Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దశాబ్దిలో రికార్డుస్థాయికి ఉద్యోగిత రేటు పతనం
- లాక్డౌన్తో ఉద్యోగాలు కోల్పోయిన 2.2 లక్షల మంది
లండన్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అన్నివిధాలుగా వణికిస్తోంది. నిరుద్యోగం తీవ్రస్థాయిలో పెచ్చరిల్లిపోతోంది. బ్రిటన్లో దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఉద్యోగిత రేటు భారీగా పడిపోయింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ ఆంక్షల తర్వాతి మూడు నెలల కాలంలో 2.2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు అధికారిక గణాంకాలు మంగళవారం వెల్లడించాయి. జులైలో 81 వేల మంది పేరోల్ నుంచి తొలగించినట్లు ఆ దేశ గణాంక సంస్థ పేర్కొంది. దేశంలో కరోనా ప్రభావం ప్రారంభమైన మార్చి నుంచి చూసుకుంటే పేరోల్ నుంచి తొలగించిన వారి సంఖ్య 7.3 లక్షలుగా ఉంది. ఈ త్రైమాసిక కాలంలో ఉద్యోగిత రేటు తగ్గుదలతో దేశంలోని ఉద్యోగుల సంఖ్య 3.29 కోట్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంభవించిన 2009 నాటి నుంచి చూసుకుంటే ఇంత భారీ స్థాయిలో ఉద్యోగిత పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఉపాధి తగ్గడంతో పాటు పనిగంటలు కూడా గణనీయంగా తగ్గాయి. తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలతో పాటు చిన్న వయసున్న కార్మికుల్లో ఉపాధి పడిపోయింది. దీంతో ప్రజలు కొత్త ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికా కనిపించిన విధంగా భారీస్థాయి నిరుద్యోగం నుంచి తప్పించుకునేందుకు బ్రిటన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా వైరస్ జాబ్ రిటెన్షన్ పథకాన్ని తీసుకువచ్చింది. ఉద్యోగాల నుంచి తీసివేయని కార్మికులకు చాలా వరకు సడలింపులతో వేతనాన్ని చెల్లించింది. 4,400 కోట్ల డాలర్లను 96 లక్షల మంది కార్మికులు, ఉద్యోగస్తులకు సద్వినియోగం చేసేందుకు యాజమాన్యాలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీంతో వీరందరికీ గత కొన్ని నెలలుగా పనిలేకున్నా నిరుద్యోగులుగా లెక్కించలేదు.