Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకో గొప్ప అలవాటుంది. ఎవరైనా ధైర్యం గురించి మాట్లాడగానే భగత్‌సింగ్ పుట్టిన నేల ఇది అనీ, అహింస గురించి అనగానే గాంధీ పుట్టిన దేశమని ఎలా అంటుంటామో ధర్మం అనే పదం రావడమే ఆలస్యం బుద్ధుడు, గౌతమ బుద్ధుడు నడయాడిన భూమి ఇదని తన్మయత్వంతో ఊగిపోతాం. వారందరి స్ఫూర్తి ఈ నేలపై ఈ మనుషులపై ఆవహించి ఉందని నూటికి నూటొక్క పాళ్ళు భ్రమిస్తాం. ఆ భ్రమే నిజమని నమ్ముతాం. ఆ నమ్మకాన్ని మించింది జగత్తులో మరొక్కటి లేదని ఎలుగెత్తి చాటుతాం.
బౌద్ధం ప్రేరణతో క్రీస్తుకు పూర్వం 2200 సంవత్సరాల కిందటే విదేశీ విద్యార్థులను ఆకర్షించే 18 విశ్వ విద్యాలయాలు ఇక్కడ ఏర్పడడంతో నాడు విశ్వగురువు అనిపించుకునే అర్హత దక్కించుకుందీ దేశం. దానికి కారణం బుద్ధుడు-బౌద్ధం. అలాంటి మార్గాన్ని కాదనుకుని కథలు, కూర్పులు, కల్పితాలతో సహవాసం చేసి అవే నమ్మకాలుగా అదే దిక్కుగా దిగజారిన మన జ్ఞానం మూఢ నమ్మకాలకు, అతిశయాలకు, ఆడంబరాలకు వేదికగా మారి ఒకవైపు విపరీతమైన వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన, మరో వైపు జుగుప్సాకరరీతిలో వ్యక్తిత్వ హననాలతో సాగిపోతోంది.
తిష్ట వేసుకుని ఉన్న మూఢ నమ్మకాల ప్రభావం నుంచి మనుషుల్ని మేల్కొలిపి ప్రజలకు ప్రజ్ఞ, జ్ఞానం, శీలం, కారుణ్యంతో కూడిన విలువల గురించి బోధించి సమతా వాదం, సమభావం పెంపొందించింది బౌద్ధమే. దేవుడూ, అతీంద్రియ శక్తులు, అదృశ్య మహిమల స్థానంలో మనిషి నడవడికకు, నాగరికతకు, నియమాలకు, సంఘ జీవనానికి ప్రాధాన్యత కల్పించిన బౌద్ధానికి కేంద్రం మానవుడే. అందుకే దాస్య విమోచన గురించి, దుఃఖ నిరోధం గురించి, సమ సమాజాన్ని గురించి బోధించి, మూఢ నమ్మకాలకు తావులేకుండా మనిషిని మానవతా విలువల వైపు నడిపించే బౌద్ధం అన్ని మతాల కంటే ఉన్నతమైనది అన్నాడు కారల్ మార్క్స్.
బుద్ధుడు దైవభక్తికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దానికి బదులుగా నైతిక విలువలకు ఇచ్చాడు. పుణ్యాల గురించి చిట్టి చిట్కాలు చెప్పలేదు. ధర్మం శరణం గచ్ఛామి అని ధర్మం గురించి చెప్పాడు. స్వర్గలోక ప్రాప్తికి సూక్ష్మ మార్గాలు చెప్పలేదు. అయితే సంఘం శరణం గచ్ఛామి అని సంఘం గొప్పదనం గురించి తెలియ పరిచాడు. సంతోషకరమైన జీవనానికి, విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ఏం చేయాలో ఎలా ఉండాలో చెప్పిన మహనీయుడు బుద్ధుడు.
మానవ సంబంధాలు, మనుషుల కష్టాలు, బాధల గురించి చింత లేకుండా సంఘానికి దూరంగా ఉండే వారినే సన్యాసి అని సమాజం భావిస్తుంది. కానీ మనుషుల కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, రోగాలు, చావుల గురించి మదనపడి వారికో పరిష్కారం చూపాలని సమాజ శ్రేయస్సు కోసం, బహుజన హితం కోసం, బహుజన సుఖం కోసం ఇంటినీ, కుటుంబాన్ని వదిలిన బుద్ధుడు తన మార్గం, తన మతం, దేవుడు, ఆత్మలకు సంబంధించినది కాదని, తన మతానికి కేంద్ర వస్తువు మనిషి అని, మనిషికీ మనిషికీ మధ్య తమ తమ జీవితాల్లో ఈ భూమి మీద పెనవేసుకున్న బంధం అని, దుఃఖాలు, కష్టాలు పేదరికం తో సతమతమవుతూ జీవిస్తున్న వారికి పరిష్కారం కోసం తెలిపిన అష్టాంగ మార్గం గురించి తెలుసుకుందాం.
