Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్ యత్నాలకు ఎదురుదెబ్బ
బీరుట్ : లెబనాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో కొత్త ప్రధానిగా నియుక్తులైన ముస్తఫా అడిబ్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ఆ పదవి నుంచి తప్పుకున్నారు. లెబనాన్ రాజకీయాలను శాసించాలని చూస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమానియెల్ మాక్రాన్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బ. నెల రోజుల క్రితం ప్రధానిగా నియుక్తులైన ఇడిబ్కు మంత్రివర్గ కూర్పులో భాగస్వామ్య పక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయన తన పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. బీరుట్ ఓడరేవులో ఆగస్టు 4న జరిగిన పేలుడుతో తలెత్తిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించాలంటే సత్వరమే సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం వుందని అటువంటి వాటిపై స్వతంత్రంగా పనిచేయగల ప్రత్యేక నిపుణులతో క్యబినెట్ ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఒక వైపు, ఆర్థిక మంత్రి తమకే దక్కాలని ప్రధాన షియా గ్రూపులైన హెజ్బుల్లా, అమల్ డిమాండ్ మరోవైపు ఒత్తిడి తెస్తుండడంతో అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది అడిబ్ పరిస్థితి.
ఆర్థిక శాఖ మాజీ మంత్రితో సహా హెజ్బుల్లాకు సన్నిహితులైన ఇద్దరు సీనియర్ రాజకీయ నేతలపై అమెరికా ఆంక్షలు విధించడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో శనివారం అధ్యక్షుడు మైఖేల్ అయాన్‌తో సమావేశమైన అనంతరం అడిబ్ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.