Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పని పాట లేని హీరో అనుకోకుండా ఓ అందమైన హీరోయిన్ని చూసి ప్రేమలో పడడం, ఆ ప్రేమ విషయంలో అమ్మాయి తండ్రి కొన్ని కండీిషన్స్ పెట్టడం, ఆ కండీిషన్స్ని ఎదుర్కొని అమ్మాయి ప్రేమను దక్కించు కునేందుకు హీరో చేసే మ్యాజిక్కులు, జిమ్మిక్కులు వంటి నాటకీయ పరిణామాలతో చివరికి కథ సుఖాంతమవడం మన తెలుగు సినీ పరిశ్రమలో అరిగిపోయిన ట్రేడ్‌మార్క్ ఫార్ములా. సరిగ్గా ఇదే అరిగిపోయిన ఫార్ములాతో 'సినిమా చూపిస్త మావ' అంటూ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చారు దర్శకుడు త్రినాథరావు. ఇప్పటికే హిట్ పెయిర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాజ్‌తరుణ్, అవికాగోర్ జంటగా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో ఓసారి చూద్దాం..
కథ
కత్తి(రాజ్ తరుణ్) ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాకపోయినప్పటికీ మంచి తెలివైనోడు. పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరిగే కత్తికి, ప్రతిదీ క్వాలిటీగా ఉండాలనుకునే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ సెక్రటరీ సోమనాథ్ చటర్జీ(రావు రమేష్)తో హోలీ రోజు గొడవవుతుంది. ఆ తర్వాత అనుకోకుండా వీళ్లిద్దరికి మళ్ళీ గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ఇంటర్ చదువుతున్న తన కూతురు పరిణీత (అవికాగోర్) 1000కి 996 మార్కులు తెచ్చుకుని పేపర్లోకి ఎక్కిందని రావురమేష్ ఓ పేపర్ చూపిస్తూ చెబుతాడు. ఆ పేపర్లో ఉన్న పరిణీత అందానికి ఫ్లాటైపోయిన కత్తి.. ఆ తర్వాత ఏం చేశాడు?, పరిణీత ప్రేమను సొంతం చేసుకోవడానికి రావురమేష్ నుంచి ఎలాంటి షరతుని కత్తి ఫేస్ చేశాడు.. ఆ షరతు నేపథ్యంలో మావకి అల్లుడెలా సినిమా చూపించాడనేదే మిగిలిన కథ.
నటీనటులు, సాంకేతిక వర్గం పనితీరు..
రాజ్ తరుణ్ నటనలో చాలా పరిణతి కనిపించింది. అమాయకమైన అమ్మాయిగా అవికాగోర్ కూడా బాగానే అలరించింది. తండ్రిగా రావు రమేష్ మరోసారి అద్భుతమైన నటనను కనబర్చారు. డాక్టర్‌గా పోసాని కృష్ణమురళి సినిమా ప్రారంభంలో, క్లైమాక్స్‌లో ఆకట్టుకున్నారు.. జబర్దస్త్ గ్యాంగ్ బాగా నవ్వించారు. అలాగే తోటపల్లి మధు, మేల్కోటే, ప్రవీణ్, కృష్ణభగవాన్ ఫర్వాలేదనిపించారు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే.. శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. ట్యూన్స్ కొత్తగా లేకపోయినప్పటికీ ఉన్నంతలో డిఫరెంట్‌గా మాస్ ఆడియెన్స్‌కు కనెక్టయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ బాగా చేశారు. ఎడిటింగ్ విషయంలో కార్తీక్ శ్రీనివాస్ ఇంకాస్త శ్రద్ధ వహిస్తే బాగుండేది. అక్కడక్కడ అసందర్భంగా వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమా ఫ్లోను అడ్డుకున్నాయి. సాయి శ్రీరామ్ ఫొటోగ్రఫీ బాగుంది. ప్రతిసీన్ కలర్ఫుల్గా చూపించే ప్రయత్నం చేశారు. ప్రసన్న జె.కుమార్ డైలాగులు బాగున్నాయి. దర్శకుడు త్రినాథరావు రొటీన్ ఫార్ములాతో బాగానే మెప్పించారు.
విశ్లేషణ
అరిగిపోయిన ఫార్ములా కథతో దర్శకుడు త్రినాథరావు సాహసం చేసినప్పటికీ కామెడీ ఎంటర్టైన్మెంట్ను కావాల్సినంత మేళవించి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సినిమాలోని సన్నివేశాలు కొత్తగా అనిపించవు. ప్రతి సన్నివేశం పాత సినిమాలను గుర్తు చేస్తుంటుంది. డైలాగుల్లోనూ ప్రసన్నకుమార్ పలు సినిమాల నుంచి స్ఫూర్తి పొందినప్పటికీ సరైన సమయంలో సరైన డైలాగుల్ని పేల్చారు. సినిమా అంతా పంచ్ డైలాగులతో హిలేరియస్ కామెడీతో అలరిస్తుంది. ముఖ్యంగా జబర్దస్త్ గ్యాంగ్‌తో కలిసి రాజ్ తరుణ్ చేసిన 'ద్రౌపది వస్త్రాభరణం' నాటకం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. మొదటి భాగంలో ఎంతటి వినోదాన్ని చూపించాడో సెకండాఫ్‌లో కూడా అదే రేంజ్లో తీసుకెళ్లి సినిమా అంతా నవ్వుకునేలా చేశారు. సినిమా అంతా ఊహించినట్లుగానే సాగినప్పటికీ కామెడీ ట్విస్టులు బోర్ ఫీలింగ్‌ను రానివ్వకుండా చేశాయి. సీరియస్‌నెస్, సెంటిమెంట్‌ను జోడించే క్రమంలో దర్శకుడు అక్కడక్కడా ఇబ్బందిపడ్డాడు. ఆయా సన్నివేశాలు సహజంగా లేక అతికించినట్లుగా ఉండడంతో ప్రేక్షకులకు విసుగు పుడుతుంది. క్లైమాక్స్‌లోనూ ఇంతే తంతు. పాటలు సైతం అసందర్భంగా వస్తుంటాయి. చిన్న చిన్న లోపాలున్నప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా. రెండున్నర గంటలపాటు కాలక్షేపం కోసం నవ్వుకునే చిత్రంగా 'సినిమా చూపిస్త మావ' నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
చివరిగా...
అరిగిపోయిన ఫార్ములా బేస్డ్ కథ, వందల సినిమాల్లోని పేరడీ సన్నివేశాలు, వాటిల్లోని డైలాగులు, పాపులర్ కామెడీ షో 'జబర్ధస్త్' అనుకరణ.. వెరిసి ఈ సినిమా. ఇన్నింటిని మిక్స్ చేసినా కరెక్ట్ టైంలో నవ్వించడంతో సక్సెస్ జోన్లోకి ఎంట్రీ ఇచ్చింది.
నటీనటులు
రాజ్ తరుణ్, అవికాగోర్, రావు రమేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, తోటపల్లి మధు, కృష్ణభగవాన్, మేల్కోటె, సత్య, జబర్దస్త్ రామ్ ప్రసాద్, శ్రీను, సుధీర్, షకలక శంకర్,
చలాకి చంటి, సన్నీ తదితరులు.
సాంకేతిక వర్గం
శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్,
మాటలు: ప్రసన్న జె.కుమార్.
నిర్మాతలు: బోగాధి అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్, రుపేష్ డి.గోహిల్, జి.సునీత.
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రినాథరావు నక్కిన.
బ్యానర్స్: అంజిరెడ్డి ప్రొడక్షన్స్, ఆర్‌డిజి ప్రొడక్షన్స్ ప్రై.లి సమర్పణ, ఆర్య సినీ ఎంటర్టైన్మెంట్స్, లక్కీ మీడియా.