Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలా సినిమాల విడుదల తేదీలు ఓ పెద్ద సినిమా విడుదల తేదీపై ఆధారపడి ఉంటాయనే సంగతి తెలిసిందే. ఆగస్ట్ 15న విడుదల కావాల్సిన 'సాహో' విడుదల వాయిదా పడుతుందనే విషయం తెలిసి తెలియగానే పలు చిత్రాలు ఈనెలలోనే సందడి చేసేందుకు రెడీ అయిపోయాయి. ముఖ్యంగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని క్యాష్ చేసుకోవడానికి ఆగస్ట్ 15న రెండు సినిమాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. దీంతో ఈనెలలో దాదాపు పదికిపైగా చిత్రాలు తమ భవిష్యత్‌ని తేల్చుకోబోతున్నాయి. వాటి వివరాలేమిటో ఓసారి చూద్దాం..
సస్పెన్స్‌లో 'సాహో' రిలీజ్
ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ప్రభాస్ 'సాహో' వాయిదా పడిందనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తయ్యింది. సన్నివేశాల పరంగా భారీ గ్రాఫిక్ వర్క్
ఇంకా మిగిలి ఉండటంతో ఈ చిత్ర విడుదలని వాయిదా వేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, ఈచిత్రాన్ని ఆగస్ట్ 30న రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు పరిశ్రమవర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ సినిమా వాయిదా విషయంలోనే కాదు ఎప్పుడు రిలీజ్ చేస్తారనే అంశంపై
కూడా చిత్ర బృందం ఇంతవరకు స్పందించలేదు. దీంతో 'సాహో' రిలీజ్ ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ఆగస్ట్ సినిమాల సందడి 'గుణ 369'తో ప్రారంభం కాబోతుంది. కార్తికేయ, అనఘ జంటగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 2న విడుదల కానుంది. 'ఆర్ ఎక్స్ 100'తో మంచి విజయాన్ని అందుకున్న కార్తికేయ ఇటీవల 'హిప్పి'తో ఘోర పరాజయాన్ని చవిచూశారు. దీంతో తాజా సినిమాపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టీజర్లు, ట్రైలర్లు ఈ సినిమాపై అందరిలోనూ మంచి క్యూరియాసిటీని రైజ్ చేశాయి. ఈ చిత్ర ట్రైలర్‌ని చూస్తుంటే అచ్చు బోయపాటి శ్రీను సినిమా చూస్తున్నట్టే ఉందని, కార్తికేయని తమ గీతా ఆర్ట్స్ బ్యానర్లోకి ఆహ్వానిస్తున్నట్టు ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చెప్పడంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. లవ్, ఫ్యామిలీ, యక్షన్ బేస్డ్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.
కార్తీకేయ 'గుణ 369'తో సందడి చేయబోతుంటే, బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు'తో హల్చల్ చేయబోతున్నారు. 'సాక్ష్యం', 'కవచం', 'సీత' వంటి చిత్రాలతో హ్యాట్రిక్ ఫ్లాప్స్‌ని అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ సైతం 'రాక్షసుడు'తో కచ్చితంగా సక్సెస్ లభిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి రమేష్‌వర్మ దర్శకత్వం వహించారు. సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ప్రేక్షకులకు ఇదొక మంచి థ్రిల్‌నిచ్చే చిత్రమవుతుందనిపించేలా ఉన్నాయి. తమిళంలో మంచి విజయం సాధించిన 'రాక్షసన్' చిత్రానికిది రీమేక్. కేవలం ఒకే ఒక్క 'హృదయకాలేయం' చిత్రంతో బర్నింగ్ స్టార్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందిన కథానాయకుడు సంపూర్నేష్‌బాబు. ఆ తర్వాత నటించిన 'సింగం123' చిత్రం సైతం మంచి విజయం సాధించడంతో సంపూర్నేష్‌బాబు తాజాగా నటించిన 'కొబ్బరి మట్ట' సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రతి షాట్‌ని వినోదభరితంగా చూపించడం సంపూ సినిమాల ప్రత్యేకత. ఆ ప్రత్యేకత లేటెస్ట్గా విడుదలవ్వబోయే 'కొబ్బరిమట్ట' సినిమాకి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇటీవల విడుదలైన ట్రైలర్లో సంపూ చేసిన డాన్సులకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మొత్తమ్మీద ఒకే రోజు మూడు భిన్న జోనర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వారం గ్యాప్‌తో ఆగస్ట్ 9న నాగార్జున 'మన్మథుడు 2' చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. కీర్తిసురేష్, సమంత అతిథి పాత్రల్లో మెరవబోతున్నారు. గతంలో వచ్చిన 'మన్మథుడు' చిత్రానికి సీక్వెల్‌గా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందింది. నాగార్జున, విజరుభాస్కర్ కాంబినేషన్లో రూపొందిన 'మన్మథుడు' చిత్రం విశేష ప్రేక్షకాదరణతో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం కోసం త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ అందర్నీ విశేషంగా అలరించిన విషయం విదితమే. 'మన్మథుడు' చిత్రం మాదిరిగానే రాబోయే 'మన్మథుడు 2' చిత్రం కూడా మ్యాజిక్ చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున ఈ సినిమాతో సరైన హిట్ కొట్టబోతున్నాననే నమ్మకంతో ఉన్నారట.
ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ల తీరు చూస్తుంటే ఇందులో ప్లే బారుగా నాగ్, ఈయనకి తగ్గట్టుగానే రకుల్ ప్రీత్ క్యారెక్టర్ సైతం నేటి ట్రెండ్‌కి ప్రతిబింబంగా ఉంటుందని అర్థమవుతోంది. 'చి||ల||సౌ' చిత్రంతో దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ మలి ప్రయత్నంలోనే నాగార్జున వంటి అగ్ర హీరో చిత్రానికి దర్శకత్వం వహించడం ఓ విశేషమైతే, అందరి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉండబోతుందని టీజర్ల ద్వారా ఆయన నిరూపించడం మరో విశేషం.స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. నిన్నమొన్నటి వరకు ప్రభాస్ నటించిన 'సాహో' చిత్రం మాత్రమే సోలోగా విడుదలవుతుందనుకున్నారు. తాజాసమాచారం మేరకు ఈ సినిమా విడుదలని నిర్మాతలు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. దీంతో ఇండిపెండెంట్ డే రోజున శర్వానంద్ 'రణరంగం', అడివి శేషు 'ఎవరు' చిత్రాలు పోటీ పడుతున్నాయి. శర్వానంద్ గ్యాంగ్‌స్టర్‌గా నటించిన 'రణరంగం' చిత్రాన్ని సుధీర్ వర్మ రూపొందించగా ఇందులో కాజల్, కళ్యాణి ప్రియదర్శిని కథానాయికలుగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో శర్వానంద్ ఉన్నారు. గతేడాది ఆయన నటించిన 'పడి పడి లేచే మనసు' చిత్రం ప్రేక్షకుల నిరాదరణ పొంది డిజాస్టర్‌గా నిలిచిన విషయం విదితమే.థ్రిల్లర్‌గా రూపొందిన 'ఎవరు'లో అడివి శేషు, రెజీనా జంటగా నటించారు. నూతన దర్శకుడు వెంకట్ రామ్‌జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ అవుతోంది. జేమ్స్‌బాండ్ చిత్రాలను మరిపించేలా అడివిశేషు నటించిన 'గూఢచారి' మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఆయన నటించిన తాజా చిత్రం 'ఎవరు'పై సర్వత్రా మంచి అంచనాలున్నాయి. దీనికితోడు లేటెస్ట్గా విడుదల చేసిన పోస్టర్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అలాగే ఈ సినిమా కచ్చితంగా డిఫరెంట్‌గా ఉంటుందనే ఈ పోస్టర్లు చెప్పకనే చెప్పాయి.
ఆగస్ట్ నెలాఖరులో నాని 'గ్యాంగ్ లీడర్' రాబోతుంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. దీంతోపాటు డబ్బింగ్ సినిమాలు సైతం ఆగస్ట్‌లో సందడి చేయటానికి రెడీ అయ్యాయి. అందులో సూర్య నటిస్తున్న 'బందోబస్త్' చిత్రం కూడా ఉంది. 'రంగం' ఫేమ్ కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో సూర్యతోపాటు మోహన్‌లాల్, ఆర్య, సాయేషా సైగల్ ప్రధాన పాత్రలు పోషించారు. 'ఈగ' చిత్రంతో తెలుగులో మంచి మార్కెట్‌ని క్రియేట్ చేసుకున్న కన్నడ హీరో సుదీప్ ఆగస్ట్ 29న 'పహిల్వాన్'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఎస్.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో వారాహి సంస్థ విడుదల చేస్తోంది. అలాగే పలు చిన్న చిత్రాలు సైతం ఆగస్ట్‌లో రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. అందులో అలీ నటించిన 'పండుగాడి ఫొటో స్టూడియో', ఆది, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా రూపొందిన 'జోడి', నిఖిల్ హీరోగా నటించిన 'అర్జున్ సురవరం', శ్రీకాంత్ నటించిన 'మార్షల్', 'ఉండిపోరాదే', 'సైకిల్', 'కౌసల్య కృష్ణమూర్తి' వంటి తదితర చిత్రాలు ఈనెలలోనే అమీతుమీ తెల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.