Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉన్నత చదువులు చదివి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థానంలో నిలవాలనుకున్నారు. పల్లె ప్రజలకు సేవలు అందించడంతో పాటు పల్లెప్రగతికి పాటుపడాలనే ఆశయంతో గ్రామ కార్యదర్శి పదవిలో చేరారు. కానీ ఒక పక్క పనిభారం పెరగడం, మరోపక్క క్రమబద్ధీకరణపై ప్రభుత్వం కరుణ చూపకపోవడంతో ఉద్యోగ భద్రతలేక జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌తో కొలువులోకి తీసుకున్న ప్రభుత్వం నాలుగేళ్లు గడుస్తున్న రెగ్యులరైజ్ చేయడంలేదు. నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న జీపీల్లో ఖాళీల కొరత ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం 2018లో 9355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2018 ఆగస్టులో నోటిఫికేషన్ వెలువరించింది. మూడేండ్ల ప్రొబిషనరీ సమయంలో రూ.15 వేల గౌరవ వేతనం, తెలంగాణ పంచాయతీ రాజ్‌చట్టం - 2018 ఆధారంగా పనితీరు అంచనా వేయడం వంటి షరతులతో ఈ నియమకాలు చేపట్టింది. 2018 అక్టోబర్ 10న పరీక్ష జరిపి ఎంపికైన వారిని ఏప్రిల్ 11, 2019 నుండి గ్రామ కార్యదర్శులుగా నియమించింది. 2022 ఏప్రిల్ 12 నాటికి మూడేళ్ల ప్రొఫెషనరీ పూర్తయిన కార్యదర్శుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం చొరవ చూపలేదు. తెలంగాణ రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్ మెంట్ యాక్ట్‌కు విరుద్ధంగా ఉత్తర్వు నెంబర్ 26 ద్వారా ప్రొబేషనరీ పిరియడ్‌ను మరో ఏడాది పెంచింది. నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం మూడేళ్ల తర్వాత గ్రేడ్-4 ఉద్యోగులగా గుర్తించి రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం మాటిచ్చిన ఉద్యోగ భద్రత మాత్రం కల్పించలేకపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 12తో గ్రామ కార్యదర్శుల పదవీకాలం నాలుగేళ్లు పూర్తి అవుతుంది. జీవో నెంబర్ 26 రద్దు కోసం ఇప్పటికే గ్రామ కార్యదర్శులు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయం కావడంతో సెర్ప్ ఉద్యోగులు క్రమబద్ధీకరించడంతో గ్రామ కార్యదర్శులు కూడా ప్రభుత్వ నిర్ణయం కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. కష్టపడి చదువుల్లో రాణించి నేరుగా కొలువులను సంపాదించినా ఉద్యోగ నిర్వహణలో మితిమీరిన ఒత్తిడులు పెరగడంతో గ్రామ కార్యదర్శులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో రికార్డులు బడ్జెట్ నిర్వహణ, జనన మరణ పత్రాల జారి, ఆస్తిపన్ను వసూలు, వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక సదుపాయాలు, స్వచ్ఛ భారత్ మిషన్, హరితహారం, ఆస్తుల ఆన్లైన్ ప్రక్రియ మొదలైన 50రకాల విధులను నిర్వహిస్తున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటలపాటు వెట్టి చాకిరి చేస్తున్నారు. వీటికి తోడు వీరి హయంలోనే డంపింగ్ యార్డులు వైకుంఠధామాలు పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న అవార్డుల్లో మెజార్టీ అవార్డులు రాష్ట్ర పంచాయతీలనే వరిస్తున్నాయి. రాష్ట్రంలో నాలుగు విడుతలుగా చేపట్టిన పల్లె ప్రగతిని విజయవంతం చేయడంలో గ్రామ కార్యదర్శులు కీలక పాత్ర పోషించారు. ఇంత చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామ కార్యదర్శుల క్రమబద్దీకరణ పై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. స్థానిక రాజకీయాలలో నోటీసులు వేధింపులు భరించలేక ఇప్పటికే రాష్ట్రంలో దాదాపుగా 1500 మంది ఉద్యోగాలు వదిలేశారు. గుండెపోటు ఇతర ఆనారోగ్య సమ స్యలతో 40మంది వరకు గ్రామ కార్యదర్శులు మతిచెందారు. గత పీఆర్సీలో భాగంగా 30శాతం జీతాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తమపై కరుణ చూపించి రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కోరుతున్నారు.
- అంకం నరేష్
6301650324