Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గ్యాంగ్ స్టర్ సినిమా తీసిన ప్రతి ఒక్కరికి 'గాడ్‌ఫాదర్' స్ఫూర్తిగా నిలుస్తుంది. 'రణరంగం'ని తీసేటప్పుడు కూడా దాన్నే స్ఫూర్తిగా తీసుకున్నా' అని అంటున్నారు దర్శకుడు సుధీర్ వర్మ. శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోహీరోయిన్లుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రణరంగం'. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా మంగళవారం సుధీర్‌వర్మ మీడియాతో సంభాషించారు. ఆ విశేషాల సమాహారం ఆయన మాటల్లోనే..
లిక్కర్ స్మగ్లింగ్ నేపథ్యం..
1994లో ఎన్టీఆర్ రెండో సారి సీఎం అయ్యారు. ఆ టైమ్‌లో ఆయన మద్యపాన నిషేధం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక దాన్ని రద్దు చేశారు. ఈ రెండేండ్ల కాలంలో జరిగిన మద్యపాన నిషేధం, ఆ టైమ్‌లో లిక్కర్ స్మగ్లింగ్‌ని ఇతివృత్తంగా తీసుకుని ఈ కథని రెడీ చేసుకున్నా. శర్వానంద్ నటించిన 'ప్రస్థానం' నాకిష్టమైన సినిమా. ఆయనలో ఇలాంటి యాంగిల్ ఉందని నేను నమ్మాను. ఈ కథకి బాగా సూట్ అవుతాడనపించింది. ఓ యువకుడు పరిస్థితుల రీత్యా గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన వైనం ప్రధానంగా సినిమా సాగుతుంది. సినిమా మొత్తం శర్వానంద్ పాత్ర కోణంలోనే ఉంటుంది.
రవితేజతో చేయాల్సింది శర్వాతో చేశా..
ఈ కథని మొదట రవితేజతో చేయాలనుకున్నా. కానీ ఆయన అప్పటికే రెండు, మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. దీంతో మరో కథని శర్వానంద్‌తో చేయాలనుకున్నా. కానీ శర్వాకి అది నచ్చలేదు. మరేదైనా ఉందా అని అడిగితే, ఈ కథ గురించి చెప్పా. తనకి బాగా నచ్చడంతో ఇదే చేద్దామని నన్ను కన్వీన్స్ చేశారు. ఈ విషయం రవితేజకి చెప్పి ఒప్పించా. శర్వానంద్ 40 ప్లస్ ఏజ్‌గా ఉండే క్యారెక్టర్లో సూట్ అవుతాడా అనే చిన్న సందేహం ఉండేది. లుక్ టెస్ట్ చేశాక పర్ఫెక్ట్ యాప్ట్‌గా అనిపించారు. సినిమాలో ఆయన కళ్యాణితో ప్రేమాయణం సాగిస్తుంటాడు. శర్వా, కళ్యాణి లవ్ ట్రాక్ చూశాక నేను కూడా లవ్ స్టోరీస్ చేయగలననిపించింది. సెకండాఫ్‌లో ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ కావాలి. అందుకు కాజల్ అనుకున్నాం. కథ చెప్పగానే నిడివి తక్కువైనా ఆమె చేస్తానని అంగీకరించడం విశేషం.
కాపీ కొట్టలేదు స్ఫూర్తి పొందానంతే..
గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఏ దర్శకుడు సినిమా చేసినా 'గాడ్‌ఫాదర్' నుంచే ఇన్స్పైర్ అవుతారు. నేను కూడా 'గాడ్‌ఫాదర్ 2' నుంచి ఇన్స్పైర్ అయి ఈ సినిమాని తీశాను. సెకండాఫ్ స్క్రీన్‌ప్లేపై ఆ ప్రభావం ఉంటుంది. దీంతోపాటు కొన్ని సీన్లలోనూ కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్ చాలా వరకు ఆ సినిమాకి దగ్గరగా ఉంటుంది. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇది చెప్పడానికి కారణం.. రేపు మీరే (మీడియా) కాపీ కొట్టారంటారు (నవ్వుతూ). ఏక కాలంలో 1990 కాలంతోపాటు ప్రస్తుతం సినిమా జరుగుతుంది. 1990 ఎపిసోడ్ కోసం ఓ అటవి ప్రాంతంలో సెట్ వేశాం. సినిమాకి సముద్రం కావాలి. అందుకు వైజాగ్‌ని నేపథ్యంగా ఎంచుకున్నాం. ఆయా ఎపిసోడ్స్ చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఫైనల్‌గా బాగా వచ్చిందనుకుంటున్నా. శర్వా దీనికి సీక్వెల్ ఐడియా చెప్పారు. ఈ సినిమా వర్కౌట్ అయితే సీక్వెల్ చేస్తాం.
అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది..
ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఎక్కడా ఎక్కువ బడ్జెట్ పెట్టలేదు. ఒక బడ్జెట్ చెప్పి పెంచలేదు. ఎంత వరకు చేయాలనుకున్నామో అంతే చేశాను. సితార ఎంటర్టైన్మెంట్లో సినిమా చేయాలని 'స్వామిరారా' టైమ్‌లోనే నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారు. అది చేయడానికి ఇంత టైమ్ పట్టింది. ఈ చిత్ర టైటిల్‌ని నిర్మాత వంశీనే చెప్పారు. ముందుగా మేం 'దళపతి' అనుకున్నాం. ఆ టైటిల్ రైట్స్ దొరకలేదు. దీంతో 'రణరంగం'కి ఫిక్స్ అయ్యాం. ట్రైలర్ విడుదలయ్యాక సినిమాపై బాగా క్రేజ్ వచ్చింది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది.
నా సినిమాల్లో క్రైమ్ తప్పనిసరి..
నేను రూపొందించే సినిమాలో క్రైమ్ కచ్చితంగా ఉండాలి. మర్డర్ లేకుండా నేను సినిమాలు చేయలేదు. బహుశా నేను చూసిన సినిమాల ప్రభావం అయి ఉండొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కూడా నేను చేయలేను. అలా చేసిన 'దోచెరు' వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఆ వైపు వెళ్ళాలనుకోవడం లేదు. అందుకే భిన్నమైన సినిమాలే చేస్తున్నాను. దర్శకుడిగా ఐదేండ్ల కెరీర్లో నేను చేస్తున్న సినిమాల విషయంలో, నా స్థానం విషయంలో హ్యాపీగానే ఉన్నా. కాకపోతే ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నా. ఇంకా చాలా చేయాలి. నెక్ట్స్ రవితేజతో అనుకున్నాం. ఈ సినిమా ఫలితాన్ని బట్టి ఆయన ప్రాజెక్ట్ ఆధారపడి ఉంది.