Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేష్ కుమార్, ప్రజ్వాల్ జంటగా టి.అంజయ్య సమర్పణలో పారిజాత మూవీ క్రియేషన్స్ పతాకంపై టి.నరేష్, టి.శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమ అంత ఈజీ కాదు'. ఈశ్వర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ని పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్ ప్రై.లి చైర్మెన్ టి.అంజయ్య విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 'అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాని రూపొందించాం. సెన్సార్ పూర్తి చేసుకుని 'యు' సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ సభ్యులు ప్రశంసించడం మాకు ధైర్యాన్నిచ్చింది. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అని అన్నారు. 'ఇటీవల 'యు' సర్టిఫికేట్‌తో వస్తున్న చిత్రాలు చాలా తక్కువ. మా సినిమాకి రావడం ఆనందంగా ఉంది. ప్రేమ అంతా ఈజీ కాదు అన్నట్టుగానే సినిమా నిర్మాణం కూడా ఈజీ కాదని ప్రొడక్షన్లోకి దిగాక అర్థమైంది. ప్రారంభంలో సినిమా గురించి కొందరు తప్పుగా మాట్లాడారు. సపోర్ట్ చేయకపోయినా ఫర్వాలేదు, కానీ ఇలా సినిమాని దెబ్బతీసే విధంగా మాట్లాడొద్దు. అనుకున్నట్టుగానే సినిమాని ఈ నెల 29న విడుదల చేస్తున్నాం' అని దర్శకుడు తెలిపారు. హీరో రాజేష్ కుమార్ చెబుతూ, 'ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా సినిమా ఉంటుంది. ఏ పాత్రనైనా రక్తికట్టించే నటులు ఇందులో ఉన్నారు. చాలా కష్టపడి అద్భుతంగా సినిమాని తెరకెక్కించాం. తప్పకుండా హిట్ అవుతుందని నమ్ముతున్నాం' అని చెప్పారు. 'ప్రేమ నేపథ్యంలో సాగే చిత్రమిది. మనసుకి నచ్చిన వ్యక్తి ప్రేమను గెలుచుకోవడం ఎంత కష్టమో తెలియజేస్తుంది. రాజేష్ అద్బుతంగా నటించాడు. మా ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నా' అని నిర్మాతలు అన్నారు.