- దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ప్రజల పిలుపు - మద్దతు ప్రకటించిన అమెరికా యాంగూన్: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలను అణచివేయడానికి సైనికులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిరసనలపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ప్రజలు పిలుపునిచ్చారు. దేశంలో అతిపెద్ద నగరమైన యాంగూన్‌లో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి చేరి సైనిక చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ క్రమంలో అక్కడికి పెద్ద సంఖ్యలో సైనిక ట్రక్కులు చేరుకున్నాయి. సార్వత్రిక సమ్మె ప్రకటన నేపథ్యంలో ప్రజలను సైనిక పాలకులు హెచ్చరించారు. కాగా, మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ ఫిబ్రవరి 1 నుంచి నిర్బంధంలో ఉన్నారు. ఆమెను విడుదల చేయాలని ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. శనివారం మాండలేలో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 150 మంది వరకు గాయపడ్డారు. దీంతో అనేక ప్రాంతాల్లో నిరసనలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఈ నేపథ్యంలో తాజాగా అగ్రరాజ్యం అమెరికా స్పందిస్తూ.. శాంతియుత నిరసనలు తెలుపుతూ, మయన్మార్‌లో మళ్లీ ప్రజాస్వామ్య పాలన కోసం పోరాడుతున్న ప్రజలకు మద్దతు ఇస్తున్నట్టు పేర్కొంది. సైనికులు ప్రజలపై పాల్పడుతున్న చర్యలను ఆపాలని మయన్మార్ సైనిక పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నట్టు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైజ్ తెలిపారు. ప్రజల మనోభావాలను సైన్యం గౌరవించాలనీ, అక్రమంగా కేసులు పెట్టి నిర్బంధించిన జర్నలిస్టులను, ఉద్యమకారులను విడుదల చేయాలన్నారు. అలాగే, అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ట్విట్టర్‌లో ''ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న మయన్మార్ ప్రజలపై హింసకు పాల్పడిన వారిపై అమెరికా గట్టి చర్యలు తీసుకుంటుందని'' అని హెచ్చరించారు.