Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ జంటగా భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం:11గా నిర్మించిన చిత్రం 'మిడిల్ క్లాస్ మెలోడీస్'. ఈ చిత్రం ద్వారా వినోద్ అనంతోజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వెనిగళ్ళ ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెనిగళ్ల ఆనందప్రసాద్ మాట్లాడుతూ, 'సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. తొలి కాపీ కూడా సిద్ధంగా ఉంది. కథకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు తీద్దామనుకునే నిర్ణయంలో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. గుంటూరు నేపథ్యంలో సాగే కథ ఇది. గుంటూరు జిల్లా కొలకలూరు ప్రాంతంలో, గుంటూరు సిటీ, పరిసర ప్రాంతాల్లోనూ చిత్రీకరణ జరిపాం. పాత్రలన్నీ గుంటూరు యాసలోనే మాట్లాడతాయి. ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నాం. కానీ లాక్ డౌన్ పరిస్థితుల వల్ల విడుదలను వాయిదా వేశాం. త్వరలోనే విడుదల తేదీ వివరాలను వెల్లడిస్తాం' అని తెలిపారు.
'మామూలు మనుషుల జీవితాల్లో ఉండే సున్నితమయిన హాస్యాన్ని ఇందులో చూపించాం. ప్రతి ఒక్కరూ తమని తాము ఐడెంటిఫై చేసుకునేలా పాత్రలుంటాయి. వాటితో పాటు మంచి లవ్ స్టోరీ కూడా ఉంది. ఆనంద్ దేవరకొండ తొలి చిత్రం 'దొరసాని'కి పూర్తి భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది. 'కేరాఫ్ కంచరపాలెం'తో పాటు పలు చిత్రాలకు సంగీతం అందించిన స్వీకర్ అగస్తి మా చిత్రానికి మంచి పాటలు ఇచ్చారు. మొత్తం ఐదు పాటలూ అందర్నీ విశేషంగా అలరిస్తాయి' అని దర్శకుడు వినోద్ అనంతోజు చెప్పారు. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ, చైతన్య గరికపాటి, దివ్య శ్రీపాద, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, ప్రేమ్ సాగర్, ప్రభావతి వర్మ తదితరులు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, కథ, సంభాషణలు: జనార్దన్ పసుమర్తి, స్క్రీన్ప్లే: జనార్దన్ పసుమర్తి, వినోద్ అనంతోజు, ఎడిటర్: రవితేజ గిరిజాల, ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై, సంగీతం: స్వీకర్ అగస్తి, ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్: ఆర్.హెచ్. విక్రమ్, సాహిత్యం: సానాపతి భరద్వాజ పాత్రుడు, శ్రీ సాయి కిరణ్ , విస్సాప్రగడ రవికష్ణ, లైన్ ప్రొడ్యూసర్: నరేష్ రెడ్డి పోలసాని, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి.