Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిండా 14ఏండ్లు లేవు, చదువుతున్నది తొమ్మిదో తరగతి. ప్రేమ వ్యవహారంతో గొడవపడి కత్తులతో పొడుచుకోవడం ఈమధ్య ఒక పాఠశాలలో జరిగిన సంఘటన. తనకు తానే అబార్షన్ చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన 18ఏండ్ల అమ్మాయి చదువు ఒత్తిడిని అధిగమించలేక ఆత్మహత్య చేసుకున్న అబ్బాయి ఇలాంటి సంఘటనలు పాఠశాలల్లోనే కాదు, విశ్వవిద్యాలయాల్లోనూ పెరిగిపోయాయి. దేశంలోని అత్యున్నత కాలేజీలైన ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు కూడా ఇందుకు మినహాయింపు కావు. ఎంతో మెరిట్ సాధిస్తేగాని అటువంటి కళాశాలలో అడ్మిషన్ దొరకదు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది వారందరూ చాలా తెలివైన పిల్లలు. అయినా వాళ్ళు కూడా అనాలోచితంగా ప్రవర్తించి, ఆందోళన లతో విపరీత నిర్ణయాలను తీసుకోవడం. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. చదువు వారికి బతకడానికి కావాల్సిన నైపుణ్యాలు ఇవ్వడంలో వెనకబడిందా! ద్వేషాలు, మోసాలు స్థానంలో ప్రేమ, స్నేహం అందించే వ్యవస్థను సృష్టించ లేకపోతోందా? వీటిలో బడి పాత్ర, కుటుంబ పాత్ర ఎంత ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు?
నేడు అనేక కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల నుండి బయటకు వచ్చేశాయి. ఉమ్మడి కుటుంబాలు బంధాలను బాంధవ్యాలను పట్టుకొని ఉండేవి. ఒకరు కాకపోతే మరొకరు పిల్లల్ని కనిపెట్టుకొని ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. తల్లిదండ్రులు ఇద్దరు పనులకు వెళ్లిపోతున్నారు. పిల్లల పెంపకం పట్ల దృష్టి పెట్టే తీరిక తల్లిదండ్రులకు లేదు. పిల్లలను మంచి బడిలో వేసావా లేదా? వాళ్లకు కావాల్సినవి అందించామా లేదా వీటిపైన తల్లిదండ్రులు దృష్టి పెడుతున్నారు. కానీ పిల్లల మానసిక స్థితిగతులు ఏంటి? ఆ వయసులో వాళ్ళు ఎటువంటి ఉద్వేగాలకు గురవుతున్నారు? మన ఆశలను తీర్చడంలో వారు సర్దుబాటు చేసుకోలేక ఆందోళనకు ఒత్తిడికి గురవుతున్నారా? చదవడం అంటే మార్కులు తెచ్చుకోవడం మాత్రమే అనే అవగాహనతో తల్లిదండ్రులు పిల్లలపై తెచ్చే ఒత్తిడి నేడు సర్వ సాధారణం. పాపం తల్లిదండ్రుల కోరిక తీర్చలేకపోతున్నామనే బెంగతో ఆత్మహత్యలకు పాల్పడే పిల్లలు. ఇలాంటివి నెలకో కేసైనా మనం చూస్తున్నాం. తల్లిదండ్రుల కోసం ఖలీల్ గిబ్రాన్ అనే కవి తన కవితలో ఇలా అన్నాడు.. ''మీ పిల్లలు మీ పిల్లలు కాదు, భవిష్యత్తు జీవితం కోసం తపించే కొడుకులు, కూతుళ్లు వాళ్లు మీ ద్వారా వచ్చారు కానీ మీ నుండి కాదు వాళ్లు మీతో ఉన్నప్పటికీ మీ వాళ్ళు మీ సొంతం కాదు. మీరు వాళ్ళకి ప్రేమను పంచవచ్చుగాని మీ ఆలోచనలు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి సొంత ఆలోచనలు ఉంటాయి. మీరు వారి రేపటి భవిష్యత్తును కలలో కూడా దర్శించలేరు. మీరు వాళ్ళ లాగా ఉండేందుకు ప్రయత్నించవచ్చు కానీ వారిని మీలాగా మార్చాలని ప్రయత్నించకండి. ఎందుకంటే జీవితం వెనక్కిపోదు, నిన్నటితో ఆగదు, జీవితం భవిష్యత్తులోకి ప్రయాణిస్తుంది. మీరు భవిష్యత్తులోకి మీ పిల్లలతో కలిసి ఎంత దూరం ప్రయాణించగలరో ఆలోచించండి'' దీని అర్థం తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ సహకరించాలి, ఎక్కడ వారిని వారిగా వదిలేయాలి, ఎక్కడ జోక్యం చేసుకోవాలి అనే సంగతులు గమనించి తెలుసుకోవాలి. పిల్లలను కనిపెట్టుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలను అర్థం చేసుకొనే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారో ఆలోచించు కోవాలి. ఎలాంటి సంఘర్షణలు అయినా మాట్లాడితే సర్దుకుంటాయి అంటారు. పూర్వం నుండి ఇంటి సమస్యలు కావచ్చు, ఆస్తి గొడవలు కావచ్చు పెద్దల ముందు పెట్టి చర్చించుకుని సామరస్యంగా పరిష్కరించుకునేవారు. పిల్లల విషయంలోనూ అంతే. మాట్లాడితేనే పిల్లల మనోగతాలు బయటపడతాయి. మాట్లాడితేనే పిల్లలకు తల్లిదండ్రులు వారికి అండగా నిలబడ్డారు అనే ధైర్యం వస్తుంది. మాట్లాడితేనే పిల్లల ఆలోచన ధోరణి మారుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
బడి పాత్ర ఎంత?
సమాజంలో విద్యార్థుల వ్యక్తిత్వ నిర్మాణానికి బడి పునాదులు వేస్తుంది. బడి అనగానే ఉపాధ్యాయులు, పుస్తకాలు, పిల్లలు సిలబస్, పరీక్షలు వీటి చుట్టూనే ఒక వెబ్ లాగా చదువు అల్లుకోబడి ఉంది. ఈ చట్రం నుండి ఎవరూ బయటపడలేని స్థితికి నేటి వ్యవస్థ మారిపోయింది. చదువు చెప్పడం అంటే పుస్తకాల్లోని పాఠాలను పూర్తి చేయడం, పరీక్షల్లో పిల్లల జ్ఞానాన్ని అంచనా వేయడం, మార్కుల ద్వారా పిల్లల గ్రేడ్లను నిర్ణయించడం. ఇది నేటి విద్యా వ్యవస్థ నడుస్తున్న తీరు. ఒక క్రమశిక్షణ, విలువలు, మనోవికాసం, జీవన నైపుణ్యాలు వంటి వాటికి మార్కులు లేవు. కాబట్టి అది మన సబ్జెక్టు కాదు అనుకునే ఉపాధ్యాయులు లేకపోలేదు. జాతీయ విద్యావిధానం 2020లో విలువలు అన్నీ ప్రతి సబ్జెక్టులో ఏదో ఒక రూపంలో మిళితమై ఉంటాయని వాటిని విడివిడిగా చూడకూడదని చెబుతోంది. కరికులం, కోకరికులం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలని సబ్జెక్టును చెప్పేటప్పుడు వాటిని కలుపుకుంటూ చెప్పాలని అప్పుడే ఆ విలువలు పిల్లల మనసులో నాటుకుపోతాయని చెప్పింది. పిల్లల మనోవికాస కేంద్రాల అయిన తరగతి గదులను ఒత్తిడి ఆందోళనకు గురి చేసే కేంద్రాలుగా మార్చకూడదు. మన పాఠం ద్వారా మన పిల్లలు ఏమి నేర్చుకున్నారు? ఏ విలువలు పొందగలిగారు? అవి వారి జీవితానికి ఎక్కడ, ఎలా ఉపయోగపడుతుందో చెప్పగల ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులకే కాదు ఉపాధ్యాయులకు మరింత ఎక్కువగా పిల్లలతో భావావేశ బంధాన్ని కలిగి ఉండాలి. పిల్లల అభ్యసనలో వాళ్లకు సహాయ పడాలంటే పిల్లల కుటుంబ నేపథ్యంతో పాటు పిల్లలు ఎమోషన్స్ వారి ప్రవర్తనల గురించి ఉపాధ్యాయులకు తెలిసి ఉండాలి. ఉపాధ్యాయుడే వారికి ఒక గురువు, మిత్రుడు, ఒక కౌన్సిలర్ అవ్వాలి.
