Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను హీరోయిన్ల నెంబర్ గేమ్‌లో లేను. నాది సపరేట్ ట్రాక్. నెంబర్ గేమ్‌లో నా నెంబరెంతో లెక్కించుకోవడమంటే కామెడీగా అనిపిస్తుంటుంది' అని అంటోంది తాప్సీ.
గ్లామర్ పాత్రలతో అలరించిన తాప్సీ ట్రాక్ మార్చి లేడీ ఓరియెంటెడ్, బలమైన కథా నేపథ్యం ఉన్న సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. తాజాగా తెలుగు, తమిళంలో రూపొందిన 'గేమ్ ఓవర్'లో మెయిన్ లీడ్‌గా నటించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శశికాంత్ నిర్మించారు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా తాప్సీతో సోమవారం మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ఈ కథలో మీకేం నచ్చింది?
- ఏడాదిన్నర క్రితం శశికాంత్ ఈ బైలింగ్వల్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. తెలుగులో ఏడాదికో సినిమా చేస్తున్నా. తమిళంలో
'కాంచన 2' తర్వాత చేయలేదు. అశ్విన్ ఈ కథ నెరేట్ చేసిన వెంటనే ఓకే చెప్పాను.
కారణం ఇలాంటి కథ నాకు తెలిసి మన ఇండియాలోనే రాలేదు.
చాలా కొత్తగా, ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అందుకే 'మీరు ఈ సినిమాని
ఏ భాషలోనైనా తీయండి నేను చేస్తా'
అని చెప్పా. దర్శకుడు అశ్విన్ చాలా బ్రిలియంట్ డైరెక్టర్. అద్భుతంగా తెరకెక్కించారు.
నేటి యువతకి బాగా కనెక్ట్ అవుతుంది.
మీ పాత్ర ఎలా ఉంటుంది?
- నేను వీడియో గేమ్స్ తయారు చేస్తుంటాను. ఓ యాక్సిడెంట్ వల్ల రెండు కాళ్ళు విరిగిపోతాయి. దీంతో వీల్ చైర్‌కే పరిమితమవుతా. పైగా ట్రోమా బాధితురాలిని. ఈక్రమంలో చోటు చేసుకున్న సస్పెన్స్, థ్రిల్లర్ సన్నివేశాల సమాహారమే ఈ సినిమా. ఇందులో 60 శాతం వీల్ చైర్‌కే పరిమితమయ్యాను.
వీల్‌చైర్‌లో ఉండి నటించడం ఫిజికల్‌గా, మెంటల్‌గా పెద్ద ఛాలెంజింగ్‌గా అనిపించింది. దీంతో ఇది నాపై ప్రభావాన్ని చూపించింది. దాన్నుంచి బయటికి రావాలని కామెడీ సినిమాల్ని చూడ్డంతోపాటు ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేశా.
ఇకపై రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మీరు నటిస్తారా?
- ఈ మధ్య మహిళా ప్రధాన చిత్రాలు, శక్తివంతమైన పాత్రలతో కమర్షియల్ సినిమాకి కొంచెం దూరమైనట్టనిపిస్తోంది. కానీ మొత్తం కాదు. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ సినిమా అయినా మహిళా ప్రధాన సినిమా అయినా బలమైన కథ ఉంటుంది. గ్లామర్ పాత్రలు కూడా బలంగా ఉంటున్నాయి. అలాగే రైటర్స్లోనూ మార్పు వచ్చింది. మహిళలకు మంచి పాత్రలు రాస్తున్నారు. అయితే నేనే కథలో లీడ్‌ని కావడం, సినిమాని నా భుజాలపై మోయడమనేది చాలా హ్యాపీగా ఉంది. ఇది నాకు పెద్ద బాధ్యతగా అనిపిస్తుంటుంది. 'గేమ్ ఓవర్'లో రెండు గంటలపాటు నా పాత్ర ఆడియెన్స్‌ని హత్తుకుని నడిపిస్తుంది అంతేకాదు ఎంటర్టైన్ చేస్తుంది.
తెలుగులో సినిమాలు తగ్గడానికి కారణం?
నేను లేడీ ఓరియెంటెడ్, బలమైన పాత్రలున్న సినిమాలకు ప్రయారిటీ ఇస్తున్నా. తెలుగులోనూ అలాంటి కథలు వస్తున్నాయి. అందుకే బాలీవుడ్లో బిజీగా ఉన్నా, ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని నిర్ణయించుకున్నా. అయితే సినిమా అనేది డైరెక్టర్ మీడియా. మేం కేవలం పనిముట్లు మాత్రమే. దర్శకుడు మమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటే అలా చేస్తాం.
మీ పదేండ్ల సినిమా జర్నీని ఎనాలిసిస్ చేశారా?
- చేశాను. చాలా బాగుంది. ప్రారంభంలో నాకు యాక్టింగ్ తెలియదు. సినిమా సినిమాకి నేర్చుకుంటూ నా నటనని మెరుగుపరుచుకుంటూ వస్తున్నా. 'పింక్' సినిమాతో నా కెరీర్ మారిపోయింది. అమితాబ్ సార్‌తో కలిసి నటించిన 'బద్లా' వందకోట్లు వసూలు చేస్తుందని ఊహించలేదు. ఆ సినిమాతో నాపై నాకు నమ్మకం పెరిగింది.
తదుపరి సినిమాల గురించి?
- అక్షరు కుమార్‌తో 'మిషన్ మంగళ్'లో నటిస్తున్నాను. అక్షరు సర్ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. ఆయనలా చేయడం కష్టం. దీంతోపాటు 'సాండ్ కి ఆంఖ్' చిత్రంలో పెద్ద వయస్కురాలైన షార్ప్ షూటర్‌గా నటిస్తున్నా. ఇందులో నటించడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. తెలుగులో ఒకటి రెండు ప్రాజెక్ట్‌లకు చర్చలు జరుగుతున్నాయి. తమిళంలో ఓ సినిమా ఫైనల్ అయ్యింది. ఇక కథానాయికల మధ్య నెంబర్ గేమ్‌ని నేను పట్టించుకోను. నా రూట్ చాలా సపరేటు. ఇక ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన నాకు లేదు.