1.సమ్యక్ దృష్టి : సరైన దృష్టి అంటే కేవలం కంటితో కంటికి కనబడేది మాత్రమే చూడటం కాదు. మనస్సుతోనూ చూడమన్న బౌద్ధం మనస్సుకు ఎంతో ప్రాముఖ్యత కలిగించి దానిని జ్ఞానేంద్రియంగా పరిగణించింది. మనస్సుతో చూడటం ద్వారానే సమ దృష్టి, తద్వారా సమానత్వం సంఘంలో ఏర్పడుతుందని తెలిపింది.
2.సరైన సంకల్పం: ఏ కార్యమైనా పూర్తి చేయటానికి సంకల్పమే ముఖ్యం. దానినే సంకల్ప బలం అని కూడా అంటుంటాం. అయితే ఆ సంకల్పం ధర్మబద్ధమైన పనులను మాత్రమే ఉపయోగించు కోవాలి. మరొకరికి కష్టం కలిగించే పనులపై మన సంకల్పం ఉండకూడదు.
3.సరైన వాక్కు : నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అనే నానుడి మనందరికీ తెలిసిందే. ప్రాణుల్లో మాట్లాడగలిగే ప్రత్యేకత కేవలం మనుషులకే ఉంది. పరుషంగా మాట్లాడడం, పొగడ్తలు కురిపించడం, అసత్యాలు, అర్థ సత్యాలు కాకుండా కేవలం సత్యాన్ని మాత్రమే చెప్పమంటుంది బౌద్ధం.
4.సరైన పని : మనం ఎంచుకున్న పని ధర్మబద్ధమై ఉండాలి. మనం చేస్తున్న పని వల్ల ఇతరులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టపోరాదు. దొంగతనం, అక్రమ వ్యాపారాలు, అనైతిక కార్యక్రమాలు వంటి వాటికి దూరంగా ఉండి ధర్మబద్ధమైన పనులు మాత్రమే చేయాలి.
5.సమైక్య జీవనం : జీవితంలో జరిగే సంఘటనలు యాదృచ్ఛికం కావచ్చు. కానీ జీవితం యాదృచ్ఛికం కాదు. జీవనంలో జీవం ఉండాలి. మన జీవనం గురించి, మన మనుగడ గురించి మరొకరికి నష్టం కలిగించకూడదు. జీవితాన్ని గడపడానికి సమకూరే ఆదాయం కూడా ధర్మబద్ధమై ఉండాలి.
6.సరైన వ్యాయామం : వ్యాయామం అంటే కేవలం శరీరానికే కాదు, శరీరంతో చేసే వ్యాయామం, శారీరక ఆరోగ్యం గురించి అయితే నిరంతరం మనలో వచ్చిపోతున్న అనేకానేక ఆలోచనలు, మనలో పుట్టే కోరికలను నిగ్రహించి, వాటిని సక్రమ మార్గంలోకి మళ్ళించడం ద్వారానే మానసిక ఆరోగ్యం పొందగలుగుతాము.
7.సమ్యక్ స్థితి - సరైన ఎరుక : మనం చేస్తున్న పని గురించి తెలుసుకుని పూర్తి ఏకాగ్రత కలిగి ఉండాలి. ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం పైనే ధ్యాస కలిగి ఉండడం, వాహనం నడుపుతున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలపైనే ఎరుక కలిగి ఉండటమే సరైన ఎరుక.
8.సమ్యక్ సమాధి : అలలు అలలుగా, ప్రకంపనలుగా నిరంతరం సంచరిస్తునే ఉన్న మనోవృత్తులన్నీ బంధించి, మనస్సును స్థిరంగా ఉంచగలగడమే ఈ సమ్యక్ సమాధి.
మనుషులకు జరుగుతున్న అన్యాయాలకు కారణం సాటి మనుషులే. మనుషులు తమ మనస్సును, ప్రవర్తన లను, ఆలోచనా విధానాలను మార్చుకోకుండా, సంఘంపై వారి బాధ్యతలు గుర్తెరగకుండా, మనుషుల మధ్య అవసరాలతో సంబంధంలేని ఆప్యాయతలు లేకుండా ఏదో ఊహించుకుని ఏవేవో ఆశించి చేసే పూజలు, ప్రార్థన లతో మనిషి జీవితం ఆనందమయం అవుతుందని ఆశించడం అమాయకత్వం. అందుకే తన బోధనల్లో నైతిక విలువలకూ, ధర్మ బద్ధమైన జీవనానికి ప్రాధాన్యతనిచ్చిన బౌద్ధం 2500 సంవత్సరాలు దాటినా నేటి సమాజానికి, నేటి కాలానికీ అన్వయించుకునేలానే కాదు, మరో 2500 సంవత్సరాలు దాటినా ఉన్నతంగానే ఉంటుంది.
(మే 5 బుద్ధ జయంతి)
- నరసింహ ప్రసాద్ గొర్రెపాటి
సెల్:9440734501