Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంటువ్యాధులపై అనుభవంలేని వ్యక్తి నియామకంపై సర్వత్రా వ్యతిరేకత
- అమెరికాలో కరోనా తీవ్రతకు ఆయనే కారణం..వైద్యనిపుణులు
న్యూయార్క్: కరోనా వైరస్‌పై అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా ఉన్న డాక్టర్ స్కాట్ అట్లాస్ రాజీనామా చేశారు. అమెరికాలో వైరస్ నియంత్రణకు ఆయన తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అమెరికాలో కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తున్న సమయంలో అధ్యక్షుడికి సలహాదారుగా ఆయన నియమితులయ్యారు. ప్రజారోగ్యం, అంటువ్యాధులపై ఎలాంటి అనుభవం లేని వ్యక్తి నియామకం, నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా, మాస్కులు ధరించడాన్ని ప్రశ్నించిన ఆయన.. కరోనా కట్టడికి తగు నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యారనే వాదనలున్నాయి. కేవలం హెర్డ్ ఇమ్యూనిటీని ప్రోత్సహించిన స్కాట్ అట్లాస్, లాక్డౌన్ వంటి చర్యలను వ్యతిరేకించారు. అమెరికా అధ్యక్షుడికి తప్పుదోవ పట్టించే విధంగా డాక్టర్ స్కాట్ అట్లాస్ సూచనలు చేస్తున్నారనీ అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీతో పాటు సీడీసీ కూడా ఆరోపించింది.
ఒకనొక సమయంలో మాస్కుల ప్రాముఖ్యతను తగ్గిస్తూ ఆయన చేసిన ట్వీట్లు కూడా కలకలంరేపాయి. ఆయన చేసిన ట్వీట్ ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ట్విటర్ సైతం వాటిని తొలగించిన విషయం విదితమే. వైట్‌హౌస్‌లోనూ వైరస్ తీవత్ర పెరగడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమనే అభిప్రాయం అక్కడి అధికారుల్లోనూ చర్చనడిచింది. ఇలాంటి నేపథ్యంలో అధ్యక్షుడికి కరోనా విభాగ సలహాదారుగా తాను రాజీనామా చేస్తున్నట్టు స్కాట్ అట్లాస్ ప్రకటించారు. కాగా అమెరికాలో ఇప్పటివరకు కోటి 35లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో 2లక్షల 68వేల మంది ప్రాణాలు కోల్పోయారు.