Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రంగా నిరసించిన క్యూబా
హవానా : క్యూబాపై అమెరికా అమలు చేస్తున్న ఆంక్షలు మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని విదేశాంగ మంత్రి బ్రూనో రొడ్రిగజ్ గురువారం తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. క్యూబాపై అమెరికా అనుసరిస్తున్న ఘర్షణాయుత విధానాలు, గత ఏడాది కాలంగా ప్రపంచ దేశాల పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఆయన ఇక్కడ ఒక పత్రికా సమావేశంలో నిరసించారు. వాణిజ్య, నౌకల రాకపోకలకు సంబంధించిన విధి విధానాలను అమెరికా ఉల్లంఘిస్తోందనీ, వాటిని సమర్ధించుకునేందుకు ఎలాంటి నైతికత కూడా లేదని అన్నారు. క్యూబన్లకు మరింతగా ఇబ్బందులు పెంచేందుకు అమెరికా ప్రభుత్వం తన క్రూరత్వాన్ని ఇంకా పెంచిందని విమర్శించారు. దీనివల్ల క్యూబాలో సామాజిక ఆర్థిక నమూనాను ఆధునీకరించే క్రమం దెబ్బతింటోందని అన్నారు. క్యూబాపై అదనంగా విధించే షరతులు, విధానాలు, చర్యలు లేకుండా అమెరికాకు ఒక్క వారం కూడా గడవదని ఆయన వ్యాఖ్యనించారు. తృతీయ ప్రపంచ దేశాల సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా, ఇతర దేశాల్లని కంపెనీలు, పౌరులకు వ్యతిరేకంగా ఈ ఆంక్షలను అమలు చేస్తుందని అన్నారు. వచ్చేఏడాది మేలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో క్యూబా ఈ ఆంక్షల తాలుకూ నష్టాలు, ఇబ్బందులను తెలియచేసే నివేదికను ప్రవేశపెడుతుందని, అప్పుడు మొత్తంగా అంతర్జాతీయ సమాజం అమెరికా వైఖరిని ఖండిస్తుందని ఆయన చెప్పారు. ఈ ఆంక్షల వల్ల గతేడాది క్యూబా 500కోట్ల డాలర్లుకు పైగా నష్టాలను అనుభవించిందని, కరోనా సమయంలో మరింతగా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.