. నెపోటిజమ్‌కు మేం బ్రాండ్ అంబాసిడర్లం(నవ్వుతూ). ఇలాంటి సెల్ఫ్‌మేడ్ హీరోలంటే అడ్మిరేషన్ నాకు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. అలాగే అదే రోజు విడుదలవుతున్న నా తమ్ముడు వరుణ్ తేజ్ 'అంతరిక్షం' కూడా బాగా ఆడాలి' అని అన్నారు.
'హిట్ కొట్టలేమో అన్న టెన్షన్ వద్దు. హిట్టు కొట్టే బాధ్యత నాది. బన్నీని అందరూ గోల్డెన్ హ్యాండ్ అంటుంటారు. ఆయనకు ఫోన్ చేసి 'విజరు దేవరకొండకు రెండు హిట్లు ఇచ్చావ్, నాకూ ఓ హిట్ కావాలి' అని ఈ ఫంక్షన్‌కి పిలిచా. ఆయన ముంబయిలో బిజీగా ఉన్నా 'నువ్వు ఎప్పుడంటే అప్పుడు వస్తా' అని మాటిచ్చారు. నాలాంటి చాలా మందికి బన్నీ స్ఫూర్తి. కథను నమ్ముకుని ఈ సినిమా తీశాం. ప్రేమతో, నిజాయితీతో పనిచేశాం. ఈ సినిమాలో ఓ కొత్త శర్వాని చూస్తున్నారంటే దానికి కారణం హను. ఈ సినిమాతో సాయి పల్లవి లాంటి స్నేహితురాలు దొరికింది. ఈ నెల 21న నా సినిమాతోపాటు నా స్నేహితుడి సినిమా 'అంతరిక్షం' వస్తుంది. ఈ రెండు చిత్రాలను ఆదరించాలని కోరుకుంటున్నా' అని శర్వానంద్ తెలిపారు. దర్శకుడు హను రాఘవపూడి చెబుతూ, 'రెండున్నర గంటలపాటు ఓ జర్నీలా సినిమా ఉంటుంది. తెరపై సూర్య, వైశాలి తప్ప మరేం కనిపించవు, వినిపించవు. వాళ్ళ నటన కట్టిపడేస్తుంది. ఓ మంచి ప్రేమ కథను చెప్పడానికి కావల్సింది కథ, నటీనటులు, మంచి సంగీతం. దీనికి ఈ మూడు బాగా కుదిరాయి. గతంలో ఎప్పుడూ పొందని అనుభూతిని ఈ చిత్రంతో పొందుతారు' అని చెప్పారు. 'బన్నీకి నేను పెద్ద అభిమానిని. స్కూల్ల్లో ఆయన పాటలకు డాన్స్‌లు వేసేదాన్ని. వైశాలి పాత్రకు న్యాయం చేయగలనని నమ్మిన దర్శకుడికి థ్యాంక్స్. శర్వా మంచి నటుడు, మంచి వ్యక్తి. మనసుపెట్టి ఈ సినిమా చేశాం' అని సాయి పల్లవి అన్నారు