Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రేమని ఫీల్ కాలేని వాడు ప్రేమ కథని తీయలేడు. తీసే ప్రతి ప్రేమ కథా చిత్రంలో ఆ దర్శకుడి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రేమ అంశాలుంటాయి. 'హిప్పీ'లోనూ అలాంటి అంశాలుంటాయి' అని అంటున్నారు దర్శకుడు టి.ఎస్. కృష్ణ. కార్తికేయ, దిగంగన జంటగా టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'హిప్పీ'. కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణ మంగళవారం మీడియాతో ముచ్చటించారు. 'కార్తికేయ నటించిన 'ఆర్ ఎక్స్ 100' విడుదలయ్యాక ఆ సినిమాని తమిళంలో రీమేక్ చేసే ఆఫర్స్ వచ్చాయి.
కానీ కార్తికేయతోనే సినిమా చేస్తే బాగుంటుందని, ఆయన్ని కలిసి ఈ కథ చెప్పా. ముందుగా దీన్ని తమిళంలో చేద్దామని నిర్మాత థానుకి చెప్పాను. కార్తికేయ ఓకే అయ్యాక తెలుగులో చేశాం. ఈ కథ థానుకి బాగా నచ్చింది. దీంతో హీరో ఎవరైనా పర్వాలేదు, ఈ సినిమా చేద్దామన్నారు. అలా ఇది పట్టాలెక్కింది. ప్రస్తుత సమకాలీన అంశాలను ప్రతిబింబించే చిత్రమిది. యువత ప్రధానంగా సాగుతుంది. ఫ్యామిలీ కూడా చూడొచ్చు. నిర్లక్ష్యంగా ఉండే ఓ కుర్రాడు తనకు నచ్చింది చేస్తాడు. అలాంటి వ్యక్తి జీవితంలోని మలుపులేంటనే కథాంశంతో రూపొందించాం. ఇద్దరమ్మాయిలతో ప్రేమ కొనసాగుతుంది. ఈ సినిమా ద్వారా ఒక ఆడా, మగ సంబంధంలోని సంఘర్షణని, వారి మధ్య నెలకొనే మనస్పర్థలను, రిలేషన్లో సమస్యలు ఎందుకు వస్తున్నాయి?, ఎలా వస్తున్నాయనే సందేశాన్ని ఇవ్వబోతున్నాం. ప్రతి వినోదం వెనకాల కచ్చితంగా ఓ పర్పస్ ఉంటుంది. ఇందులోనూ అది ఉంది. సోషల్ మీడియా వచ్చాక ప్రస్తుత జనరేషన్లో వస్తున్న మార్పులను చూపించబోతున్నా.
నా జీవితంలోని అనుభావాలనూ ఇందులో చూడొచ్చు. చాలా కొత్తగా ఉంటుంది. ఆడియెన్స్ కోరుకునే అంశాలన్నీ ఉంటాయి. కార్తికేయ అద్భుతంగా నటించాడు. తను ఇందులో బాక్సర్గానూ కనిపిస్తాడు. జె.డి.చక్రవర్తి పాత్ర సినిమాకి స్పెషల్. ఆయనది అరిస్టాటిల్ తరహా పాత్ర. ఇది బైలింగ్వల్ కాదు. సినిమాని తమిళ హీరోలు చూసి రీమేక్ చేయమని అడుగుతున్నారు.
నెక్ట్స్ థాను నిర్మాణంలోనే ఓ సినిమాకి కమిట్ అయ్యాను. దీంతోపాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఓ సినిమాకి సైన్ చేశాను. 'నువ్వు నేను ప్రేమ' తర్వాత ఓ మంచి సినిమా చేశాను. అది ఆర్థిక కారణాలతో ఆగిపోయింది. ఆ తర్వాత చేసిన 'నేడుంచాలై' చిత్రాన్ని రూపొందించా. అదీ ఆడలేదు. అలా కొన్ని ఏండ్ల పాటు బ్యాడ్ టైమ్ సాగింది. ఇకపై వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నా. తెలుగులో చేయడానికి ఇష్టపడతాను' అని అన్నారు.