Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను డాన్స్ మాస్టర్‌గా రాణించడానికి చిరంజీవే కారణం. 'హిట్లర్' సినిమాలో డాన్స్ మాస్టర్‌గా ఛాన్స్ ఇవ్వకుంటే నేను నెంబర్ వన్ డాన్స్ మాస్టర్ అయ్యేవాడిని కాదు, నాగార్జున డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు 150 మంది పిల్లలకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించేవాడిని కాదు. 60 మంది పిల్లలను చదివించే వాడిని కాదు. ఇవన్నీ జరుగుతున్నాయంటే కారణం సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆశీర్వాదం' అని లారెన్స్ అన్నారు.
రాఘవ లారెన్స్, ఓవియా, వేదిక, కొవై సరళ, శ్రీమాన్ ప్రధాన పాత్రధారులుగా 'కాంచన 3' చిత్రం రూపొందింది. రాఘవేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో నేడు (శుక్రవారం) ఠాగూర్ మధు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆద్యంతం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లో లారెన్స్ ప్రారంభిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్ బ్రోచర్‌ని అల్లు అరవింద్ ఆవిష్కరించారు. ఈ ట్రస్ట్‌కి చిరంజీవి రూ.పది లక్షల చెక్‌ని అందజేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'పాతికేండ్లుగా మా కుటుంబానికి లారెన్స్ మంచి స్నేహితుడు. చిన్న డాన్సర్‌గా కెరీర్‌ని ప్రారంభించి 'హిట్లర్' సినిమాకి డాన్స్ మాస్టర్‌గా మారి, ఇప్పుడు ఓ బ్రాండ్లా ఎదిగారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశం లారెన్స్‌కి లేదు. సంపాదించిన దాన్ని పది మందికి పంచాలనుకుంటాడు. అలాంటి మనస్తత్వం ఉన్న చిరంజీవి తన శిష్యుడిని అభినందిస్తూ రూ.10లక్షలు విరాళంగా ప్రకటించారు' అని అన్నారు.
'ఇందులో కథానాయిక నటించిన వేదిక లక్కీ హీరోయిన్. నిక్కీ తంబోలి చక్కగా కామెడీ నటనతో మెప్పించింది. ఇందులో శ్రీమాన్, కోవైసరళ, దేవ దర్శిని లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉండేది. సినిమాలో వాళ్ళే అసలు హీరోలు. తెలుగులో సినిమాని విడుదల చేస్తున్న ఠాగూర్ మధుకి థ్యాంక్స్. డాన్స్ సినిమా చేయాలంటే మంచి డాన్సర్ కావాలి. తెలుగులో బన్నీ, ఎన్టీఆర్, చరణ్ బాగా చేస్తారు. అందరికి బాస్ అన్నయ్య చిరంజీవి. 'స్టైల్ 2' సినిమా తీయాలంటే పెద్ద హీరోలతోనే తీయాలి. మా అమ్మ వల్లే ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచి పనులు చేస్తున్నా. ఆమే లేకుంటే నేను బ్రెయిన్ ట్యూమర్‌తో ఎప్పుడో చనిపోయేవాడిని. ఆమ్మే నాకు దేవుడు. అందుకే ఆమెకి గుడి కట్టించా. నీ కోసం బతికితే సాధారణ జీవితం, ఇతరుల కోసం బతికితే గొప్ప జీవితం అని అమ్మ చెప్పింది. నాకు డబ్బు ఆడియెన్స్ నుంచి వస్తుంది. వారి కోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్‌ని స్థాపించా. నేను డాన్స్ మాస్టర్‌గా ఎదిగింది తెలుగు రాష్ట్రాల్లోనే. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా ప్రారంభిస్తున్నా. హైదాబాద్‌లో ప్రారంభించే ట్రస్ట్‌కి నా వంతుగా రూ.50లక్షలు అందజేస్తున్నా. ఓపెన్ హార్ట్ సర్జరీ సమస్య ఉన్నవాళ్లు, చదువు సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. పది లక్షలు అందించిన చిరంజీవి అన్నయ్యకు కృతజ్ఞతలు' అని లారెన్స్ చెప్పారు. లగడపాటి శ్రీధర్ చెబుతూ, 'పరిశ్రమలో నాకు నచ్చిన వ్యక్తులో లారెన్స్ ఒకరు. సినిమాలో డబుల్ మాస్ అనే డైలాగ్ ఉంది. ట్రైలర్, పాటలు చూస్తుంటే త్రిఫుల్ మాస్‌లా ఉంది. ఆయనతో ఓ సినిమా చేయాలనుంది' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కె.ఎల్.దామోదర ప్రసాద్, శ్రీమాన్, వేదిక, నిక్కీ తంబోలి తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.