మార్పు ఎక్కడరావాలి?
పిల్లల పెంపకం ఎవరి బాధ్యత ఎంతో తెలిపే వ్యవస్థ మనకు లేదు. పూర్వపు భయభక్తులు నేడు లేవు. గట్టిగా చెబితే ఏమి రాద్థాంతం చేస్తారో అని తల్లిదండ్రులు, గట్టిగా మందలిస్తే ఏ అఘాయిత్యా లకు పాల్పడతారో అని ఉపాధ్యాయులు పిల్లల్ని వారి మానానికి వారిని వదిలేస్తున్నారు.
'దేశం అంటే మట్టి కాదు... దేశమంటే మనుషులోరు' ఒక దేశం మంచి దేశం ఎప్పుడు అవుతుంది? మంచి నడవడిక నైపుణ్యం, వివేకం కలిగి ఉన్న మనుషులు ఉన్నప్పుడే కదా! 'పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం అంటే మౌలికంగా మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవడమే' అని ఎ.ఎస్.నీల్ అంటారు. పిల్లలను పట్టించుకోవడం అంటే మన అభిప్రాయాలు రుద్దడం కాదని తల్లిదండ్రులు గ్రహించాలి. పెద్దల్లో మార్పు వస్తే పిల్లలు మారుతారు. పిల్లలతో గడపడానికి వానితో మాట్లాడడానికి రోజులో ఎంత సమయాన్ని కేటాయిస్తున్నామో తల్లిదండ్రులు ఆలోచించాలి. మన ఆకాంక్షలతో పిల్లల్లో ఒత్తిడి గురి చేస్తున్నామా ఆలోచించాలి. పరిస్థితులను సర్దుబాటు చేసుకునే విధంగా తర్ఫీదు ఇవ్వడంలో కూడా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. పిల్లలను ఇతర పిల్లలతో కలసి ఆడటం, కలిసి చదువుకోవడం ప్రోత్సహించాలి. కలిసి పని చేయడంలో ఉన్న ఆనందాన్ని వారికి రుచి చూపించాలి. మరీ ఒంటరిగా గదిలో కూర్చుని చదువుకోవడం, బడికి వెళ్ళడం, ఇంటి కి రావడం మళ్ళీ పుస్తకాలు వేసుకుని కూర్చోవడం ఇదీ పిల్లల దినచర్య. ఎలాంటి కొత్తదనం లేదు. మాటా మంతీ లేదు. వీటికి తలిదండ్రులు చెక్ పెట్టాలి.
మాటల నెట్వర్క్ ఏర్పాటు చేయాలి
బడిలో బోధనా విధానంలోనే కొన్ని సంస్కరణలు చోటు చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లల బయటి పరిసరాలు జ్ఞానం పిల్లల అనుభవాలు తరగతి గదిలో చర్చించబడాలి. పిల్లల్లోని ఆసక్తి అన్వేషణ పెంచే విధంగా బోధనా అభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి. 'ఆలోచింప చేయడమే నిజమైన విద్య' అన్నారు. పిల్లలను ఆలోచింపజేయడంలో మన వంతు కర్తవ్యాన్ని గుర్తించాలి. పిల్లలకు సరిపడా నేర్చుకునే అంశాలు లేనప్పుడు వారికి ఆసక్తికరంగా ఆక్టివిటీ లేనప్పుడు ఇలాంటి ఇతర అంశాలపై దృష్టి మరలుతుంది. వారి జ్ఞానతృష్టకు తగిన వసతులు బడిలో కల్పించబడాలి.
ఉదాహరణకు కొన్ని ప్రాక్టీసెస్ చూద్దాం...
