Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడికీ వెళ్లని 20 ఏండ్ల కుర్రాడిలో గుర్తింపు
- క్రిస్మస్, న్యూఇయర్ సెలవుల తర్వాత కేసులు మరింతపైకి..
వాషింగ్టన్ : పాత రకం కరోనా పూర్తిగా పోనేలేదు... అప్పుడే కొత్త రకం వైరస్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎక్కడికీ ప్రయాణించలేదు.. అమెరికాలోని డెన్వర్లోనే ఉన్న 20 ఏండ్ల కుర్రాడు.. ఆ యువకుడికి కొత్త రకం కరోనా వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు.
వివరాల్లోకెళితే.. యూకే లో వెలుగులోకి వచ్చిన కొత్త రకం కరోనా క్రమంగా ఇతర దేశాలకూ విస్తరిస్తోంది. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో ప్రవేశించింది. కొలరాడో రాష్ట్రంలో తొలి కొత్త రకం కేసు నమోదైనట్టు గవర్నర్ జేర్డ్ పొలిస్ ప్రకటించారు. డెన్వర్ కు చెందిన 20 ఏండ్ల యువకుడికి ఈ కొత్త రకం వైరస్ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల ఆ యువకుడు ఎక్కడికి ప్రయాణించిందీ లేదని అధికారులు తెలిపారు. దీన్ని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పరిగణనలోకి తీసుకుంది. వైరస్ సోకిన వ్యక్తితో ఇటీవల కలిసిన వారిని వెతికే పనిలో పడింది. ఇప్పటికే పాత రకం కరోనాతో అమెరికా అతలాకుతలమవుతోంది. క్రిస్మస్, కొత్త సంవత్సర సెలవుల తర్వాత ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ తరుణంలో కొత్త రకం వైరస్ వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
లైవ్లో టీకా తీసుకున్న కమలా హారిస్
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ మంగళవారం కరోనా టీకాను తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడాన్ని టివిలో లైవ్ ఇచ్చారు. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య రెండు కోట్లకు చేరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనాతో 3 లక్షల 35 వేలకు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వ్యాక్సిన్ను తీసుకోవడానికి ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదని సర్వే ఫలితాలు తెలిపాయి. వ్యాక్సిన్ తీసుకుంటున్న సందర్భంగా హారిస్ మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఆవశ్యకతను అందరికీ తెలియజేయా లనుకుంటున్నానని చెప్పారు. ఈ టీకాను తమ నివాస ప్రాంతంలోనే, పరిచయం ఉన్న వారి ద్వారానే తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. వాషింగ్టన్ లోని ఆఫ్రికా - అమెరికాల జనాభా అధికంగా ఉండే ప్రాంతంలోని యునైటెడ్ మెడికల్ సెంటర్లో ఆమె టీకా వేయించుకోవడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.