Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సినిమాకి ఎంత టైమ్ కేటాయిస్తున్నామనేది ముఖ్యం కాదు. మంచి కంటెంట్ ఉన్న చిత్రానికి ఎన్ని రోజులైనా పని చేయొచ్చు. మనం చేసే హార్డ్ వర్క్ విడుదలయ్యాక ఆడియెన్స్ ఎంజారు చేసేలా ఉండాలి' అని అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎన్జీకే' చిత్రంలో సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాని నిర్మాత కె.కె.రాధామోహన్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 31న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్‌తో మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ఈ సినిమా కథా నేపథ్యం?
- క్రిటికల్ పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమిది. ఓ కామన్ మ్యాన్ రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది?, అతని రాజకీయ ప్రయాణం ఎలా సాగిందనేది చిత్ర కథ. చాలా ఇంటెన్స్‌తో కూడిన చిత్రమిది. ఆడియెన్స్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది.
మీ పాత్ర ఎలా ఉంటుంది?
- నా పాత్ర పేరు వాణితి. రాజకీయాల్లో ఉన్న పాత్ర నాది. మంచి నాయకురాలికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి. చాలా స్ట్రాంగ్ ఉమెన్‌ని. స్వతంత్ర భావాలు కలిగిన మహిళని కూడా. నాకంటూ కొన్ని లక్ష్యాలుంటాయి. నేనేం ఆలోచిస్తున్నానేది నాకు మాత్రమే తెలుసు. ఇలాంటి పాత్రని గతంలో చేయలేదు. చాలా కొత్త పాత్ర. నాలోని మరో కోణాన్ని చూస్తారు.
దర్శకుడు సెల్వరాఘవన్‌తో వర్క్ ఎక్స్‌పీరియెన్స్?
- ఆయనతో వర్క్ చాలా కొత్తగా, భిన్నంగా ఉంది. సెట్లో క్లాప్‌బోర్డ్ అనేదే కనిపించదు. క్లాప్ బోర్డ్ చూస్తే యాక్టర్స్‌కి నీరసం వస్తుందని పెట్టరు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే కళ్ళు ఆర్పకుండా చెప్పాలి. సూర్య సార్ అయినా, సాయిపల్లవి అయినా, మిగతా ఆర్టిస్టులైనా, అందరికి ఒకటే నియమం. షూటింగ్‌కి ఖాళీ మైండ్‌తో వెళ్ళాలి. సెల్వ సార్ చెప్పినదాన్ని అర్థం చేసుకుని నటించాల్సి ఉంటుంది. అంతేకాదు ఒకరు డైలాగ్ పూర్తి చేసిన మూడు సెకన్లకు మరొకరు డైలాగ్ చెప్పాలి. సీన్లో ఇంటెన్సిటీ మిస్ అవుతుందని అలా చేయిస్తానని సెల్వసార్ చెప్పారు. డైలాగ్ చెబుతున్నప్పుడు కళ్ళార్పితే తెరపై ఆ డైలాగ్ ఆడియెన్స్‌కి డిస్కనెక్ట్ అవుతుందట. ఎక్కువ ఊపిరి పీల్చుకుంటే బాడీ కదులుతుందన్నారు. కళ్ళతోనే మాట్లాడాలని చెప్పేవారు. అందుకే ఆయన సినిమాల్లో సెటిల్డ్‌గా నటించాల్సి ఉంటుంది.
ప్రతి పాత్రలో ఓ ఇంటెన్సిటీ ఉంటుంది. అలాగే ఏదీ అనవసరంగా ఉండదు. సెల్వసార్‌తో వర్క్ చేయడం వల్ల నటీనటుల్లో ఉన్న కొత్త కోణం బయటకొస్తుంది. మమ్మల్ని మేం కొత్తగా ఆవిష్కరించుకునేలా ఉంటుంది. నెక్ట్స్ లెవల్ నటనని చూడొచ్చు.
సూర్య, సాయిపల్లవితో స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని ఎలా ఫీలయ్యారు?