పూర్వం బడులలో వివిధ హౌసులు సిస్టం ఉండేది. ఒక్క హౌస్లో 6 నుండి 10 తరగతుల పిల్లలు మెంబర్లుగా ఉండేవారు. బడిలో ఒక్కొక్క వారం ఒక్కొక్క హౌస్ వారు బాధ్యత చేపడతారు. అసెంబ్లీ నిర్వహణ నుండి పాఠశాల శుభ్రత, తరగతి క్రమశిక్షణ కార్యక్రమాల నిర్వహణ ఆటలు వంటివి అందులో భాగాలు. హౌస్ల మధ్య పోటీలు ఉండేది. ఇందులో చిన్న, పెద్ద పిల్లల మధ్య సోదర భావవం, సమిష్టిగా పనిచేయడం ఒకరికొకరు సహకరించుకోవడం, బాధ్యతలు పంచుకోవడం, తమ శక్తి యుక్తులను గరిష్టంగా వినియోగించుకోవడం జరుగుతుండేది. అలాంటి కార్యక్రమాల వల్ల పిల్లల్లో వారికి తెలియకుండా సర్దుబాటు చేసుకునే లక్షణంతో పాటు కలిసి పనిచేయడంలో ఉండే ఆనందాన్ని పొందడంతో బాటు, సమస్య పరిష్కారాన్ని చేసుకొని నైపుణ్యాలను పొందడం, నాయకత్వ లక్షణాన్ని పొందడం వారికి తెలియకుండానే వచ్చేసేవి. అలాగే పిల్లలు తాము నేర్చుకున్న అంశాలతో నిర్వహించే బాల సభ . పిల్లలు తాము నేర్చుకున్న పాఠాలను వివిధ సబ్జెక్టులకు సంబంధించినవి ప్రదర్శించే వేదిక బాలసభ. అంటే ఇది ఒక విధంగా వారి నైపుణ్యాలు ప్రదర్శించడానికి అవకాశం ఇవ్వడమే. పాఠాన్ని ఒక నాటిక రూపంలో నృత్య రూపంలో కథ రూపంలో, ఒక ప్రయోగ రూపంలో, ఒక పాట రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది. పిల్లలు కరిక్యులర్ ఒత్తిడిని అధిగమించాలంటే వాటి రూపాలు మారాలి.
పైన పేర్కొన్న కృత్యాలలో పిల్లల మధ్య మాటల బంధం ఏర్పడుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి బృందాలతో పని చేయడానికి అవకాశం కలుగుతుంది. ఇది ఉపాధ్యాయులు చేయాల్సిన పని. ప్రతి జట్టు పని పిల్లలు సంఘటితం చేయడానికి, వారి మధ్య సత్సంబంధాలు ఏర్పడడానికి దోహదపడు తుంది. ఇలాంటివి బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా కావాలి. ఉపాధ్యాయుడికి విద్యార్థికి తల్లిదండ్రుల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే పిల్లల్లో బహుముఖ వికాసాన్ని సాధించవచ్చు. నిజానికి వ్యక్తి పరిణతి చెందడానికి స్వేచ్ఛగా ఉండడానికి ప్రేమతో మంచితనంతో వికసించడానికి విద్య సహాయపడాలి. పిల్లలను విద్యావంతులను చేయడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమానంగా బాధ్యత తీసుకోవాలి.
పిల్లల్లో ఎక్కువ తక్కువ నెన్నడం, తెలివిగల వారని, లేని వారిని పోలిక లేకుండా ఉన్నప్పుడే పెద్దలకు పిల్లలకు నడుమ వాత్సల్య పూరితమైన సంబంధాలు నిలిచి ఉంటాయి. వాత్సల్యం ఉన్నప్పుడే అవగాహన సూటిగా స్వచ్ఛంగా ఉంటుంది. పిల్లల పైన ఒత్తిడి గాని వారు దారి తప్పడం గాని ఉండవు. ఇదే ఉపాధ్యాయులకు వర్తిస్తుంది. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడడం ప్రారంభిస్తే ఏ కౌన్సిలర్లు అవసరం ఉండదు. మనం చేయాల్సిందే వారికి ఎటువంటి కష్ట పరిస్థితులైన ఎదుర్కోగలే ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడం. 'మాత శత పితా వైరీ యేన బాలోన పాటితః' పిల్లల్ని సరైన మార్గంలో పెంచని తల్లిదండ్రులు తమ బిడ్డలకు శతృ సమానులు అని ఈ శ్లోక అర్థం. సంస్కారంవంతమైన సమాజ నిర్మాణానికి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అందరిదీ అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచానికి మనం ఇచ్చే బహుమతే పిల్లలు.
- వంగీపురం స్వర్ణలత
9441750630