Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆడపిల్లగా జన్మించిన నాటి నుండి ఆఖరి శ్వాస దాకా మహిళగా అవతలి వాళ్ళ గురించి పరితపిస్తూ, ఈ మానవ జన్మకు ప్రాణదాతగా సమగ్ర మహౌన్నత వ్యక్తిత్వాన్ని చాటుతుంది. అంతటి త్యాగశీలి, సహనశీలి అయిన మహిళా వికాసానికి, సమానత్వానికి తరతరాలుగా వేళ్లూనుకున్న పురుషాధిక్య భావజాలం అడుగడుగునా విఘాతం కలిగిస్తూనే ఉంది. అంతటా (ఇంటా బయట) వివక్ష, అకృత్యాలు, దాడులు, హింస పెచ్చరిల్లుతున్నాయి. ప్రభుత్వాలు మహిళా రక్షణ, సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు, పథకాలు అమలు చేసినా మహిళా సమానత్వం కనుచూపుమేరలో కనిపించడం లేదు. ఇటీవల ప్రపంచ ఆర్థిక ఫోరం ''జెండర్ గ్యాప్'' నివేదికలో మన దేశం135వ స్థానంలో ఉంది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారి నినదించిన ''సావిత్రిబాయి ఫూలే'' నాటి స్థితిగతుల నుండి మహిళా విముక్తి కాదు కదా! ఇంకా నేటికీ సమానత్వ భావనలు కొల్లబోతున్న సంఘటనలనే చూస్తున్నాం. నిజానికి ఇన్నేళ్లు గడిచినప్పటికీ రాచరిక పాలన అంతరించి ప్రజాపాలనలోకి ప్రవేశించినా సమానత్వం కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఆశించినంతగా మెరుగు పడలేదనేది వాస్తవం. ఏదో సంవత్సరానికోసారీ మహిళా దినోత్సవంనాడు ''మహిళకు దండేసి-శాలువా కప్పి సత్కరిస్తే'' సమానత్వం వచ్చినట్లు కాదు. సమానత్వ సంకల్పం గురించి చెప్పుకుంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు, ఓటు బ్యాంకు పథకాల వల్ల మహిళా సమానత్వం సాధించలేమనడానికి గత కాలపు అనుభవాలే నిదర్శనం. ఏం చేస్తే మహిళా సమానత్వం సాధించవచ్చో వాటిని తు.చ. తప్పక చిత్తశుద్ధితో పాలకులు, సమాజం సంకల్పదీక్షతో అమలు చేయడం కనీస బాధ్యత అనేది మరువరాదు. ఎందుకంటే? సమాన అవకాశాలు పొందడం మహిళల హక్కు. సంపద సృష్టిలో, సేవలో, నాయకత్వంలో ప్రతి చోట కీలక పాత్ర పోషిస్తున్న వారికి పురుషులతో సమానంగా హక్కులు, అవకాశాలు కల్పిస్తే, ప్రపంచం (మనదేశం)లో అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సమాజంలో అన్ని రకాల హింస తగ్గుతుంది. శాంతి సామరస్యాలు ఏర్పడతాయి. ప్రపంచమంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. సహజంగానే మహిళలు తమ గురించి మాత్రమే కాకుండా సమాజంలోని అందరి బాగోగుల గురించి ఆలోచిస్తారు, పరితపిస్తారు. అంతే కాదు నీతి నిజాయితీలతో కూడిన ప్రవర్తన కలిగి ఉంటారు. ఇలాంటి ''మహిళల ప్రతిభా శక్తిని'' ఇంటి పట్టునే ఉంచేలా చేస్తే ఈ ప్రపంచానికి అభివృద్ధి ఉండదు. మహిళా హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్న దేశాలు. ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్, న్యూజిలాండ్, స్వీడన్, రువాండా దేశాలు సహజంగానే మహిళా సమానత్వంలో ప్రపంచంలోనే అగ్రస్థానాన నిలుస్తున్నాయి. స్త్రీ, పురుష సమానత్వ సాధనలో ఆయా దేశాల ప్రస్థానం, పథక రచన విధానాల నుంచి మన దేశం నేర్వాల్సిన గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. వీటి నుండి చైతన్యం పొందాల్సిన వారు పాలకులు, పౌర సమాజం. ఆ దేశంలో సమానత్వాన్ని రాత్రికి రాత్రే సాధించలేదు. హక్కుల కోసం మహిళలంతా కలిసి ఉమ్మడిగా పోరాడి సాధించుకున్నారు. ఎవరో వస్తారని చూడకుండా వాళ్లకేం కావాలో దానిని నేడు సంప్రదాయంగా మార్చేశారు.
నేడు మన దేశంలో మహిళలు ఆకాశంలో సగం మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్లు ఆకాశానికి ఎదగాలి, ఎదగ నివ్వాలి. సమాన హక్కులు, అవకాశాలన్నీ పోరాడి సాధించుకోవాలి. మహిళా స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. మహిళకు అన్ని రంగాల్లో ఆర్థిక, రాజకీయ, వ్యాపార, క్రీడ, ఉద్యోగ, ఉపాధి, సైన్యం, విద్య, వైద్యం తదితర రంగాల్లో సముచిత స్థానం, సమాన అవకాశాలు కల్పిస్తేనే సంపూర్ణ అభివృద్ధి సుసాధ్యమవుతుందని గమనించాలి. భారత రాజ్యాంగం మహిళలకు దన్నుగా నిలిచినా, పాలకులు అమలులో వివక్ష చూపుతున్నారు. చట్టసభల్లో చోటు కల్పించడానికి ఉద్దేశించిన మహిళా బిల్లును 1996లో అంటే 26ఏండ్లు గడిచినా ఆ బిల్లుకు గ్రహణం వీడలేదు. 15వ లోకసభ సమావేశాల ముగింపులో ఈ బిల్లు పురుషాధిక్యత ప్రభావానికిలోనై వీగిపోయింది. ఇందులో అన్ని పార్టీల భాగస్వామ్యం 'తలా పాపం తిలా పిడికెడు' అన్నట్లుగా ఉంది. మన దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో మహిళా బిల్లుకు కట్టుబడి ఉన్నామని చెప్పే మాటలు ఇన్నేళ్లుగా గాలి మాటలే అవుతున్నాయనేది నిజం కాదా..! ఇది వివక్ష కాదా! ఇంకెన్నేళ్ళు.. మరి ప్రశ్నించాలి కదా? మహిళా లోకం. దేశంలో ఏ మూలన చూసినా ఏ పత్రిక తిరిగేసినా ఏ టీవీ ఛానల్ విన్నా, చూసినా, ఏదో రూపంలో మహిళా వివక్ష కొనసాగుతూనే ఉంది. మహిళా స్వేచ్ఛను హరిస్తూనే ఉన్నారు. ర్యాగింగ్, ఆసిడ్ దాడులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలపై లైంగిక దాడులు, ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి. మహిళలు సహనాన్ని వీడాలి. ఎన్ని చట్టాలు, ఎన్ని పథకాలు వచ్చినా పోరాటం చేయడం ఒక్కటే హక్కుల సాధనకు సరైన మార్గం అని భావించాలి. ఛాందస కట్టుబాట్లు దాటాలి. కార్య సాధన కోసం కదం తొక్కాలి.
- మేకిరి దామోదర్
9573666650