Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను మంచి నటుడిని కాదు, ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ని కాదు, అలాగే థియరీలో ఎడిటింగ్ నేర్చుకోలేదు. నాకున్న అవగాహనతో ఇవన్నీ చేస్తున్నా. సినిమా సినిమాకి బెటర్ అవుతున్నా' అని అంటున్నారు విజయ్ ఆంటోని. 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ ఆంటోని తాజాగా 'కిల్లర్' సినిమాతో రాబోతున్నారు. అర్జున్, విజయ్ ఆంటోని ప్రధాన పాత్రధారులుగా ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'కొలైగారన్' అనే చిత్రానికిది అనువాదం. అషిమా కథానాయికగా నటించారు. ఈ నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మంగళవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
డిఫరెంట్ మర్డర్ మిస్టరీ..
ఆండ్రూ నా స్నేహితుడు, క్లాస్మేట్. గతంలో తను రెండు మూడు సినిమాలు చేశారు. ఈ కథ నాతో చేయాలని చెప్పారు. బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే ప్రధానంగా సాగే చిత్రమిది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా, మర్డర్ మిస్టరీగా సాగుతుంది. నేను ఇందులో కిల్లర్‌ని. పోలీస్ పాత్రలో అర్జున్ సూపర్‌గా నటించారు. నన్ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. నేను కిల్లర్‌గా ఎందుకు మారాను? ఎందుకు చంపుతుంటాను? ఎవరిని చంపుతుంటాననే సస్పెన్స్‌తో కూడిన అంశాల సమాహారమే సినిమా. ఆండ్రూ చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమాని నేను నిర్మించలేదు. ఫస్ట్‌టైమ్ వేరేవాళ్ళ బ్యానర్లో చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నమ్ముతున్నా. ఇందులో ఎలాంటి సందేశం ఉండదు. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ అవుతుంది.
ఇదొక గొప్ప అనుభవం..
ఇందులో అర్జున్సార్తో కలిసి నటించడం గొప్ప అనుభవం. ఆయన మంచి ప్రొఫెషనల్ యాక్టర్. బేసిక్‌గా నేను యాక్టర్‌ని కాదు. మంచి నటుడిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నా. అర్జున్ చాలా నీట్‌గా నటిస్తారు. ఆయన పాత్ర సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఈ సినిమాకి నేను సంగీతం అందించలేదు. సైమన్ కింగ్ మ్యూజిక్ చేశాడు. అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఆర్ఆర్ ఆకట్టుకుంటుంది. గతంలో ఓ సినిమాకి, ఇప్పుడు ఈ చిత్రానికి మాత్రమే నేను మ్యూజిక్ చేయలేదు. ఇకపై పూర్తిగా నటనపై దృష్టి పెట్టాలనే నిర్మాణాన్ని, మ్యూజిక్‌ని పక్కన పెట్టాను. ఇతర సంగీత దర్శకులు సంగీతం అందించినా అందులో నేను ఇన్వాల్వ్ కాను. కేవలం సలహాలు మాత్రమే ఇస్తాను. ఇతర దర్శకులైనప్పటికీ వాళ్ళ స్టయిల్లో వాళ్ళు ఫ్రెష్ మ్యూజిక్‌ని అందించడానికే ట్రై చేస్తారు.
బెటర్‌గా చేసేందుకు ప్రయత్నిస్తున్నా..
'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో నాకు మంచి గుర్తింపు వచ్చింది. నా సినిమాలను చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ తర్వాత సినిమాలు సరిగా ఆడలేదు. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ కామన్. ఇంకాస్త బెటర్‌గా సినిమాలు చేస్తూ, విజయం సాధించేందుకు ప్రయత్నిస్తున్నా. నన్ను నేను గుడ్డిగా నమ్మేస్తుంటాను. నేను ఇంత కాలం రన్ అవడానికి కారణం నా హార్డ్ వర్క్, సిన్సీయారిటీ. ఏ వర్క్ అయినా నేను ప్రాక్టికల్‌గా చేస్తాను. థియరీ చదువుకోలేదు. అదే సమయంలో నేను ప్రొఫెషనల్ సింగర్‌ని కాదు, ఎడిటర్ని కూడా కాదు. అన్ని రంగాలపై అవగాహన ఉంటే, ఏదైన తప్పు జరిగితే కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని నేర్చుకుంటున్నా.
వరుసగా పది సినిమాలు..
ప్రస్తుతం తమిళంలో 'ఖాకి' చిత్రంలో నటిస్తున్నా. పోలీస్ స్టోరీ ప్రధానంగా సాగే చిత్రమిది. దీంతోపాటు 'జ్వాల' అనే మరో సినిమా చేస్తున్నా. ఇందులో ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, అరుణ్ విజయ్, సత్యరాజ్ నటిస్తున్నారు. ఇలా వరుసగా ఓ పది సినిమాలు చేయబోతున్నా. ఇవన్నీ ఇతర నిర్మాణాల్లో ఉంటాయి. పెద్ద ప్రొడక్షన్లో చేయాలనుకుంటున్నా. ఇక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసే ముందు ఫస్ట్ నేను తెలుగు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.