Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూరప్ మళ్లీ గజ గజ
- స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి
వాషింగ్టన్/ బ్రసెల్స్: కరోనా మహమ్మారి మరో సారి అమెరికా, యూరప్లపై పంజా విసిరింది. అమెరికాలో శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 79,852 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఊహించినట్టే యూరప్‌కు శీతాకాలం భయంకరంగా పరిణమించింది. ఐరోపా ఖండంలోని పలు దేశాలు రెండోసారి కరోనా మహమ్మారి బారిన పడి విలవిలలాడుతున్నాయి. కరోనా వైరస్ సోకి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గత రెండు నెలల గరిష్టానికి చేరుకుందని, అలాగే మరణాల సంఖ్య కూడా పెరుగుతోందని రాయిటర్స్ మీడియా సంస్థ పేర్కొంది. స్పెయిన్‌లో అత్యయిక పరిస్థితిని ప్రకటించారు. పోలండ్ అధ్యక్షుడు ఆండ్రీజ్ దుడాకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ యింది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అమెరికాలో ప్రధానంగా ఓహియో, మిచిగాన్, ఉత్తర కాలిపోర్నియా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ప్రాంతాల్లో కొత్త కేసుల సంఖ్య అధికంగా ఉంది. జాన్హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల 25 వేల మంది వరకూ మరణించారు. వైరస్ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో ప్రజలు రెండు వారాల పాటు ఇళ్లకే పరిమితం కావాలని టెక్సాస్ రాష్ట్రంలోని ఎల్పాసో నగర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పార్కులు, ఇతర వినోద సౌకర్య ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధించారు. కరోనాతో పరిస్థితి మరింత దిగజారకముందే మేలుకోవాలని ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌసి అమెరికన్లను కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం ద్వారా కరోనా మరింత విస్తరించకుండా నియంత్రించవచ్చని ఆయన సూచించారు.
యూరప్ అంతటా తీవ్రమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆదివారం నుండి కేనరీ దీవులు మినహా దేశమంతటా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు స్పెయిన్ ప్రధాని ప్రకటించారు. 10లక్షలకు పైగా కేసులు దాటిన తొలి ఇయు దేశమైన స్పెయిన్‌లో ప్రస్తుతం పరిస్థితి బాలేదని చెప్పారు. ఆంక్షలు పెంచడం పట్ల స్పెయిన్‌లో కొన్ని చోట్ల తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇటలీ కూడా రోజువారీ జీవన విధానానికి సంబంధించి పలు నియంత్రణా చర్యలు చేపట్టింది. మరోవైపు వరుసగా మూడో రోజూ ప్రపంచవ్యాప్తంగా కొత్తగా కరోనా కేసులు రికార్డుస్థాయిలో పెరిగాయని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. శనివారం ఒక్క రోజే మొత్తంగా 4,65,319 కేసులు నమోదయ్యాయని డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. వాటిలో సగానికి పైగా యూరప్ దేశాల్లోనే నమోదు కావడం గమనార్హం.