- సూర్యసార్ నైస్ అండ్ స్వీట్ పర్సన్. పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా డీసెంట్‌గా ఉంటారు. తమిళంలో డైలాగ్‌లు చెప్పడం నాకు కష్టమైంది. అది ఆయన అర్థం చేసుకుని బాగా సపోర్ట్ చేశారు. అందరి మంచి కోరే వ్యక్తి ఆయన. సాయిపల్లవితో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. మా మధ్య నాలుగైదు సీన్లే ఉంటాయి. పల్లవి పాత్ర కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ క్యారెక్టర్ కోసం రాజకీయాలను గమనించారా?
- ఇప్పుడు అందరు మాట్లాడుకునేది రాజకీయాల గురించే కదా! తెలియకుండా ఎలా ఉంటుంది. మన దేశంలో ఏం జరుగుతుందో అనేది ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతా. అయితే మనం ఇతర రంగాల్లో రాణించాలంటే ఆయా కోర్సులు చేస్తాం. కానీ రాజకీయాల్లోకి రావడానికి సరైన దారి లేదు. ఇప్పుడున్న చాలా మంది యువకుల్లో రాజకీయ అవగాహన లేదు. ఓటు ప్రాధాన్యత తెలియడం లేదు. అందుకే దేశంలో ఓటింగ్ శాతం 60నుంచి 65కి మించి ఉండటం లేదు. యువత రాజకీయాల గురించి ఆలోచించాలి. సరైనా నిర్ణయాలు తీసుకోవాలి, మార్పు తీసుకురావాలి.
తెలుగులో సినిమాలు తగ్గించడానికి కారణం?
- కావాలని తగ్గించలేదు. గ్యాప్ వచ్చింది. ఇతర భాషల్లో సినిమాలు చేసేటప్పుడు మరో భాషలో గ్యాప్ రావడం సహజమే. అయితే 'స్పైడర్' తర్వాత మధ్యలో తెలుగులో అవకాశాలు వచ్చాయి. కానీ డేట్స్ కుదరక ఒప్పుకోలేదు. అప్పటికే హిందీలో 'దే దే ప్యార్ దే', 'మార్జావన్', తమిళంలో ఈ సినిమా చేస్తున్నా. ఇప్పుడు నాగార్జునతో 'మన్మథుడు 2' చేస్తున్నా కదా! ఈ ఏడాది అన్ని భాషల్లో కలిపి నావి ఆరు సినిమాలు విడుదలవుతున్నాయి.
'దే దే ప్యార్ దే' సినిమాకి ఎలాంటి స్పందన ఉంది?
- అజరు దేవగన్‌తో కలిసి నటించిన 'దే దే ప్యార్ దే' ఇటీవల విడుదలై మంచి ప్రశంసలందుకుంటుంది. బాలీవుడ్లో ఇంత మంది నన్ను ప్రేమిస్తారని ఊహించలేదు. చాలా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ఇందులో పాత్ర కోసం చాలా కష్టపడి బరువు తగ్గాను. థియేటర్లో ఆడియెన్స్ చూసి నా పాత్రని బాగాఎంజారు చేస్తున్నారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది. దాదాపు ఏడు నెలలు ఈ సినిమాకే పనిచేశా. మంచి సినిమా కోసం ఎన్ని రోజులైనా పనిచేయొచ్చు. సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ అనేది పెద్ద సమస్య కాదు. ఇక బాలీవుడ్ ఫ్యూచర్ రకుల్ ప్రీత్ సింగ్ అని అజరు దేవగన్ ప్రశంసించడం మరింత హ్యాపీగా ఉంది. ఆయన మాట నిజం కావాలని కోరుకుంటున్నా.
లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసే ఆలోచన ఉందా?
- 'జయ జానకి నాయక'లో కథ నా పాత్ర చుట్టూతే తిరుగుతుంది. 'దే దే ప్యార్ దే'లో కూడా నా పాత్రే కీలకం. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు నేను సిద్ధమే. అలాంటివి వస్తే కచ్చితంగా చేస్తా. అయితే వ్యక్తిగతంగా నాకు బయోపిక్లంటే ఇష్టం. సైనా నెహ్వాల్ బయోపిక్ ఇష్టం. కానీ దానికి కాస్టింగ్ ఫైనల్ అయ్యింది. రియల్ హీరోల జీవితాలు తెరపై చెప్పడాన్ని గౌరవంగా భావిస్తా. అంతేకాదు అందులో నటించడాన్ని మరింతగా సంతోషిస్తాను.