Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్షయ్ కుమార్, కరీనా కపూర్, దిల్జిత్ దోసాంజే, కైరా అద్వానీ ప్రధాన పాత్రధారులుగా రాజ్ మెహతా దర్శకత్వంలో హిందీలో 'గుడ్ న్యూస్' చిత్రం రూపొందుతుంది. కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృత్రిమ పద్ధతిలో గర్భం దాల్చడం నేపథ్యంలో కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని గురువారం విడుదల చేశారు. గర్భవతులుగా కరీనా కపూర్, కైరా అద్వానీలు ఉండగా, వారిని చూస్తూ కన్ఫ్యూజ్ అవుతున్న అక్షయ్, దిల్జిత్ లుక్స్ ఫస్ట్‌లుక్‌లో ఆద్యంతం నవ్విస్తున్నాయి. వినోదంతోపాటు సందేశం మేళవించిన చిత్రంలా ఇది రూపొందుతుందని ఫస్ట్‌లుక్ చూస్తే అర్థమవుతుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 27న విడుదల కానుంది. మరోవైపు ఇప్పటికే పంజాబీ, మరాఠి భాషల్లో పలు సినిమాలు నిర్మించిన అక్షయ్ కుమార్ మరోసారి నిర్మాతగా మారబోతున్నారు. తెలుగులో మంచి విజయం సాధించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'భాగమతి'ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రధారిణిగా రూపొందిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. భూమి పడ్నేకర్, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రధారులుగా రీమేక్ కాబోతున్న ఈ చిత్రానికి అక్షరు కుమార్ సహ నిర్మాతగా విక్రమ్ మల్హోత్రాతో కలిసి నిర్మించనున్నారు. మాతృక దర్శకుడు జి.అశోక్ దీనికి కూడా దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో అక్షయ్ కూడా అతిథిగా ఓ ముఖ్య పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్లో ఈ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం.