Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 లక్షలు దాటిన కేసులు
జొహానెస్బర్గ్: ఆఫ్రికా ఖండం లోనూ కరోనా తీవ్రరూపం దాల్చు తోంది. ఇప్పటికే అక్కడ కరోనా వైరస్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటినట్లు గణాంక సంస్థలు పేర్కొన్నాయి. ఆఫ్రికా ఖండంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని, తీవ్ర దశకు చేరుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. గురువారం నాటికి ఆఫ్రికాలో కేసుల సంఖ్య 10,03,056 నిర్ధారణ అవగా, 21,983 మంది మృతి చెందారు. అయితే కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. మొత్తం బాధితుల్లో 6,76,395 మంది చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. దక్షిణాఫ్రికాలో కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. మార్చి5న ఇక్కడ తొలి కరోనా కేసు నమోదవగా, ఖండం మొత్తంలో నమోదైన కేసుల్లో సగానికిపైగా అంటే 5,38,184 కేసులు ఒక్క దక్షిణాఫ్రికాలోనే నిర్ధారణ అయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది.
ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాల్లో టెస్టింగ్ రేటు తక్కువగా ఉందని, దీని వలన నిర్దారణ అయిన కేసుల సంఖ్య కంటే వాస్తవంగా ఉండే కేసులు ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం మే నుంచి జులై మధ్య వరకు సాధారణం కంటే 17 వేల మరణాలు అధికంగా ఉండొచ్చని పేర్కొంది. అధికారిక గణాంకాలు చెప్పే దానికంటే అధికంగా ఈ మృతుల సంఖ్య ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.