Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. కుల, మత, లింగ ప్రాంతాల పేరుతో వివక్ష నిషేధం అని 14, 15 అధికరణాలు చెప్తున్నాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన పాలకులు రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నారు. మహిళా సాధికారిక కనుచూపుమేరలో కనిపించటంలేదు. చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన గణాంకాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. లోక్‌సభలో 14.94శాతం, ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 8.2శాతం మంది మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఒకే ఒక మహిళ గెలుపొందింది. దేశ వ్యాప్తంగా అసెంబ్లీల్లో 8శాతం మాత్రమే మహిళలు. 17వ లోక్‌సభలో మహిళలు14.9 శాతం మాత్రమే. బిల్లు కనుక చట్టరూపం దాల్చితే లోక్‌సభలో మహిళా సభ్యులు 181కి పెరుగుతారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని గొప్పలు చెప్పుకొనే మన దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాలుగా తెరమరుగున పడింది. సగభాగంగా ఉన్న మహిళలకు చట్టసభలలో 1/3 వంతు రిజర్వేషన్లు కల్పించాలని మహిళా సంఘాలు సుదీర్ఘ కాలంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నాయి. 1996లో లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నానా రభస జరిగింది. మహిళా రిజర్వేషన్ వలన కుటుంబ జీవనం, సామాజిక సంబంధాలు దెబ్బతింటాయని బీజేపీ అభ్యంతరం ప్రకటించింది. వామపక్షాలు మినహా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ పార్టీలకు ఏకాభిప్రాయంలేదని బిల్లు సెలక్ట్ కమిటీకి పంపబడింది. గీతా ముఖర్జీ నాయకత్వాన ఏర్పడిన పార్లమెంటరీ సెలక్ట్ కమిటి ఏకగ్రీవంగా యథాతథంగా బిల్లును ఆమోదించమని తెలిపింది. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మహిళా బిల్లు ప్రస్తావనే లేదు. విశ్వ గురువుగా కీర్తి ప్రతిష్టలు అందుకుంటున్న మోడీ మహిళా బిల్లు గురించి ఒక్క మాట కూడా మాట్లాడంలేదు. లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. చట్టసభల్లో ఓబిసీలకు రాజ్యాంగం ఎటువంటి రిజర్వేషన్లు కల్పించలేదు. ఈ అంశంపైన పార్లమెంట్లో విడిగా చర్చను చేపట్టాలి. పార్లమెంట్లో చర్చ జరగనీయకుండా మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మాత్రం లొల్లి చేస్తున్నారు.
మన స్వార్థ రాజకీయ పార్టీలు అన్ని కూడా చట్టసభల్లో 1/3వ వంతు మహిళా రిజర్వేషన్ చట్టం చేస్తామని ఎన్నికల ప్రణాళికలలో, ఎన్నికల ప్రచారంలో మహిళా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వాగ్దానాలు చేస్తుంటాయి. ఓట్ల కోసం, రాజకీయ సభల కోసం మహిళలను ఉపయోగించుకుంటున్నాయి. పార్టీలో పదవులు, ఎన్నికల్లో సీట్లు ఇవ్వటంలో వెనుక అడుగు వేస్తున్నవి. సంవత్సరాలు గడిచినా రిజర్వేషన్ ఊసే ఎత్తటం లేదు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరిగితే శాసనాలు రూపొందించడంలో, ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషించే వీలు ఉంటుంది. మహిళలు వంటింటికి, పిల్లల్ని కని పెంచటానికి, కుటుంబ ఆలనా పాలనా బాధ్యత వహించాలని అంతవరకే పరిమితం కావాలనే మనువాద సిద్ధాంతకర్తల పాలనలో బిల్లుకి మోక్షం కలగదు. పైగా తమ రాజకీయ గుత్తాధిపత్యానికి బీటలు పడతాయనే భయం పాలక వర్గ రాజకీయ పార్టీలలో ఉంది. అనేక ప్రజా వ్యతిరేక బిల్లులు ఒంటి చేతితో ఆమోదింప చేసుకునే పాలక పార్టీలు మహిళా బిల్లును మాత్రం ఏకాభిప్రాయం పేరుతో సంవత్సరాల తరబడి పక్కన పెడుతున్నాయి.
రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా బిల్లు గత 12ఏండ్లుగా పార్లమెంట్లో భద్రంగా ఉంచ బడినది. మనకన్నా వెనుకబడిన రువాండా, టాంజానియా, ఉగాండా, ట్యునీషియా, దక్షిణ సూడాన్ వంటి ఆఫ్రికా దేశాలే కాదు. మన పొరుగున ఉన్న పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల చట్టసభల్లో మనకన్నా మహిళల సంఖ్య మెరుగ్గా ఉంది. దేశ జనాభాలో సగభాగం మహిళలు ఆ మేరకు రాజకీయ రంగంతో సహా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. కానీ చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లునే గట్టెక్కించలేక మూలనపడేసిన ఘనత మన నాయకులది. మహిళలు సాధికారిత సాధించారని ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా వాస్తవ పరిస్థితులు అపహాస్యం చేస్తున్నాయి. ఉన్నత పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ఒకరిద్దరు మంత్రులను చూపించి మహిళలందరూ సాధికారిత సాధించారని ప్రచారం చేస్తున్నారు. మహిళలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఓటుహక్కు సాధించుకున్నారు. 1962 నుండి 2014 వరకు పాలనలో మహిళా ఓట్ల శాతం పెరుగుతూ వచ్చింది. పాలనలో మహిళల భాగస్వామ్యం కొరకు జరిగిన ఉద్యమాల ఫలితంగా 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన రిజర్వేషన్లను వినియోగించుకొని స్థానిక సంస్థల్లో మహిళలు లక్షల మంది పాలన సాగిస్తున్నారు. ఎన్నికైన మహిళా ప్రతినిధులను పక్కన పెట్టి వారికి స్థానంలో భర్త లేదా కుటుంబ సభ్యులే అన్ని వ్యవహారాలు నడుపుతున్నారు.
మహిళా బిల్లుపై జరుగుతున్న చర్చల ప్రక్రియ మహిళల సమానత్వానికి, మహిళాభివృద్ధికి ఆటం కాలుగా ఉన్న ఫ్యూడల్ సంస్కృతికి అద్దం పడుతున్నది. నిర్ణయాధికారాల్లో సమాన భాగస్వామ్యం కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం. పార్లమెంట్లో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ మహిళా బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టకుండా తొక్కిపెడుతోంది. బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదానికి పెట్టకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తూ పబ్బం గడుపుతున్న పార్టీలకు మహిళలు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి.
- దండంరాజు రాంచందర్ రావు
సెల్: 9849592958