Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓవియా, బొమ్ము లక్ష్మి, మసూమ్ శంకర్, శ్రీ గోపిక ప్రధాన పాత్రధారులుగా శింబు ప్రత్యేక పాత్రలో నటించడంతోపాటు సంగీతం అందించిన చిత్రం '90ఎంఎల్'. 'ఇది చాలా తక్కువ' అనేది ఉపశీర్షిక. అనితా ఉదీప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. తెలుగులో కర్ణ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై యిన్నం శ్రీనివాసరావు సమర్పణలో కృష్ణకాకర్లమూడి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శనివారం జరిగింది. అతిథులుగా విచ్చేసిన నిర్మాత టి.రామసత్యనారాయణ, సాయివెంకట్, సంతోషం సురేష్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. 'తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రమిది. యూత్‌ను టార్గెట్ చేసుకుని రూపొందింది. విడుదలైన పాటలు, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి. తప్పకుండా ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా అలరింపజేస్తుందని భావిస్తున్నాం. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్' అని అతిథులు అన్నారు. చిత్ర నిర్మాత పఠాన్ చాంద్ బాషా మాట్లాడుతూ, 'ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందింది. ఇందులో ఎలాంటి వల్గర్ సన్నివేశాలు లేవు. యూత్‌ను దృష్టిలో పెట్టుకుని సందేశాన్ని అందిస్తూ తెరకెక్కింది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. వెన్నెలకంటి తనయుడు రాకేందుమౌళి సాహిత్యానికి శింబు అందించిన సంగీతం హైలైట్ అవుతుంది. ఈ నెల 26న సినిమాను భారీగా విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. నిర్మాణ సారధి కృష్ణ కాకర్లమూడి మాట్లాడుతూ, 'ఐదుగురు అమ్మాయిలు జీవితాలలో ఎదురైన సమస్యల వల్ల వారంతా మధ్యపానం, ధూమపానంకు బానిసలవుతారు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని ఎలా బయటపడ్డారన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది' అని తెలిపారు.