Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేటివిటి అనేది అన్నిసార్లు ముఖ్యం కాదు. ఏ సినిమాలోనైనా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే ఎమోషన్ ప్రధానం. నన్ను నేను ఎప్పుడూ స్టార్‌గా భావించలేదు. పాత్ర నచ్చకపోవడంతో ఇటీవల ఓ హాలీవుడ్ ఆఫర్‌ని తిరస్కరించా' అని అంటున్నారు హీరో విక్రమ్.
విభిన్న పాత్రలకు, ప్రయోగాత్మక చిత్రాలకు విక్రమ్ కేరాఫ్. తాజాగా ఆయన 'మిస్టర్ కెకె' చిత్రంతో మరోమారు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రాజేష్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విక్రమ్‌తో మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ఈ చిత్ర కథ, మీ పాత్ర గురించి?
- అంతర్జాతీయ కథా నేపథ్యంతో సాగే అత్యంత స్టయిలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఒక్క రోజులో జరిగే సినిమా. నా పాత్ర గ్రే షేడ్స్‌లో ఉంటుంది. కథాపరంగా చాలా మిస్టీరియస్‌గా ఉంటుంది. అదేంటనేది తెరపైనే చూడాలి. నేనిప్పటి వరకు చేసిన పాత్రల్లో బెస్ట్ క్యారెక్టరైజేషన్ ఇందులో ఉంటుంది.
ఈ సినిమా ఫ్రెంచ్ చిత్రానికి రీమేకా?
- రీమేక్ కాదు. ఓ సినిమా ద్వారా ఇన్స్పైర్ అయి దర్శకుడు రాజేష్ పూర్తి కొత్తగా ఈ కథ రాసుకున్నారు. ఆయన టెక్నీకల్‌గా చాలా స్ట్రాంగ్ పర్సన్. తనకి ఏం కావాలో చాలా క్లారిటీతో ఉంటాడు. అనుకున్న అవుట్‌ఫుట్ కోసం రాజీపడడు. అంతర్జాతీయ టెక్నీషియన్లు కూడా ఈ సినిమాకి పనిచేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు, ఛేజింగ్‌లు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. అంతేకాదు సినిమా కూడా చాలా వేగంగా రన్ అవుతుంది.
కమల్ హాసన్ ఈ సినిమాని నిర్మించడానికి రీజన్?
- నిజానికి కమల్ సర్ ఈ సినిమా చేయాల్సింది. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటంతో కుదరలేదు. దీంతో నాతో చేశారు. అలా ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ పతాకంపై ఆయన నిర్మించాల్సి వచ్చింది. నా అభిమాన నటుడి నిర్మాణంలో పనిచేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. షూటింగ్ టైమ్‌లో రెండుసార్లు సెట్‌కి వచ్చారు. మామూలు టైమ్‌లో ఈ పాత్ర తీరుతెన్నులు, గెటప్ గురించి చర్చించాం.
కథ, పాత్ర.. దేనికి ప్రయారిటీ ఇస్తారు?
- కథే ముఖ్యం. బలమైన కథ ఉన్నపుడే పాత్రలు పండుతాయి. అయితే కొన్నిసార్లు కథ బాగుండి, పాత్రలు అంతగా నప్పవు. అలాంటివి చేయడం కష్టం. రెండూ బాగున్నవే చేస్తా. సాధ్యమైనంత వరకు డిఫరెంట్ కథ, కథనాలున్న సినిమాలు, భిన్నమైన పాత్రలే చేసేందుకు ఆసక్తి చూపుతా.
యూనివర్సల్ కాన్సెప్ట్ ఉన్న కథల్లో, రీమేక్‌ల్లో నేటివిటి ఎంత వరకు అవసరం?
- నేటివిటి అనేది అన్నింటికి ముఖ్యం కాదు. ఏ సినిమాలోనైనా ఎమోషన్ ముఖ్యం. అది ఆడియెన్స్‌కి కనెక్ట్ కావాలి. 'శివపుత్రుడు' తమిళ సినిమా. దాన్ని తెలుగులో రీమేక్ చేయటానికి ఎవరు ముందుకు రాలేదు. అనువాదమై పెద్ద హిట్ అయ్యింది. తెలుగులో నాకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే 'బాహుబలి' మన ఇండియన్ సినిమా అంతర్జాతీయంగా ఆడింది. 'అర్జున్ రెడ్డి' హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. హాలీవుడ్ చిత్రం 'టైటానిక్' నేటివిటీ అనే భేదం లేకుండా మనందరం చూసి ఆస్వాదించాం. అద్భుతమైన సినిమా అంటూ గొప్పగా చెప్పాం. వాటిలో నేెటివిటీ కంటే ఎమోషన్‌కే ఎక్కువగా కనెక్ట్ అయ్యాం.
సక్సెస్‌కి బాగా దూరమైనట్టున్నారు?
