Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిచిగన్ యూనివర్సిటీ క్షమాపణ
మిచిగన్ : శ్వేత జాతీయుల, నల్ల జాతీయుల విద్యార్ధులకు విడివిడిగా ఆన్లైన్ స్టూడెంట్ కేఫ్లను ఏర్పాటు చేసినందుకు బుధవారం మిచిగన్ యూనివర్శిటీ క్షమాపణ చెప్పింది. జాతి, వైవిధ్యత గురించి చర్చలను పెంపొందించేందుకు ఈ సైట్లు ఉద్దేశించబడ్డాయని తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడు రెండు కేఫ్ ఈవెంట్లు జరిగిన అనంతరం యూనివర్శిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఒకటి శ్వేత జాతీయుల కోసం ఏర్పాటు చేసిన నాన్ పీఓసీ కేఫ్ రెండోది బయోపిక్ కేఫ్, నల్ల జాతీయుల కోసం ఏర్పాటు చేసినది. యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్ధులుగా తమ అనుభవాలు, ప్రపంచంలో శ్వేత జాతీయులుగా, నల్లజాతీయులుగా తమ అనుభవాలను పంచుకుని చర్చించేందుకు ఈ ఆన్లైన్ ఈవెంట్లను ఏర్పాటు చేశారు. దీనిపై అమెరికన్ అరబ్ వివక్ష వ్యతిరేక కమిటీ లీగల్, పాలసీ డైరెక్టర్ అబెద్ అయూబ్ మాట్లాడుతూ, యూనివర్సిటీ ఉద్దేశాన్ని అర్ధం చేసుకున్నాననీ, కానీ మరికొంత మెరుగ్గా చేసి వుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. వర్ణ వివక్షను ఎదుర్కొనే విద్యార్ధులు సురక్షితంగా తమ అనుభవాలను పంచుకునేందుకు ఇటువంటి వేదికలు ఏర్పాటవుతాయని అన్నారు. ఈ చర్చల్లో శ్వేత జాతీయుల విద్యార్ధులు కూడా పాల్గొని వారి అనుభవాలను తెలుసుకోవడం ముఖ్యమని అన్నారు. కానీ ఇప్పుడు విడివిడిగా ఏర్పాటు చేయడం వల్ల ఆ అవకాశాన్ని ఉద్దేశపూర్వకంగానే లేకుండా చేసినట్టు కనిపిస్తోందని అన్నారు. ఆ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి అయిన అయూబ్ 'పొరపాటు జరిగిందని తెలుసు, కానీ దాన్ని దాటి వారు ముందుకెళ్ళాలి' అని వ్యాఖ్యానించారు. ఆన్లైన్ సమావేశాలను కేఫ్లుగా ప్రస్తావించడం పట్ల మిచిగన్ యూనివర్సిటీ క్షమాపణ చెబుతూ ప్రత్యేకంగా నిర్దిష్ట జాతులకు చెందిన వారి కోసమే ఏర్పాటు చేసినవి కావని చెప్పింది.