Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (డిగ్రీ అధ్యాపకుల) పోస్టుల భర్తీకి సంబంధించి నేడు ప్రధానంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాటు ఎన్ఈటీ (నెట్ - నేషనల్ ఎలిజిబిటీ టెస్ట్) లేదా ఎస్ఈటీ (సెట్-స్టేట్ ఎలిజిబిటీ టెస్ట్) లేదా పీహెచ్డీ (డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ)లను ప్రధాన విద్యా అర్హతలుగా పరిగణిస్తున్నారు. గతంలో నెట్, సెట్, పీహెచ్డీ విద్యార్హతలు కలిగి ఉండకున్ననూ సంబంధిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్) విద్యార్హతలు కలిగి ఉన్న వారికి కూడా డిగ్రీ అధ్యాపకుల పరీక్షను రాయడానికి వెసులుబాటుని కల్పించారు. ఈ రకంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఫిల్ అర్హతతో అర్హులైన అభ్యర్థులు డిగ్రీ లెక్చరర్లు పరీక్షకి హాజరయ్యారు. కాని నేడు తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్ల పరీక్షకి సబంధించి అర్హతల్లో ఎం.ఫిల్ ప్రస్తావన లేకపోవడం కడు విచారకరం. ఫలితంగా అనేక మంది ఎం.ఫిల్ అర్హులు తమను 'డిగ్రీ లెక్చరర్ల పరీక్షకు అనుమతించాలి'' అనే న్యాయబద్ధమైన డిమాండ్ కోసం అభ్యర్థించడం గమనార్హం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2009 మార్గదర్శకాలను అనుసరించి 2009, జూలై 11 నాటికి ఎం.ఫిల్ కోర్సులో కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియని పూర్తిచేసుకున్న వారికి కూడా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో భోదించడానికి నెట్, సెట్, అసెట్ అర్హతల నుండి మినహాయింపు ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి భిన్న సందర్భాలలో అనేక సర్క్యూలర్స్ వివరణాత్మకంగా వెలువడ్డాయి. కాని తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జారీ చేసిన గురుకుల డిగ్రీ అధ్యాపకుల వివరణాత్మక ప్రకటనల్లోనూ ముఖ్యంగా విద్యార్హతల విషయంలో ఎం.ఫిల్ విద్యార్హాతని మినహాయించడం వలన నిర్దేశిత కాలం లో ఎంఫిల్లో నమోదైన లేదా అంతకుముందే ఎంఫిల్ కోర్సుని పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతున్నారు. ఈ రకంగా డిగ్రీ అధ్యా పకుల భర్తీలో ఎంఫిల్ డిగ్రీని విస్మరించడం ఏమాత్రం సహేతుకం కాదు.
నిజానికి పీహెచ్డీ ప్రవేశాలలో నెట్, సెట్లతో పాటు ఎంఫిల్ అర్హతకి సమ ప్రాధాన్యం ఉంది. పీహెచ్డీ ప్రవేశాల ఇంటర్వ్యూలో ఎంఫిల్ అభ్యర్థులకు సైతం మినహాయింపుని ఇవ్వడం గమనార్హం. నిజానికి నెట్, అసెట్లు కొద్దిపాటి శ్రమతో క్వాలిఫై కావడం చాలా సులువు. వీటిలో కేవలం క్వాలిఫై అయితే డిగ్రీ లెక్చరర్లు, విశ్వవిద్యాలయాల స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత లభిస్తుంది. కాని ఎంఫిల్ పరిశోధకులు పరిశోధన చేసి పీహెచ్డీ మాదిరిగానే డిజర్టేషన్ని రూపొందిస్తారు. ఈ డిజర్టేషన్ని రూపొందించ డానికి ఎంఫిల్ పరిశోధకులు అనేక వ్యయ ప్రయాసలని అధిగమించి అనేక కొత్త విషయాలని వెలుగులోకి తీసుకొనిరావడంలో పీహెచ్డీ పరిశోధనలకు ఏమాత్రం తీసిపోరు. అయిననూ వారికి డిగ్రీ లెక్చరర్ల పరీక్షకు కూడా అనుమతించక పోవడం కడు విచారకరం. ఈ రకంగా డిగ్రీ లెక్చరర్లు పరీక్షకి పరిశోధన లో పీహెచ్డీ వారిని మాత్రమే అర్హులుగా చేసి ఎంఫిల్ వారిపై వేటు వేయడం ఏమాత్రం సముచితం కాదు.
డిగ్రీ లెక్చరర్ల భర్తీ ప్రక్రియలో సుదీర్ఘ ప్రక్రియతో ఎం.ఫిల్ కోర్సుని పూర్తి చేసిన వారిని విస్మరించడం వలన 2009 అంతకుముందు కాలంలో ఎంఫిల్ అర్హతని కలిగి ఉన్న పరిశోధకులు దాదాపు పుష్కరకాలం నాటికి అందివచ్చిన డిగ్రీ అధ్యాపకుల ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదంలోకి నెట్టివేయబడ్డారు. ఈ రకంగా ఎంతో శ్రమించి పూర్తి చేసిన ఎంఫిల్ విద్యార్థతకి విలువ లేకుండా చేయడమే కాకుండా నిర్లక్ష్యానికి గురిచేయడం ఏమాత్రం సమంజసం కాదు. అందువలన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2009 మార్గదర్శకాలను అనుసరించి నిర్దేశిత కాలం నాటి ఎంఫిల్ అభ్యర్థులకు డిగ్రీ లెక్చరర్స్ (డిఎల్) పరీక్షకు అనుమతించే దిశగా సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నూతన విద్యావిధానం అమలులోకి రాని పూర్వకాలం వరకు ఎంఫిల్ కోర్సుని పూర్తి చేసిన పరిశోధకులను కూడా డిగ్రీ లెక్చరర్లు ఉద్యోగ పరీక్షకి అనుమతించాల్సిన అవసరం ఉంది.
- జెజెసిపి బాబూరావు
9493319690