- అవ్వలేదు (నవ్వుతూ). ఇటీవల వచ్చిన 'స్కెచ్' తమిళంలో బాగా ఆడింది. డబ్బులొచ్చాయి. నా కెరీర్ ప్రారంభంలో దాదాపు పదేండ్ల వరకు ఒక్క హిట్ లేదు. 'సేతు' పెద్ద బ్రేక్‌నిచ్చింది. తర్వాత తిరిగి చూసుకునే అవసరం రాలేదు. అపజయాలు కామన్. చేసే సినిమా, పాత్రలు ఎంత సంతృప్తినిచ్చాయి, వాటిని ఎంత ఇష్టంగా లీనమై చేశామనేది ముఖ్యం.
విక్రమ్ బాగా చేశాడు. విక్రమ్ సినిమా బాగుంది. విక్రమ్ సినిమా భారీగా కలెక్ట్ చేసింది. ఈ మూడింటిలో దేన్ని మీరు ఎక్కువగా ఇష్టపడతారు?
- సినిమా బాగా కలెక్ట్ చేసిందనేదే నాకు ముఖ్యం. నేను హీరో కాకముందు సినిమా అవకాశాలు వస్తే చాలనుకున్నా. హీరో అయ్యాక ఒక్క హిట్ వస్తే చాలనుకున్నా. హిట్ వచ్చాక విక్రమ్ బాగా చేశాడనే గుర్తింపు కోసం తాపత్రయపడేవాడిని. ఆ తర్వాత ఇతర భాషల్లో నటించాలని, మంచి దర్శకులతో పని చేయాలని అనుకున్నా. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విక్రమ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలనుకున్నా. గొప్ప నటుల జాబితాలో నా పేరు ఉండాలనుకుంటాను. అవన్నీ నేను సాధించాను. అలాగని నెంబర్ వన్ రేసులో లేను. నన్ను నేను ఎప్పుడూ స్టార్‌గా భావించడం లేదు. చేసే ప్రతి సినిమాకి నా వంతు బెస్ట్ ఇవ్వాలనుకుంటాను.
మీరు తెలుగువారైనప్పటికీ తమిళంలో రాణించిన తర్వాతే తెలుగులో గుర్తింపు తెచ్చుకోవడాన్ని ఎలా ఫీలవుతున్నారు?
- చాలా గొప్ప ఫీలింగ్ అది. తమిళంలో నేనేంటో నిరూపించుకున్నా. తెలుగు, మలయాళంలో మంచి గుర్తింపు లభించింది. ఇప్పటికీ ఛాన్స్ వస్తే తెలుగు, మలయాళ భాషా చిత్రాల్లో నటించడానికి రెడీ.
పాత్రల ప్రభావం మీపై ఎంతవరకు ఉంటుంది?
- ప్రారంభంలో పాత్రలోనుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడేవాడిని. 'శివపుత్రుడు' టైమ్‌లో ఆ పాత్ర నుంచి బయటపడటానికి చాలా టైమ్ పట్టింది. 'అపరిచితుడు'లో మూడు పాత్రలు చేశా. ఆ ప్రభావం చాలా రోజులు నన్ను వెంటాడింది. అలాంటి టైమ్‌లో ఒంటరిగా కూర్చుని రిలాక్స్ అవుతాను. ఎవరితోనూ మాట్లాడను. క్రమంగా వాస్తవ జీవితంలోకి వచ్చేవాడిని. అయితే ఇప్పుడు వాటిని అధిగమించాను. త్వరగానే బయటపడగలుగుతున్నా.
తదుపరి సినిమాలు?
- ప్రస్తుతం చేస్తున్న 'ధృవ నచ్చత్రం' పలు ఆర్థిక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే పూర్తవుతుంది. మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్ సెల్వమ్' చేస్తున్నా. ఇందులో నాది ఓ కీలక పాత్ర. చాలా వయిలెంట్‌గా, టెంపర్మెంట్గా ఉంటుంది. దానికి కోసం నాలుగు నెలలు కేటాయించా. జనవరిలో సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 'మహావీర కర్ణ' చిత్రం చేయాల్సి ఉంది. అజరు జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా.
మీ అబ్బాయి ధృవ నటిస్తున్న 'ఆదిత్య వర్మ' చిత్రం గురించి ?
- సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది. మొదట బాలా దర్శకత్వంలో చేసిన చిత్రాన్ని పక్కన పెట్టి మళ్ళీ షూట్ చేసిన విషయం విదితమే. ప్రస్తుత వెర్షన్ బాగా వచ్చింది. నేను వ్యక్తిగతంగా తీసుకుని దాదాపు మూడు నెలలు ఆ సినిమాపై దృష్టి పెట్టాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ వర్క్ చేశా. కొన్ని సీన్స్ చేసేటప్పుడు ధృవ్ నన్ను సెట్లో ఉండొద్దన్నాడు. ముఖ్యంగా రొమాంటిన్ సీన్స్ చిత్రీకరించేటప్పుడు నన్ను వెళ్ళిపో అన్నారు. గట్టిగా మందలించి చేయమని చెప్పా. చాలా బాగా చేశాడు. సినిమా అవుట్‌ఫుట్ విషయంలో, ధృవ్ యాక్టింగ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నా. వాడి యాక్టింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.