Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని అన్ని పనులు ఈ రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి నరేష్ ప్యానెల్ మంచి పేరు తెచ్చుకోవాలి' అని నటుడు కృష్ణ అన్నారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(మా) అధ్యక్షులుగా నటుడు నరేష్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా అతిథిగా విచ్చేసిన కృష్ణంరాజు మాట్లాడుతూ, ''మా' నాది, మనది అని ప్రతి ఒక్కరు గుండెల మీద చేయి వేసుకుని పనిచేయాలి. 'మా' ప్రతిష్టని పెంచాలి' అని అన్నారు. విజయ నిర్మల మాట్లాడుతూ, 'మా ఇంట్లోనే 'మా' పుట్టింది. 'మా'కి ఇప్పటి వరకు నేనిస్తున్న డబ్బు కంటే ఎక్కువే ఇచ్చి రుణం తీర్చుకుంటా' అని చెప్పారు. ''మా' ఉద్దేశం అంతా కలిసికట్టుగా ఐకమత్యంతో పనిచేసి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారిని ఆదుకోవాలి. 'మా' అంటే అమ్మ. కళకి కులం, మతం అనే బేధం లేదు' అని నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. 'మా' నూతన అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ, 'గత 25ఏండ్లుగా 'మా' అభివృద్ధి కోసం ఎంతో మంది అధ్యక్షులు కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు. 'మా' ప్రతిష్టని పెంచేందుకు మరింతగా కృషి చేస్తాను. 'మా' గీతం నేను 'మా' అమ్మకి ఇచ్చే మొదటి బహుమతి. రెండో బహుమతిగా లక్ష 1116రూపాయలు సభ్యుల సంక్షేమం కోసం ఇస్తున్నా. అసోసియేషన్ సభ్యత్వం ఇంతకు ముందున్న దానికంటే పది వేలు తగ్గిస్తూ రూ.90వేలు చేస్తున్నాం. ఇది నా మూడో గిఫ్ట్. ఇక 24 గంటలు హెల్ప్ లైన్‌ని ఏర్పాటు చేశాం. సలహాల బాక్స్‌ని కూడా ఏర్పాటు చేసి అందరి విన్నపాలు స్వీకరిస్తాం. మహిళా సాధికారత కోసం, వారి సంక్షేమం కోసం జీవితగారి ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. శివబాలాజీ ఇన్‌ఛార్జ్‌గా యూత్‌ని లీడ్ చేసే ఓ కార్యక్రమం చేస్తున్నాం. జాబ్ కమిటీని గౌతంరాజు లీడ్ చేస్తారు. పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతున్నాం. ప్రతి నెల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం' అని చెప్పారు. ''మా' కొత్త కమిటీ అద్బుతాలు చేయాలని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నా. 'మా' ఫండ్‌ని మరింత పెంచాలి' అని మాజీ 'మా' అధ్యక్షులు శివాజీ రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నరేష్ ప్రతి విషయంలో 'నేను' అని వాడటం పట్ల రాజశేఖర్, జీవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.